దగాపడ్డ తెలంగాణ యువతకు జనసేన అండగా ఉంటుంది

• తెలంగాణలో అవినీతి పెరిగిపోయింది.. ఆడబిడ్డల అదృశ్యంలో ఏపీతో పోటీ పడుతోంది
• తెలంగాణలోనూ మార్పు అవశ్యం… ఇక్కడ ప్రజల కోరిక మేరకే పోటీ చేస్తున్నాం
• తెలంగాణ అభివృద్ధికి జనసేన అండగా ఉంటుంది
• బీసీ ముఖ్యమంత్రి అయితేనే సామాజిక తెలంగాణ సాకారం అవుతుంది
• జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్ధులను గెలిపించండి
• కూకట్ పల్లి నియోజకవర్గం హస్మత్ పేట సభలో జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు
• బాలానగర్ చౌరస్తా నుంచి హస్మత్ పేట వరకూ భారీ రోడ్ షో… జనసేనానికి వెంట సాగిన వేలాది యువత

‘తెలంగాణ యువత ఏ అభివృద్ధి కోసం పోరాడిందో.. ఏ అభివృద్ది కోసం రోడ్ల మీదకు వచ్చి కొట్లాడిందో.. ఎలాంటి తెలంగాణ కోసం ఆత్మబలిదానాలు చేసిందో.. ఆ అభివృద్ధికి జనసేన పార్టీ అండగా ఉంటుంది. పార్టీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉంటార’ని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాటిచ్చారు. దగాపడ్డ తెలంగాణ యువతకు జనసేన పార్టీ తోడుగా ఉంటుందనీ… తెలంగాణలో జన సైనికులు ఉన్న ప్రతి చోటా సమస్యలపై పోరాటం చేస్తుందనీ… అభివృద్ధి, సమస్యలపై పోరాటం తప్ప అధికారం కోసం జనసేన పార్టీ ఏనాడు అర్రులు చాచదని చెప్పారు. దేశ సమగ్రతకు అండగా ఉండే పార్టీ జనసేన పార్టీ అని స్పష్టం చేశారు. తెలంగాణలో జనసేన – భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని స్థాపించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామన్నారు. గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి జనసేన పార్టీ అభ్యర్ధులను గెలిపించాలని కోరారు. మంగళవారం కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించారు. బాలానగర్ చౌరస్తా నుంచి హస్మత్ పేట వరకూ సుమారు 8 కి.మీ. మేర సాగిన ఈ యాత్రలో వేలాదిగా యువత పాల్గొని జనసేనానికి జేజేలు పలికారు. పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, కూకట్ పల్లి జనసేన అభ్యర్ధి శ్రీ ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ గారు ఈ రోడ్ షోలో పాల్గొన్నారు.
అనంతరం ఓల్డ్ బోయిన్ పల్లి డివిజన్ హస్మత్ పేట అంబేద్కర్ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన సభలో ఆశేష జనవాహినిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలు విడిచిన 1200 మంది బలి దానాలకు గౌరవం ఇచ్చి దశాబ్దకాలం తెలంగాణలో పోటీకి జనసేన పార్టీ దూరంగా ఉంది. అభిమాన బలం, కార్యకర్తల బలం ఉన్నప్పటికీ సేవా కార్యక్రమాలు చేపట్టడం, సమస్యలపై పోరాటం చేయడం తప్ప ఎప్పుడూ పోటీ చేయాలన్న ఆలోచన చేయలేదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలు కోరుకోబట్టే ఇక్కడ పోటీ చేయాలని నిర్ణయించాము. జనసేన పార్టీ ఒక కులం కోసమో, మతం కోసమో పుట్టిన పార్టీ కాదు. ప్రజలు ఎక్కడ కష్టాల్లో ఉంటే అక్కడ అండగా ఉండే పార్టీ. ప్రధాన మంత్రి శ్రీ మోదీ గారి స్ఫూర్తితో సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్ నినాదానికి కట్టుబడి ముందుకు వెళ్తుంది. ఆంధ్ర జన్మనిస్తే.. తెలంగాణ పునర్జన్మనిచ్చింది. ఇక్కడ అభివృద్ధి ఫలాలు అందరికీ చేరాలన్నదే మా లక్ష్యం. అందు కోసం శ్రీ మోదీ గారి ఆలోచనలకు అనుగుణంగా ముందుకు నడుస్తాం.
• వైఎస్ హయాం జలయజ్ఞం దోపిడీ పరిస్థితులు నేటి తెలంగాణలో
రాష్ట్ర విభజనకు ముందు వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జలయజ్ఞం పేరిట దోపిడి జరిగింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఇక్కడ అలాంటి దోపిడి ఉండకూడదని భావించాం. దురదృష్టవశాత్తు ఇప్పుడు అవే పరిస్థితులు తెలంగాణలో నెలకొన్నాయి. అవినీతి పెరిగిపోయింది. రాష్ట్రం కోసం యువత ఆశలకు అనుగుణంగా పరిస్థితులు లేవు. చివరికి లంచాలు ఇస్తే గాని ఉద్యోగాలు రావడం లేదు. ట్రాన్స్ ఫర్లు రావు.
తెలంగాణ నాకు పునర్జన్మనిచ్చిన నేల. ఇక్కడ ప్రజలు కోరుకున్న రోజునే ఇక్కడి నుంచి జనసేన పొటీ చేస్తోంది. తెలంగాణలోనూ మార్పు రావాలి. ఇక్కడా ఆడబిడ్డలకు భద్రత లేదు. ఆంధ్రాలో ఎన్ని వేల మంది ఆడబిడ్డలు అదృశ్యమయ్యారో తెలంగాణలోనూ అదే పరిస్థితి ఉంది. జనసేనకు యువత బలం ఉంది. ఆదే బలంతో సమస్యలపై పోరాటం చేస్తాం. నాకు ఆంధ్ర – తెలంగాణ రెండూ సమానమే. నాకు అధికారం అవసరం లేదు. మార్పు కావాలి. అందుకోసం సంపూర్ణంగా పని చేస్తాను. తెలంగాణలో బీసీలకు అత్యున్నత నాయకత్వం రావాలన్నది మా ఆకాంక్ష. గాయపడ్డ ప్రజా పాట శ్రీ గద్దర్ గారు 2009లో నన్ను కలిసినప్పుడు బీసీ ముఖ్యమంత్రి కావాలని కోరుకున్నారు. ఏ సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేశామో.. బీసీ ముఖ్యమంత్రితో ఆ ఆశయం నెరవేరుతుంది. శ్రీ నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఆ ఆకాంక్ష నెరవేరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అందుకే మేము మోదీ గారి నాయకత్వంలో కలసి నడుస్తున్నాం.
• ఈ సీఎంతో జగన్ రెడ్డికి బాంధవ్యం ఉన్నా బీసీల బాధలు పట్టవు
ఆంధ్ర ప్రదేశ్ నుంచి ఉపాధి కోసం వచ్చిన 26 బీసీ కులాలకు తెలంగాణ ఆవిర్భావం తర్వాత రిజర్వేషన్లు తీసేశారు. బీసీ స్టేటస్ పోయిన వారంతా ఆంధ్ర ప్రదేశ్లో ఉన్న మీ బంధువులతో అక్కడ ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని ప్రశ్నించమని చెప్పండి. ఇక్కడ ముఖ్యమంత్రికి జగన్ స్నేహితుడు. ఈ సీఎంతో మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. మా బీసీలకు అన్యాయం జరిగిందని ఎందుకు ఒక్కసారి కూడా అడగడో కనుక్కోండి. శ్రీ మోదీ గారి నాయకత్వంలో తెలంగాణలో జనసేన – బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే కోల్పోయిన బీసీ రిజర్వేషన్ ఆ 26 కులాలకు ఇక్కడ కొనసాగించాలని ఉమ్మడి ముఖ్యమంత్రిని కోరతాను. ఏ సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేశామో.. బీసీలు ముఖ్యమంత్రి కావాలన్నది మా ఆకాంక్ష. మోదీ గారి నాయకత్వంలో ఆ ఆకాంక్ష తీరే రోజులు దగ్గరలో ఉన్నాయి.
• హైవేకి శ్రీ బూర్గుల పేరు.. ఆంధ్రప్రదేశ్ లో శ్రీ గద్దర్ విగ్రహం
తెలంగాణ యువతకు అండగా ఉంటానని శ్రీ గద్దర్ గారికి మాటిచ్చాను. కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు ఇక్కడ యువతకు, ఆడపడుచులకు కోసం నిలబడతాం. నేను ఆంధ్ర ప్రదేశ్ లో కౌలు రైతులకు సాయం చేసే సమయంలో కులం, మతం చూడలేదు. అందరికీ సమానంగా సాయం చేశాం. వివక్ష చూపకుండా ఎంతో మంది ముస్లిం రైతు కుటుంబాలకు సాయం చేశాం. మీరంతా మద్దతు ఇవ్వండి. ముస్లిం సోదరులకు జనసేన పార్టీ అండగా ఉంటుంది. తెలుగు ప్రజల ఐక్యత కోసం పదవీ త్యాగం చేసిన నాటి ముఖ్యమంత్రి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారికి ఇక్కడ తగిన గుర్తింపు లభించలేదు. ఆంధ్రప్రదేశ్ లో జనసేన – తెలుగుదేశం ప్రభుత్వ స్థాపన తర్వాత అక్కడ ఆయన శిలావిగ్రహం ఏర్పాటు చేస్తాం. జాతీయ రహదారికి శ్రీ బూర్గుల రామకృష్ణారావు గారి పేరు పెడతాం. శ్రీ గద్దర్ గారి విగ్రహం కూడా ఏపీలో పెట్టించే బాధ్యత జనసేన తీసుకుంటుంది.
• గాజు గ్లాసుకు ఓటు వేయండి.. విశ్వాసంగా పని చేస్తుంది
పగ, ప్రతీకారాలతో కూడిన రాజయాలకు మేము దూరం. బీజేపీ సంపూర్ణ విజయం కోసం తెలంగాణలో ఉన్న ప్రతి జనసైనికుడు జనసేన – బీజేపీ ఉమ్మడి అభ్యర్ధులకు ఓటు వేయాలి. కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన పార్టీ అభ్యర్ధిగా శ్రీ ప్రేమ కుమార్ గారు పోటీ చేస్తున్నారు. గతంలో ఈ డివిజన్ గెలిచాము. మరోసారి బోయిన్ పల్లి ప్రజలంతా జనసేనకు మద్దతు ఇవ్వండి. ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ గారిని గెలిపించండి. ఈ డివిజన్ లో ఏ సమస్య వచ్చినా మీకు అండగా స్వయంగా నేనే వచ్చి నిలబడుతాను. కూకట్ పల్లి నియోజకవర్గంలో జనసేన అభ్యర్ధికి బ్యాలెట్ బాక్సులో 7వ నంబర్ వద్ద గాజు గ్లాసు గుర్తు ఉంటుంది గుర్తు పెట్టుకుని మరీ మనస్ఫూర్తిగా ఓటు వేయండి. గాజు గ్లాసు మీ కోసం విశ్వాసంగా పని చేస్తుంది. జనసేన మీకు గుండె ధైర్యాన్ని ఇస్తుంది. మీరు కోరుకున్న దానికి అండగా నిలుస్తుంది. ప్రతి ఒక్కరు మనస్ఫూర్తిగా ఓటు వేయాలని కోరుతున్నాను
2008 నుంచి రాజకీయాల్లో ఉన్నా ఏ రోజు ఓటమి నన్ను వెనక్కి తీసుకువెళ్లలేదు. జీవితంలో గెలుపు చూడలేదు. పోరాటం ఆపలేదు. ఓడిన ప్రతిసారి పెరుగుతూనే ఉన్నా. సిద్ధాంతం కోసం కట్టుబడి ఉన్న బీజేపీ స్ఫూర్తితో ముందుకు వెళ్దాం. ఉమ్మడి అభ్యర్ధిని గెలిపించుకుందాం” అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఉపాధ్యక్షుడు శ్రీ బి.మహేందర్ రెడ్డి, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు శ్రీ రాధారం రాజలింగంతోపాటు బీజేపీ నాయకులు పాల్గొన్నారు.
• పూల వర్షంతో ముంచెత్తిన జనసేన శ్రేణులు
తెలంగాణ ఎన్నికల ప్రచారం ముగింపు రోజున జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూకట్ పల్లి నియోజకవర్గం పరిధిలో భారీ రోడ్ షో నిర్వహించారు. నియోజకవర్గం పరిధిలోని బాలానగర్ జంక్షన్ నుంచి మొదలై బోయిన్ పల్లి సర్కిల్, ఓల్డ్ బోయిన్ పల్లి, హస్మత్ పేట అంబేద్కర్ విగ్రహం వరకు సాగిన ఈ రోడ్ షో ఆద్యంతం జనసేన శ్రేణుల కేరింతలు, జేజేల మధ్య సాగింది. పోలింగ్ కి ముందు పార్టీ శ్రేణుల్లో రెట్టించిన ఉత్సాహం నింపింది. మధ్యాహ్నం 3 గంటలకు బాలానగర్ క్రాస్ రోడ్డుకు చేరుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జన సైనికులు, వీర మహిళలు, ప్రజలు పూల వర్షంతో స్వాగతం పలికారు. ఆడపడుచులు హారతులు పట్టారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మద్దతుగా తరలివచ్చిన మహిళలు, జనసేన శ్రేణులతో రహదారులు కిక్కిరిశాయి. దారి పొడవునా భారీ గజమాలలతో జనసేనానికి స్వాగతం పలికారు. సుమారు గంటకుపైగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో నిర్వహించారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలతో పాటు టీడీపీ కార్యకర్తలు కూడా జెండాలతో వచ్చి రోడ్ షోకి మద్దతు పలికారు.