వైసీపీ విషప్రచారాన్ని బలంగా తిప్పి కొట్టాలి

  • జగన్ రెడ్డి వికృత మనస్తత్వంపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి
  • వైసీపీ విముక్త ఆంద్రప్రదేశ్ లక్ష్యంగా ముందుకు సాగాలి
  • జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి

గుంటూరు: రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తాయని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రకటించినప్పటినుంచి సోషల్ మీడియా వేదికగా వైసీపీ నేతలు చేస్తున్న విషప్రచారాన్ని బలంగా తిప్పికొట్టాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి జనసైనికులను కోరారు. 22 వ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ ఆధ్వర్యంలో వైసీపీ నేతల కబంధ హస్తాల్లోంచి రాష్ట్రాన్ని విముక్తి చేయమంటూ శుక్రవారం స్థానిక శ్రీనివాసరావుతోటలోని స్వాతంత్ర్య సమరయోధులు కన్నెగంటి హనుమంతు విగ్రహానికి వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా ఆళ్ళ హరి మాట్లాడుతూ జనసేన టీడీపీల పొత్తు కుదిరిన క్షణం నుంచి వైసీపీ నేతల వెన్నులో వణుకుమొదలైందన్నారు. ఎంతమంది కలిసొచ్చినా తమదే విజయం అంటూ వైసీపీ నేతలు మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారన్నారన్నారు. రానున్న ఎన్నికల్లో తమ ఓటమి కళ్ళముందు కదలాడుతుండటంతో వైసీపీ నేతలు మతి గతి తప్పి మాట్లాడుతున్నారని విమర్శించారు. వైసీపీ యువనేత సజ్జల భార్గవ్ రెడ్డి నేతృత్వంలోని వైసీపీ సోషల్ మీడియా పవన్ కల్యాణ్ , చంద్రబాబునాయుడు , లోకేష్ లు గతంలో చేసిన వ్యాఖ్యలను ఇప్పటి వీడియోలకు మార్ఫింగ్ చేసి ప్రజలను తప్పుదారి పట్టించేలా కుట్రలు పన్నుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్లాది రూపాయలు వెచ్చించి వేలాదిమంది పేటీఎం బ్యాచ్ తో ప్రతిపక్షాలపై అసత్య ప్రచారాలను వీడియోల రూపంలో ప్రసారం చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ పన్నే కుట్రలను జనసేన పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో చేదిస్తున్నాయన్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్ల కాలంలో అరాచకాలు, అవినీతి, దోపిడీ, దౌర్జన్యాలు, కబ్జాలు , దందాలు తప్పా రాష్ట్ర సమగ్రాభివృద్ధికి ఏనాడూ కృషిచేసిన పాపాన పోలేదని దుయ్యబట్టారు. అభివృద్ధి అనే పదమే తమ పరిపాలనా నిఘంటువులో లేదన్నట్లుగా వైసీపీ నేతలు అభివృద్ధిని అటకెక్కించారని ధ్వజమెత్తారు. తమ దాష్టీకాలపై ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ గొంతు నొక్కటమే పనిగా పెట్టుకున్నారని , సామాన్యుని నుంచి చంద్రబాబునాయుడు వరకు ఎవరినీ ఈ ప్రభుత్వం వదలలేదన్నారు. సంక్షేమ పథకాల ముసుగులో రాష్ట్రాన్ని అప్పులకుంపటిగా మార్చారని, ఇచ్చేది గోరంత, ప్రచారం చేసుకునేది కొండంత అన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ మళ్ళీ వైసీపీ రాకూడదని ప్రజలు కోరుకుంటున్నారని, ఈ క్రమంలో జనసేన టీడీపీ కూటమికి ప్రజలు పెద్దఎత్తున మద్దతు పలుకుతున్నారని ఆళ్ళ హరి అన్నారు. కార్యక్రమంలో నగర కమిటీ కార్యదర్శి మెహబూబ్ బాషా, డివిజన్ అధ్యక్షులు గడ్డం రోశయ్య, చెన్నంశెట్టి శ్రీకాంత్, యూసఫ్, పీ రమేష్, నండూరి స్వామి, వడ్డె సుబ్బారావు, అలా కాసులు, బాలాజీ, శ్రీనివాస్, రాంబాబు, దుర్గ తదితరులు పాల్గొన్నారు.