వైసీపీకి రిటైర్మెంట్ టైమ్ దగ్గరపడింది

• పాలన అంటే వాళ్లకు కామెడీ అయిపోయింది
• వైసీపీలో మాట్లాడే వారిలో ఎక్కువ మంది ఐటమ్ రాజాలు, ఐటమ్ రాణులే
• ఎప్పుడు ఏం మాట్లాడతారో వారికే తెలియదు
• జన సైనికులు, వీర మహిళలే పార్టీకి ఆక్సిజన్
• ఓటు హక్కు ఆంధ్ర ప్రదేశ్ కి మార్చుకోవడం వల్లే తెలంగాణలో వినియోగించుకోలేదు
• నెల్లూరు సిటీ, సూళ్ళూరుపేట, కోవూరు నియోజకవర్గాల జనసేన ఆత్మీయ సమావేశంలో శ్రీ నాగబాబు

‘వైసీపీ నాయకులకు పరిపాలన అంటే పెద్ద కామెడీ అయిపోయింది. చివర్లో నోట్లు ఇస్తే ఓట్లు వేస్తారనే గుడ్డి నమ్మకంతో ఈ నాలుగున్నరేళ్లు అభివృద్ధిని గాలికొదిలేశారు. ఎన్నికలకు మరో మూడు నెలలే సమయం ఉంది. ఈ విలువైన కాలంలో మనందరం కలసికట్టుగా వైసీపీ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగట్టగలిగితే రాష్ట్రం నుంచి వైసీపీని తరిమేయొచ్చ’ని జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు అన్నారు. మనం పోరాడుతున్నది ఒక బ్రహ్మ రాక్షసుడుతో… కలసికట్టుగా పని చేయకపోతే ఆ రాక్షసుడుని ఓడించలేమన్నారు. ఆదివారం నెల్లూరు నగరంలోని రవీంద్రనాధ్ ఠాగూర్ హాల్ లో నెల్లూరు సిటీ, కోవూరు, సూళ్ళూరుపేట నియోజకవర్గ జనసేన నాయకులు, జన సైనికులు, వీర మహిళలతో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ నాగబాబు గారు మాట్లాడుతూ… “జనసేన పార్టీ అనేది కుటుంబం. జన సైనికులు, వీర మహిళలే పార్టీకి ఆక్సిజన్. ఎన్ని ఒడిదొడుకులు ఎదురైనా వాళ్ల అండతోనే పార్టీ దశాబ్ధ కాలంగా ఏ ఆటంకం లేకుండా ముందుకు నడుస్తోంది. పార్టీలో జన సైనికుడు, వీర మహిళలకు మించిన పెద్ద పదవి ఏదీ లేదు. అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారు, పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు ఒకటికి పదిసార్లు ఆలోచించాకే పార్టీలో ఎవరికైనా బాధ్యతలు ఇస్తారు. వాళ్లు నియమించిన వ్యక్తిని ఎవరైనా తక్కువ చేయడం, కించపరచడం వంటివి చేస్తే … అది శ్రీ పవన్ కళ్యాణ్ గారిని, శ్రీ మనోహర్ గారిని అవమానించినట్లే.
• హాఫ్ బ్రెయిన్ మంత్రులు పాలిస్తున్నారు
ఒక మంత్రేమో పథకాలు ముఖ్యమా? రోడ్లు ముఖ్యమా? అని అడుగుతాడు. ఇంకో మంత్రి ఎక్కువ మంది చదువుకోవడం వల్ల రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పెరిగింది అని మాట్లాడతాడు. స్థానిక వైసీపీ ఎమ్మెల్యే ఇరిగేషన్ మంత్రిగా ఉన్న సమయంలో పోలవరం ప్రాజెక్టును ఏడాదిలో పూర్తి చేస్తామని ప్రగల్భాలు పలికాడు. వైసీపీ పాలన నాలుగున్నరేళ్లు పూర్తయినా ప్రాజెక్టులో పురోగతి లేదు. తర్వాత వచ్చిన ఇరిగేషన్ మంత్రిని పోలవరం ఎప్పుడు పూర్తవుతుంది అని అడిగితే త్వరలోనే పూర్తి చేస్తాం అని చెప్పారు. ఇప్పుడు అదే ప్రశ్న వేస్తే ఎప్పుడు పూర్తవుతుందో చెప్పలేం అని మాట్లాడుతున్నాడు. పాలన అంటే వైసీపీ నాయకులకు పెద్ద కామెడీ అయిపోయింది. ఇలాంటి హాఫ్ బ్రెయిన్ వ్యక్తులు మంత్రులుగా మన రాష్ట్రాన్ని పాలిస్తుంటే అభివృద్ధి ఇంకెక్కడ జరుగుతుంది. వైసీపీ పార్టీ నుంచి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేవాళ్లలో చాలా మంది ఐటమ్ రాజాలు, ఐటమ్ రాణులే ఉన్నారు. ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్లకే తెలియదు. కోవూరు ఎమ్మెల్యే శ్రీ నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయితే నోటికి ఏదీ వస్తే అది మాట్లాడతారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పాలన చూసి వైఎస్ జగన్ కు ఓటు వేసినట్లు… ప్రసన్నకుమార్ రెడ్డి తండ్రిగారు శ్రీ నల్లపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి గారిని చూసి ఆయన్ను గెలిపించారు. ఆయన ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. నోటికొచ్చినట్లు మాట్లాడతాడు. తిరుమల ఘాట్ రోడ్డులో ఒక చిన్నారిని చిరుతపులి చంపేస్తే తల్లిదండ్రుల మీద అనుమానం ఉంది అంటాడు. ఇంకో వైసీపీ మంత్రి ఆడబిడ్డలపై అత్యాచారం జరిగితే తల్లిదండ్రుల పెంపకం సరిగా లేదని మాట్లాడతారు. చివరకు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సైతం శ్రీ పవన్ కళ్యాణ్ గారిపై వ్యక్తిగత విమర్శలు చేస్తాడు. ఏం ముఖ్యమంత్రి కుటుంబ వ్యక్తిగత విషయాలు మాకు తెలియదా? వాళ్ల తాత ముత్తాతల చరిత్ర మొత్తం తెలుసు. ఎందుకు బయటకు మాట్లాడం అంటే సంస్కారం అడ్డొచ్చి మాట్లాడం. దీనివల్ల ప్రజలకు రూపాయి ఉపయోగం ఉండదు కనుక మాట్లాడం. అధినాయకుడే దిగజారి వ్యక్తిగత విమర్శలు చేస్తుంటే ఇంక మంత్రులు ఎలా మాట్లాడతారో మనం అర్ధం చేసుకోవచ్చు.
• మనం యుద్ధం చేస్తోంది బ్రహ్మ రాక్షసుడితో
వైసీపీ పాలనలో సామాన్యుడు చితికిపోయాడు. ప్రభుత్వ విధానాలపై ఎవరైనా ప్రశ్నిస్తే చాలు వాళ్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. అక్రమ కేసులు బనాయించి వేధిస్తున్నారు. సరైన ఆధారాలు చూపించకుండానే ఒక పార్టీ అధ్యక్షుడిని 50 రోజులకు పైగా రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టి హింసించారు. మన పార్టీ కార్యక్రమానికి స్థలం ఇచ్చారనే ఒకే ఒక్క కారణంతో ఇప్పటంలో ఇళ్లు కూల్చేశారు. వారిని పరామర్శించడానికి వెళ్లిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారు. జనవాణి కార్యక్రమం ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి విశాఖకు వెళ్తే కార్యక్రమం నిర్వహించుకోకుండా అడ్డుకున్నారు. మా కార్యకర్తలు, నాయకులపై కేసులు పెట్టి జైల్లో పెట్టారు. మమ్మల్ని కూడా అరెస్టు చేయడానికి చూశారు. లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వస్తుందని వెనక్కి తగ్గారు. మనం ఈ రోజు యుద్ధం చేస్తున్నది బ్రహ్మ రాక్షసుడితో. వైసీపీని గద్దె దించాలంటే మనందరం కలిసి కట్టుగా పనిచేయాలి.
• అలా కోరుకున్నవాడు నియంతే
నాకు రాజకీయ పదవులపై ఆసక్తి లేదు. నెల్లూరు ఎంపీగా పోటీ చేస్తాననేది అబద్ధపు ప్రచారం. సేవ చేయాలనే పార్టీలోకి వచ్చాను తప్ప పదవుల కోసం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఓటు మార్చుకోవాలనే హైదరాబాద్ లో ఉన్న నా ఓటును క్యాన్సిల్ చేసుకున్నాను. మొన్న జరిగిన తెలంగాణ ఎన్నికల్లో నేను, నా కుటుంబం ఓటు వేయలేదు. మంగళగిరిలో ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకుంటే ఓటు హక్కు రాకుండా బూత్ లెవల్ స్థాయిలో కూడా వైసీపీ నేతలు అడ్డుపడుతున్నారు. నా ఓటును జనసేన- తెలుగుదేశం కూటమి అభ్యర్థికి వేయడానికి సిద్ధంగా ఉన్నాను. ప్రజాస్వామ్యాన్ని గౌరవించే ఏ నాయకుడు కూడా ప్రతిపక్షం ఉండకూడదని కోరుకోడు. అలా కోరుకున్నాడు అంటే వాడు నియంతే అవుతాడు. మేము మాత్రం వైసీపీ 25 సీట్లతో ప్రతిపక్షంలో ఉండాలని కోరుకుంటున్నాం” అని అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా అధ్యక్షులు శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, పార్టీ జాతీయ అధికార ప్రతినిధి శ్రీ వేములపాటి అజయ్ కుమార్, పార్టీ ఆస్ట్రేలియ కన్వీనర్ శ్రీ కొలికొండ శశిధర్, పార్టీ నాయకులు శ్రీ కొట్టే వెంకటేశ్వరులు, శ్రీ చప్పిడి శ్రీనివాసులు రెడ్డి, శ్రీ ఉయ్యాల ప్రవీణ్, శ్రీ సుజయ్ బాబు, శ్రీ సుందరరామి రెడ్డి, శ్రీ గునుకుల కిషోర్, శ్రీ గుడి హరి కుమార్ రెడ్డి, శ్రీ వేటూరి రవి కుమార్, శ్రీ కారంపూడి కృష్ణారెడ్డి, శ్రీ పి. చంద్రశేఖర్ రెడ్డి, శ్రీ నక్కల శివకృష్ణ, శ్రీ చదలవాడ రాజేష్, శ్రీమతి అలియా, శ్రీమతి నాగరత్నం తదితరులు పాల్గొన్నారు.
• శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి దీక్షకు మా మద్దతు ఉంటుంది
సర్వేపల్లి నియోజకవర్గం పొదలకూరు మండలం తాటిపర్తి గ్రామంలో అధికార పార్టీ నాయకులు నిర్వహిస్తున్న అక్రమ మైనింగ్ కు వ్యతిరేకంగా తెలుగుదేశం పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీ సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సత్యగ్రహ దీక్షను చేస్తున్నారు. ఆయన దీక్షకు మద్దతుగా అక్కడికి వచ్చి మద్దతు తెలపాలి అనుకున్నాను. అయితే సమయాభావం, ముందుగా నిర్ణయించిన కార్యక్రమాల వల్ల రాలేకపోతున్నాను. నేను రాలేకపోయినా నా మద్దతు, జనసేన పార్టీ మద్దతు ఆయనకు ఉంటుంది.
• శ్రీ నాగబాబుని మర్యాదపూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి
నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న శ్రీ నాగబాబు గారిని నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మర్యాదపూర్వకంగా కలిశారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా ఆత్మీయ సమావేశాలు జరుగుతున్న రవీంద్రనాధ్ ఠాగూర్ హాలుకు తరలివచ్చి శ్రీ నాగబాబు గారికి పుష్పగుచ్ఛం ఇచ్చి శాలువాతో సత్కరించారు. రాష్ట్ర అభివృద్ధికి కలిసి పనిచేద్దామని అన్నారు.
• జనసేన పార్టీలో పలువురు చేరిక
కోవూరు నియోజకవర్గం కొడవలూరు మండలం కొత్తవంగల్లు గ్రామం నుంచి దాదాపు 200 కుటుంబాలు… కోవూరు మండలం పాలూరు గ్రామంకు చెందిన దాదాపు 100 కుటుంబాలు వైసీపీ నుంచి జనసేన పార్టీలో చేరాయి. వీరందరినీ పార్టీలోకి సాదరంగా ఆహ్వానించిన శ్రీ నాగబాబు గారు… శ్రీ చక్కా సూలం, శ్రీ చక్కా సాగర్, శ్రీ జడ శేషాద్రి, శ్రీ దాసం వినయ్ కుమార్, శ్రీ జడ సురేష్, శ్రీ దుర్గం చంద్రయ్యలకు పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు.