సున్నా వడ్డీకి సున్నం – పావలా వడ్డీకి పాతర!

* 20 శాతం రైతులకు కూడా దక్కని ప్రయోజనం
* 3 ఎకరాల రైతుకు కూడా లక్ష పైగా రుణాలిస్తున్న బ్యాంకులు
* వచ్చినంత రుణం తీసుకుంటున్న రైతులు
* గణనీయంగా తగ్గిన లక్ష లోపు రుణాల రైతులు

రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వాలు అనేక పథకాలు పెడుతూ ఉంటాయి. ఇలా వచ్చిన పథకాల్లో పావలా వడ్డీ, సున్నా వడ్డీ పథకాలు చేరాయి. ఈ పథకాలు కొత్తగా వచ్చినవి కావు. ఉమ్మడి రాష్ట్రంలో కూడా పావలా వడ్డీ, సున్నా వడ్డీ రాయితీ పథకాలు అమల్లో ఉన్నాయి. అయితే నిబంధనల పేరుతో బ్యాంకు రుణాలు పొందిన రైతులందరికీ ఈ పథకాలు వర్తించకుండా ఆటంకాలు సృష్టించారు. రైతులను ఆదుకోవాలనే ఉద్దేశం ఉంటే, బ్యాంకుల నుంచి ఎంత పంట రుణం తీసుకున్నా వడ్డీ రాయితీలు వర్తించేలా చేయాలి. కానీ ఈ పథకాలను ఎన్నికల్లో ఓట్లు కొల్లగొట్టే పథకాల మాదిరి మార్చారు. నిబంధనల పేరుతో కనీసం 20 శాతం మందికి కూడా వడ్డీ రాయితీ దక్కకుండా చేశారు. రైతుకు సాగు ఖర్చులు తగ్గించి వ్యవసాయం దండగ కాదు, పండగ చేసి చూపిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అధికారంలోకి రాగానే పావలా వడ్డీ పథకానికి పాతర వేశారు. సున్నా వడ్డీ రాయితీలను నిబంధనల పేరు చెప్పి కొంతమందికే పరిమితం చేశారు. దీంతో రైతులు వడ్డీ రాయితీలపై అంతగా ప్రయోజనం పొందలేకపోతున్నారు.
*వడ్డీ రాయితీ రూ.3 వేల కోట్లు అన్నారు….
రాష్ట్రంలో 85 లక్షల మంది రైతులు ఉండగా వారిలో భూమి తాకట్టు పెట్టి రుణాలు తీసుకునే రైతులు 52 లక్షల మంది వరకూ ఉన్నారు. అయితే వారిలో 44 లక్షల మంది రైతులు లక్ష కంటే ఎక్కువ రుణాలు తీసుకుంటున్నారు. దీంతో సున్నా వడ్డీ పథకం కింద కనీసం 10 లక్షల మందికి కూడా ప్రయోజనం అందడం లేదు. ప్రస్తుతం ప్రభుత్వ లెక్కల ప్రకారమే సున్నా వడ్డీ పథకం కింద ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య 8.22 లక్షలు. లక్ష నుంచి 3 లక్షల వరకు రుణాలపై గతంలో పావలా వడ్డీ ఉండేది. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తేసింది. సున్నావడ్డీ పథకం మాత్రమే అమలులో ఉండేలా చేసింది. కేవలం లక్షలోపు రుణాలు తీసుకున్న వారికే ఈ పథకం వర్తిస్తుందంటూ ఆంక్షలు విధించడంతో 44 లక్షల మంది రైతులు సున్నా వడ్డీ రాయితీ ప్రయోజనాలు పొందలేకపోతున్నారు. ఏటా వడ్డీ రాయితీకి రూ.3 వేల కోట్లు ఇస్తామని సీఎం జగన్ రెడ్డి 2019లో అసెంబ్లీ సాక్షిగా చెప్పారు. ఆ వెంటనే పావలా వడ్డీ పథకాన్ని రద్దు చేసి, సున్నావడ్డీ రాయితీ పథకం మాత్రమే అమలులో ఉండేలా చేశారు.
రాష్ట్రంలో 85 లక్షల మంది రైతులు ఉన్నారు. వారిలో 2.5 ఎకరాలలోపు భూమి ఉన్నవారు 69 శాతం కాగా, 5 ఎకరాలలోపు వారు 75.5 లక్షలు ఉన్నారని ప్రభుత్వ గణాంకాల ద్వారా తెలుస్తోంది. వీరందరికీ ప్రయోజనం దక్కేలా పదేళ్ల కిందట రూ.లక్ష రుణాలకు సున్నా వడ్డీ ప్రకటించారు. అదే స్లాబ్ నేడు కూడా కొనసాగుతోంది. పథకం ద్వారా ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం దక్కాలంటే కనీసం రూ.2 లక్షల రుణాలకు సున్నా వడ్డీ రాయితీ వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. పదేళ్ల కిందటితో పోల్చుకుంటే సాగు ఖర్చులు 2 రెట్లు పెరిగాయి. బ్యాంకు రుణ పరిమితులు కూడా గణనీయంగా పెంచాయి. లక్ష లోపు పంట రుణం తీసుకునే రైతుల సంఖ్య భారీగా తగ్గింది. దీంతో సున్నా వడ్డీ రాయితీ అందకుండా పోతోంది.
*ఇచ్చింది రూ.654 కోట్లే….
పంట రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ 9 శాతం, ఏడాది లోపే రుణం తిరిగి చెల్లిస్తే 5 శాతం రాయితీ అందిస్తారు. రైతుల వాటా 4 శాతం ఉంటుంది. లక్ష లోపు రుణం తీసుకుని, ఏడాదిలోపు చెల్లిస్తే రైతుల వాటా 4 శాతం వడ్డీ ప్రభుత్వం చెల్లిస్తోంది. గతంలో లక్ష నుంచి రూ.3 లక్షల వరకు తీసుకుని ఏడాది లోపు చెల్లిస్తే పావలా వడ్డీ కింద 1 శాతం వడ్డీ రాయితీని ప్రభుత్వం ఇచ్చేది. 3 శాతం రైతులు చెల్లించేవారు. పావలా వడ్డీ పథకం రద్దు చేయడంతో ఎక్కువ మంది రైతులకు ప్రయోజనం దక్కడం లేదు. 2019 నుంచి 2022 వరకు రైతులు రూ.146261 కోట్లు పంట రుణాలు తీసుకున్నారు. సున్నా వడ్డీ పథకం కింద 4 శాతం వడ్డీ లెక్కిస్తే ప్రభుత్వం ఇప్పటి వరకు రూ.5,850 కోట్లు చెల్లించాలి. కాని ఇప్పటి వరకు ఇచ్చింది మాత్రం రూ.1834 కోట్లు మాత్రమే. వీటిల్లో గత ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు రూ.1180 కోట్లుగా వైసీపీ ప్రభుత్వం చెబుతోంది. అంటే 2019 నుంచి 2022 వరకు రైతులు తీసుకున్న రుణాలపై సున్నా వడ్డీ రాయితీ రూ.654 కోట్లు మాత్రమే అని తేలుతోంది.
*ఆంక్షలతో అందని పథకం
సున్నా వడ్డీ రాయితీ దక్కాలంటే ఈ క్రాప్ తప్పనిసరిగా చేయించుకుని ఉండాలి. ఇక ఈ క్రాప్ ఏ పంటకైతే చేయించుకున్నారో అదే పంటకు బ్యాంకులో రుణాలు తీసుకోవాలి. పొలంలో ఒక పంట వేసి, ఎక్కువ రుణం వచ్చే పంటలకు బ్యాంకులో రుణాలు తీసుకుంటే సున్నా వడ్డీ రాయితీ దక్కదు. లక్షపైన రుణం తీసుకుంటే వడ్డీ రాయితీ రాదు. 80 శాతం మంది రైతులు బ్యాంకుల నుంచి లక్ష కంటే ఎక్కువ రుణాలు పొందుతున్నారు. చిన్నకారు రైతులకు కూడా బ్యాంకులు లక్షకు పైగా పంట రుణాలు అందిస్తున్నాయి. దీంతో లక్షలోపు పంట రుణం తీసుకునేవారి సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది.
బ్యాంకుల పంట రుణాల విషయంలో పరిమితులు ఉన్నాయి. ఏ పంటకు ఎంత రుణం అనేది ముందే ప్రకటిస్తారు. వరి సాగుకు ఎకరాకు 40 వేలు, మొక్కజొన్నకు 32 వేలు, కంది,మినుము, పెసర పంటలకు 21 వేలు, శెనగ పంటకు ఎకరాకు 24 వేల పంట రుణం లభిస్తుంది. సోయా సాగు చేసే రైతుకు ఎకరాకు 26 వేలు, వేరుశెనగ సాగుకు 28 వేలు, ఆముదం పంటకు 20 వేలు, పత్తి సాగుచేసే రైతుకు 40 వేల రూపాయలు, మిర్చి, పసుపు, ఉద్యాన పంటలకు ఎకరాకు రూ.60వేల పంట రుణాలు అందిస్తున్నారు. అంటే రైతులు 3 ఎకరాల వరి కానీ, 3 ఎకరాల పత్తి కానీ, 3 ఎకరాల మిర్చి, పసుపు ఉద్యాన పంటల్లో ఏదో ఒకటి సాగు చేస్తే వారికి లక్షపైనే పంట రుణాలను బ్యాంకులు ఇస్తున్నాయి. దీంతో సున్నా వడ్డీ రాయితీ దక్కకుండా పోతోంది.
*వడ్డీ రాయితీ ప్రయోజనం అందరికీ దక్కాలంటే….
సున్నా వడ్డీ పథకం, పావలా వడ్డీ రాయితీ పథకం రెండూ రైతులకు ప్రయోజనం చేకూర్చేవే. అయితే సున్నా వడ్డీ రాయితీ పథకాన్ని కనీసం రూ.2 లక్షలకు పెంచాలి. ఇక రూ.2 లక్షలకన్నా ఎక్కువ రుణం తీసుకున్న వారికి, రూ.2 లక్షల వరకు సున్నావడ్డీ రాయితీ, ఆ తరవాత మొత్తానికి పావలా వడ్డీ వర్తించేలా చేయాలి. ఇలా చేయడం వల్ల బ్యాంకుల్లో పంట రుణాలు తీసుకున్న ప్రతి రైతుకు ప్రయోజనం దక్కుతుంది. అయితే ప్రభుత్వం పావలా వడ్డీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసింది. సున్నా వడ్డీ పథకాన్ని లక్షకే పరిమితం చేయడంతో రాయితీ ప్రయోజనం పొందే రైతులు కనీసం 20 శాతం మంది కూడా ఉండటం లేదు. నిబంధనలు సడలించి సున్నా వడ్డీ రాయితీ, పావలా వడ్డీ రాయితీ పథకాలు అమలు చేస్తే రైతులందరికీ ప్రయోజనం దక్కుతుంది.