శేషుని నీడలో ఏడుకొండల వాడు

తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గురువారం రాత్రి శ్రీదేవి, భూదేవి సమేతంగా శ్రీ మలయప్పస్వామి పెద్దశేష వాహనంపై భక్తులకు కటాక్షించారు. ఉత్సవాల సమయంలో స్వామివారు అధిరోహించే ఒక్కో వాహనానికి ఒక్కో విశిష్టత ఉంది. ప్రతి వాహనంపై నుంచి శ్రీవారు ఒక్కో సందేశమిస్తారు. విశిష్టాద్వైత సిద్ధాంతం ప్రకారం భగవంతుడు శేషి, స్వామి శేష వాహనంపై భక్తులకు ఈ శేష సంబంధాన్ని బోధించినట్లుగా దర్శనమిచ్చారు. పెద్దశేషునిపై స్వామివారు శ్రీ పరమపదనాథుని అలంకరణలో భక్తులకు సాక్షాత్కరించారు. ముందుగా ధ్వజారోహణ కార్యక్రమం మీనలగ్నం శుభ ముహూర్తంలో సాయంత్రం 5.10 నుంచి 5.30గంటల మధ్య జరిగింది. శ్రీ పెద్దజీయర్‌స్వామి, శ్రీ చిన్నజీయర్‌ స్వామి, తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి, ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి, అదనపు ఈవో ఏవీ ధర్మారెడ్డి సమక్షంలో ఈ మహాయజ్ఞానికి నాంది పలికారు. సాయంత్రం 3 నుంచి 4.30 గంటల వరకు బంగారు తిరుచ్చిపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారిని, పరివార దేవతలైన శ్రీ అనంత, గరుడ, చక్రత్తాళ్వార్‌, సేనాధిపతివారిని, ధ్వజపటాన్ని శ్రీవారి విమానప్రాకారం చుట్టూ ఊరేగించారు. ఈ సారి వినూత్నంగా వాహనమండపంలో చెక్కతో తయారుచేసిన బ్రహ్మరథాన్ని, ఏనుగులు, గుర్రం బొమ్మలను కొలువుదీర్చి బయట వాహనసేవ సమయంలో గజరాజులు, ఆశ్వాలు ముందుకు వెళుతుండగా స్వామివారి వాహనసేవ వైభవాన్ని భక్తులకు గుర్తుచేసేలా సెట్టింగులను ఏర్పాటుచేశారు. ఉత్సవంలో బోర్డు సభ్యులు ప్రశాంతిరెడ్డి, రాంభూపాల్‌రెడ్డి, మల్లీశ్వరి, మారుతీప్రసాద్‌, ఎం.రాములు, శంకర్‌, సీవీఎస్వో గోపినాథ్‌జెట్టి, ఆలయ డిప్యూటీ ఈవో రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

విజయవంతం కావాలని ప్రార్థించా.. వైవీ సుబ్బారెడ్డి

బ్రహ్మోత్సవాల్లో చిన్న సమస్య లేకుండా విజయవంతంగా ముగియాలని శ్రీవారిని ప్రార్థించానని తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ధ్వజారోహణం గురువారం సాయంత్రం జరిగింది. అనంతరం ఆలయం వెలుపల ఛైర్మన్‌ మీడియాతో మాట్లాడుతూ.. కొవిడ్‌ కారణంగా బ్రహ్మోత్సవాలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని చెప్పారు. భక్తులు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌ ద్వారా వాహనసేవలు వీక్షించి స్వామివారి ఆశీస్సులు పొందాలని కోరారు. అంతకుముందు ఈవో కె.ఎస్‌.జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ప్రారంభమయ్యాయని తెలిపారు. శుక్రవారం నుంచి ఉదయం, సాయంత్రం స్వామివారి వాహనసేవలు కొనసాగుతాయని చెప్పారు. బోర్డుసభ్యులు, తితిదే అధికారులు పాల్గొన్నారు.