మే నెల‌లో ఇంటివ‌ద్ద‌నే పింఛ‌న్ అందించే ఏర్పాట్లు చేయాలి

  • పింఛ‌న్ దారుల‌ ఇబ్బందుల‌ను ప్ర‌తిప‌క్షాల‌పై నెట్టే కుట్ర‌
  • ఎన్నిక‌ల సంఘం స్పందించాలి
  • జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి

చిల‌క‌లూరిపేట‌: వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళల జీవితాలతో ప్ర‌భుత్వం వికృతక్రీడకు సిద్ద‌మౌతుంద‌ని, ఇంటి వ‌ద్ద‌నే వీరికి పింఛ‌న్ అందించే ఉద్యోగులు ఉన్నా అధికారులు ఈ దిశ‌గా ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌ని జ‌న‌సేన పార్టీ సెంట్రల్ ఆంధ్ర కో -కన్వీనర్ పెంటేల బాలాజి ప్ర‌శ్నించారు. బుధ‌వారం ఆయ‌న కార్యాల‌యంలో ఏర్పాటు చేసిన విలేక‌ర్ల స‌మావేశంలో మాట్లాడుతూ ఏప్రిల్‌లో పింఛన్ల పంపిణీ సందర్భంగా వృద్ధుల్ని మండుటెండల్లో సచివాలయాలకు రప్పించి నరకయాతన పెట్టారని, దీని వ‌ల్ల 30 మందికి పైగా పింఛ‌న్ తిరిగి మరణించినా వీరి మనసు కరగడం లేదని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారం రోజుల్లో మే నెల పింఛన్ల పంపిణీ ప్రారంభించాల్సి ఉన్నా ఇంటి దగ్గరే పంపిణీపై స్పష్టత ఇవ్వ‌లేద‌న్నారు. రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలకు పైగా చేరాయ‌ని, ఇలాంటి కఠిన పరిస్థితుల్లోనూ.. వృద్ధుల్ని సచివాలయాలకు నడిపించి వారి ప్రాణాలతో చెలగాటం ఆడేందుకు ప్రభుత్వం సిద్ధమౌతుంద‌ని ఆరోపించారు. ఇదే విష‌యంపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూడా స్పందించి, ఇంటివ‌ద్ద‌నే పింఛ‌న్లు పంపిణీ చేయాల‌ని డిమాండ్ చేసిన విష‌యాన్ని గుర్తు చేశారు. పింఛ‌న్ దారుల‌ ఇబ్బందుల‌ను ప్ర‌తిప‌క్షాల‌పై నెట్టే కుట్ర‌ పింఛ‌న్ దారుల క‌ష్టాల‌ను ప్ర‌తిప‌క్షాల‌పై వేసే కుట్ర జ‌రుగుతుంద‌ని బాలాజి వివ‌రించారు. ఇంటి దగ్గర పింఛన్ల పంపిణీని ప్ర‌తిప‌క్షాలు అడ్డుకుంటాయ‌ని, వైసీపీకి ఓటేయకపోతే ఇంటి దగ్గరకు పింఛన్లు అందవని ప్ర‌చారం చేసుకోవ‌టానికి వైసీపీ అనుకూల అధికారులు చేస్తున్న కుటిల య‌త్నాల‌ను ప్ర‌జ‌లు గ‌మ‌నించాల‌న్నారు. మే నెలలోనూ సచివాలయాలకు నడిపించడం, పంపిణీలో జాప్యం చేయడం వ‌ల్ల వైసీపీ ప్ర‌చారం నిజ‌మ‌ని న‌మ్మించే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మండి ప‌డ్డారు. రాష్ట్రంలో 66 లక్షల మంది పింఛనుదారులు ఉంటే, గ్రామ/వార్డు సచివాలయ ఉద్యోగులు, వీఆర్‌ఓ, పంచాయతీ కార్యదర్శులు, ఇతర పంచాయతీ సిబ్బంది కలిపితే 1.30లక్షల మంది పైనే ఉన్నార‌ని. సగటున ఒక్కొక్కరు 40-50 మందికి పింఛ‌న్లు అందించినా రెండు రోజుల్లోనే పింఛ‌న్ పంపిణీ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయ‌వ‌చ్చ‌న్నారు. దీంతో పాటు స‌కాలంలో నిధులు జ‌మ‌చేయ‌కుండా పించ‌న్ పంపిణీ జాప్యం చేసే కుట్ర‌లు కూడా జ‌రిగే అవ‌కాశం ఉంద‌న్నారు. ఎన్నిక‌ల సంఘం క‌ల‌గ‌జేసుకొని ఇంటివ‌ద్ద‌నే లబ్దిదారుల‌కు పింఛ‌న్ అందించేలా చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరారు.