దీపోత్సవంతో దేదీప్యమానంగా ప్రకాశించిన అయోధ్య

దీపావళి పండుగ పురస్కరించుకుని అయోధ్యలో శుక్రవారం రాత్రి వెలిగించిన 6లక్షల దీపాల వెలుగులో అయోధ్య దేదీప్యమానంగా ప్రకాశించింది. ఈ దీపోత్సవ వేడుకలు ఆదివారం రాత్రి వరకూ జరగనున్నాయి. సుమారు 6లక్షల దీపాల వెలుగులో పుణ్యప్రదేశం మరింత పునీతమైంది.  శ్రీరాముడు సీతాసమేతంగా పుష్పక విమానంలో లంక నుంచి వచ్చిన ఘటనను లేజర్‌, సౌండ్‌ షోలో ప్రదర్శించారు. వీటితో పాటు పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా నిర్వహించడం విశేషం.

అయోధ్యలోని సాకేత్‌ కళాశాల నుంచి నదీతీరం వరకు సుమారు 5 కిమీ పొడవున శ్రీరామపట్టాభిషేకం ఘట్టాన్ని శకదాల ద్వారా ప్రదర్శించారు. రామాయణ కీలక ఘట్టాల్ని ప్రతిబింబించేలా శకటాలు కనువిందు చేశాయి. రామజన్మభూమిలో 11వేల దీపాలను శుక్రవారం సాయంత్రం వెలిగించారు. సూర్యాస్తమయం అనంతరం సరయూనది తీరాన కళ్లు చెదిరే రీతిన హారతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కరోనా నిబంధనలకు అనుగుణంగానే అన్ని ఏర్పాట్లు చేసేలా జాగ్రత్తలు తీసుకున్నామని జిల్లా మేజిస్ట్రేటు అనూజ్‌ కుమార్‌ మీడియాకు తెలిపారు. ఈ వేడుకలు యుపి గవర్నర్‌ అనందీబెన్‌ పటేల్‌, సిఎం యోగి ఆదిత్యనాధ్‌ తదితరులు హాజరయ్యారు.

యూపీ గవర్నర్‌ ఆనందీబెన్‌ పటేల్‌, ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ ఈ వేడుకలకు హాజరయ్యారు. ”గడచిన 500ఏళ్లలో ఎంతోమంది సాధువులు, పుణ్యాత్ములు రామజన్మభూమిలో రామాలయాన్ని చూడాలని కలగన్నారు. ఇది చూడగలుగుతున్న మన తరం ఎంతో అదృష్టవంతులం. రామరాజ్య స్థాపనకు కృషి చేసిన ప్రధాని మోదీకి నా కృతజ్ఞతలు” అని యోగి ఆదిత్యనాథ్‌ పేర్కొన్నారు.