ఓటు హక్కును వినియోగించుకున్న ప్రముఖులు

గ్రేటర్ ఎన్నికలు ప్రశాంతంగా మొదలయ్యాయి. కానీ ఇంకా పోలింగ్ ఊపందుకోలేదు. మొదటి రెండు గంటల్లో 4.5శాతం ఓటింగ్ నమోదు అయ్యింది. ఉదయం నుంచి వాతావరణం చాలా చల్లగా ఉండటంతో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్దకు నెమ్మదిగా వస్తున్నారు. చాలా చోట్ల ప్రముఖులు మొదటి గంటలోనే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. జూబ్లీహిల్స్ క్లబ్ లో చిరంజీవి దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రచయిత పరుచూరు గోపాలకృష్ణ ఓటు వేశారు.

నందినగర్‌లో కుటుంబ సభ్యులతో వచ్చి మంత్రి కేటీఆర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాచిగూడలో కేంద్ర సహాయమంత్రి కిషన్‌రెడ్డి ఓటు హక్కును వినియోగించుకున్నారు. కుందన్‌బాగ్‌లో రాచకొండ సీపీ ఓటు హక్కు వినియోగించుకోగా, నాంపల్లిలో సీపీ సజ్జనార్‌, మాదాపూర్ డీసీపీ వెంకటేశ్వర్‌లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.

జూబ్లిహిల్స్‌లోని పోలింగ్ కేంద్రంలో అక్కినేని నాగార్జున, ఆయన సతీమణి అమల ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరు ఓటు వేశారు. నటుడు రాజేంద్ర ప్రసాద్ కూడా ఓటు హక్కు వినియోగించుకున్నారు. మందకొడి ఓటింగ్‌పై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో ఓటు వేయాల్సిన బాధ్యత ప్రతీ ఒక్కరిపై ఉందన్నారు. ఓటు హక్కు ద్వారానే సుపరిపాలన అందుతుందనే విషయాన్ని అందరూ గమనించాలన్నారు. నగర అభివృద్ధిలో ప్రతీ ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరారు.

ఇక ఓటు హక్కు వినియోగించుకున్న పోలీసు ఉన్నతాధికారులు మాట్లాడుతూ.. ప్రతీ ఒక్కరూ నిర్భయంగా తమ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.