ఆరవ రోజుకు చేరిన రైతుల ఆందోళన

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వ్యవసాయ చట్టాలకు నిరసనగా చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్‌ నేటి తో ఆరవ రోజుకు చేరుకుంది. తమ డిమాండులు పరిష్కరించే వరకు ఆందోళన విరమించేది లేదని బైఠాయించారు.  హర్యానా-ఢిల్లీ సరిహద్దులో రైతులు తమ ఆందోళనను కొనసాగిస్తున్నారు. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు విజ్ఞాన భవన్‌లో చర్చలకు రావాలని రైతు సంఘాల నేతలకు సోమవారం రాత్రి ఆహ్వానం పంపారు. రెండు రోజుల కిందటే పలువురు కేంద్ర మంత్రులు రైతులతో చర్చలు జరిపేందుకు సిద్ధమని ప్రకటించారు. అయినా ఢిల్లీ సరిహద్దులోని సింఘు, తిక్రీ ప్రాంతాల్లో ఆందోళన కొనసాగించారు. చలి, కొవిడ్‌ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని రైతు సంఘాల నాయకులను చర్చలకు ఆహ్వానించినట్లు కేంద్రమంత్రి తోమర్‌ చెప్పారు. రైతులు తమ ఆందోళనను విరమించాలని సూచించారు. అంతకు ముందు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో వ్యవసాయమంత్రి సమావేశమయ్యారు. అన్ని విషయాలపై భేషరతుగా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. అయితే మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయడాన్ని గట్టిగా వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.

భారతీయ కిసాన్‌ యూనియన్ అధ్యక్షుడు బుటా సింగ్‌తో అమిత్‌ షా మాట్లాడిన తర్వాత చర్చల ప్రక్రియ ప్రారంభమైంది. అయితే వీటిని హోంమంత్రిత్వశాఖ ఖండించింది. అయితే సమస్య పరిష్కారానికి షా తనకు ఫోన్‌ చేశారని బుటాసింగ్‌ పేర్కొన్నారు. ముందస్తు షరతులు లేకుండా చర్చలకు ఆహ్వానించారని, అధికారిక ఆహ్వానం రాలేదని, వస్తే అందుకు అనుగుణంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇదిలా ఉండగా రైతులు మాత్రం కేంద్రం తీసుకువచ్చిన చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ ఆందోళనను కొనసాగిస్తున్నారు. తమ డిమాండ్లు చర్చించలేనివని, భారతీయ కిసాన్ యూనియన్ (డాకాండ) ప్రధాన కార్యదర్శి జగ్మోహన్ సింగ్ అన్నారు. మరో వైపు ప్రతిపక్ష పార్టీలు సైతం కేంద్రంపై ఒత్తిడి పెంచాయి. రైతుల ప్రజాస్వామ్య పోరాటాన్ని గౌరవించాలని, చట్టాలను రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశాయి. గత ఆరు రోజులుగా జరుగుతున్న ఆందోళనలు కేంద్రమంత్రితో జరిగే చర్చలతో ముగుస్తాయో లేదో మరికొద్ది గంటల్లో తేలనుంది.