రాజస్థాన్‌కు డబ్ల్యూహెచ్‌వో 100 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్ల విరాళం

కరోనా సెకండ్‌ వేవ్‌తో వణుకుతున్న భారత్‌కు పలు అంతర్జాతీయ సంస్థలు తమ వంతు సహకారం అందిస్తున్నాయి. తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) జైపూర్‌ యూనిట్‌ రాజస్థాన్‌ ప్రభుత్వానికి తన వంతు సాయంగా 100 ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లను విరాళంగా అందజేసింది. వీటిని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రఘుశర్మకు అందజేసింది. కరోనాపై పోరాటంలో తమ ప్రభుత్వానికి సహకారమందించిన డబ్ల్యూహెచ్‌వోకు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..

రాష్ట్రంలో ఆక్సిజన్‌ కొరతను అధిగమించేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని తెలిపారు. కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కింద రాష్ట్ర ప్రభుత్వానికి అందుతున్న ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు కొవిడ్‌పై పోరాటంలో ఎంతగానో ఉపయోగపడుతును్నాయని చెప్పారు.

ఈ సందర్భంగా డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి రాకేశ్‌ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. తాము అందజేసిన ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు జర్మనీ తయారు చేసినవని.. వీటి విలువ రూ.15కోట్లు అని తెలిపారు. ఈ కాన్సంట్రేటర్లు నిమిషానికి 8 లీటర్ల ఆక్సిజన్‌ను ఉత్పత్తి చేసే సామర్థ్యంతో పనిచేస్తాయన్నారు. అవసరాన్ని బట్టి నిమిషానికి 10లీటర్లు కూడా ఉత్పత్తి చేయవచ్చని వివరించారు.