పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి: గురాన అయ్యలు

విజయనగరం, తుఫాన్‌ వల్ల పంటలను నష్టపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణం వారిని ఆదుకోవాలని జనసేన నేత గురాన అయ్యలు డిమాండ్‌ చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మిచౌంగ్‌ తుఫాన్‌ కారణంగా పంటలు నష్టపోయి రైతులు ఆపదలో ఉంటే ప్రభుత్వం ఆడుకుందాం రా.. అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తుఫాన్‌ కారణంగా నష్టపోయిన రైతులకు పంట నష్ట పరిహారంతో పాటు సబ్సిడీపై విత్తనాలు, పురుగు మందులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంట పొలాల్లో నీరు, రైతుల కంట కన్నీళ్లు ఉంటే కనీసం ఈ ప్రభుత్వం భరోసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం మూడు వారాలుగా హెచ్చరిస్తున్నా జగన్‌ ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్లే రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు. ప్రభుత్వ అధికారులు ఇప్పటివరకు పంటనష్ట పరిహార అంచనాలు వేయక పోవడం విడ్డూరంగా ఉందన్నారు. ఇప్పటికైనా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి పంటనష్ట అంచనాలు వేయాలన్నారు. నష్టపరిహారం వెంటనే చెల్లించాలని కోరారు. వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్న మాటలకు-క్షేత్ర స్థాయిలో పరిస్థితులకు పొంతన లేదన్నారు. జిల్లాలో శతశాతం ఈ-క్రాప్ నమోదు కాలేదని, మిచౌంగ్ తుఫాన్ పంట నష్టాల గణనకు సంబంధించి ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన మార్గ దర్శకాల్లో కూడా ఈ-క్రాప్ నమోదు నిబంధన ముడిపడి ఉండడం ఎంతోమంది బాధిత రైతాంగానికి నిరాశనే మిగిలిస్తోందన్నారు. వరి కోతలు పూర్తయి ఆ పంట తుఫాన్ కారణంగా నీట మునిగినా దానిని పంట నష్టం కింద పరిగణించే అవకాశం లేకపోవడం దారుణమన్నారు. ఒక రైతుకు రెండు హెక్టార్లకు మించి వరి సాగు చేసే పరిస్థితి వుంటే సదరు పంట తుఫాన్ కారణంగా దెబ్బతిన్నా సదరు రైతుకు పంట వర్తించకపోవడం శోచనీయమన్నారు. తుఫానుతో రైతులు తీవ్రంగా నష్టపోయారని, మద్దతు ధరకు అదనంగా రూ.500 రాయితీ ఇవ్వాలని, వరి రైతులకు ఎకరాకు రూ.30 వేలు, వాణిజ్య పంటలకు రూ. 50 వేల పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.