యాదాద్రిలో బంగారు కాంతుల అద్దాల మండపం

యాదాద్రీశుడి దివ్యక్షేత్రం స్వర్ణవర్ణంతో ధగధగలాడుతున్నది. ప్రత్యేకంగా తయారు చేసిన విద్యుద్దీపాలంకరణతో ఆలయం మహాద్భుతంగా దర్శనమిస్తున్నది. యాదాద్రి ప్రధానాలయంలోని ద్వితీయ ప్రాకారంలో స్వామివారికి వాయువ్య దిశలో నిర్మితమవుతున్న స్వామివారి అద్దాల మండపానికి విద్యుద్దీపాలను బిగించడంతో స్వర్ణమయంగా మారి కనువిందు చేస్తున్నది. మండపంలోని స్తంభాలన్నింటికి ఇత్తడి రేకులతో బంగారంలా మెరిసేవిధంగా గ్లాస్‌ పాలిషింగ్‌ చేశారు. మండపంలో విద్యుద్దీపాలను వెలిగించడంతో పూర్తిగా బంగారువర్ణంగా మారిపోయింది. అద్దాల మండపంలోని ఊయలలో నరసింహస్వామి, లక్ష్మీఅమ్మవారిని ఉంచి, శయనోత్సవం నిర్వహిస్తారు. మండపంలోపల చుట్టు అన్ని గోడలు, పైకప్పుకు అద్దాలు బిగించారు. స్వామివారి రూపాలు ఊయలలో ఊగున్నప్పుడు అన్ని వైపులా కనిపించేవిధంగా అద్దాల మండపం ఏర్పాటు చేశారు.

మహాద్భుత క్షేత్రంగా యాదాద్రి: భారత్‌ -నేపాల్‌ శాంతి రాయబారి రామ్‌ తిలక్‌

దేశంలోనే మహాద్భుత క్షేత్రంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామివారి ఆలయ పునర్నిర్మాణాలు జరుగుతున్నాయని భారత్‌-నేపాల్‌ శాంతి రాయబారి డాక్టర్‌ రామ్‌ తిలక్‌ అన్నారు. గురువారం యాదాద్రిలో ఆయన స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం యాదాద్రి ఆలయ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టిన కరోనా వైరస్‌ పూర్తిగా అంతం కావాలని స్వామివారిని వేడుకున్నట్టు ఆయన చెప్పారు.