మళ్లీ జగన్ గెలిస్తే సగం మంది వలసలు వెళ్లిపోతారు

• ఇంత దుర్మార్గమైన పాలన ఎప్పుడూ చూడలేదు
• రాజధాని లేని రాష్ట్రాన్ని పాలించిన సీఎంగా జగన్ చరిత్రకెక్కారు
• ఇప్పటంలో జనసేన ఆవిర్భావ సభ వేదిక నుంచి పీఏసీ సభ్యులు నాగబాబు

మూడేళ్లపాటు రాజధాని లేకుండా పాలించిన ఘనత కేవలం మన ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారిది మాత్రమేనని జనసేన పీఏసీ సభ్యులు నాగబాబు పేర్కొన్నారు. రైతుల అకుంఠిత దీక్ష, న్యాయస్థానాల అద్భుతమైన తీర్పు జనసేనాని, జనసైనికుల పోరాటం వల్ల ఈ రోజు రాష్ట్ర రాజధాని అమరావతే అని నిర్ణయించబడిందని అన్నారు. జగన్ రెడ్డి ఇప్పటికైనా పై కోర్టులకు వెళ్లకుండా హైకోర్టును తీర్పును శిరసావహించి మరో రెండేళ్ల పాటు రాజధాని ఉన్న రాష్ట్రానికి సీఎంగా పాలించాలని సలహా ఇచ్చారు. కాదు కూడదని పైకోర్టుకు వెళ్తానంటే మాత్రం రాజధాని లేని రాష్ట్రాన్ని ఐదేళ్లు పాలించిన ముఖ్యమంత్రిగా చరిత్రలో మిగిలిపోతారన్నారు. జనసేన పార్టీ 9వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఇప్పటం గ్రామంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభా వేదిక నుంచి మాట్లాడారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ “ పాలన బాగుంటే సంతోషంగా ఉంటుంది. అదే పాలన ఆదర్శవంతంగా ఉంటే గర్వంగా ఉంటుంది. ఒకవేళ పాలన బాగా లేకపోతే కోపం వస్తుంది. అదేంటో కానీ మన రాష్ట్ర పాలన గురించి మాట్లాడాల్సి వస్తే మాత్రం సిగ్గేస్తోంది. బయట ప్రాంతాలకు వెళ్లి మాది ఆంధ్రా అని చెబితే ఒక వెటకారపు నవ్వు, జాలి చూపులు చూస్తున్నారు. మీకేమైనా సహాయం కావాలా అని అడుగుతున్నారు.
* మంత్రులు కూడా సంతోషంగా లేరు
నా అనుభవంలో చాలా మంది ముఖ్యమంత్రులను చూశాను. ప్రజలతో మంచి ముఖ్యమంత్రులు అనిపించుకున్నవారిని చూశాను. చెడ్డ ముఖ్యమంత్రులు అనిపించుకున్నవారిని చూశాను. కానీ ఇంత దుర్మార్గమైన పరిపాలన అందించే ముఖ్యమంత్రిని చూడడం మాత్రం ఇదే మొదటిసారి. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో మళ్లీ జగన్ రెడ్డి గెలిస్తే మాత్రం రాష్ట్రంలో సగానికి సగం మంది ప్రజలు కాందిశీకుల్లా పక్క రాష్ట్రాలకు వలసలు పోవడానికి సిద్ధమై ఉన్నారు. ముఖ్యమంత్రి గారికి నాదో ప్రశ్న… మీ పాలనలో మీరు, మీ సలహాదారులు, కొంతమంది మంత్రులు తప్ప ఎవరైనా బాగున్నారా? మీ క్యాడర్ తోపాటు సగానికి సగం మంత్రులు కూడా మీ పాలనలో సంతోషంగా లేరు. ఈ మాట వాళ్లు బయటకు చెప్పలేకపోతున్నారు. అధికారంలేని పదవులు అనుభవిస్తూ అల్లాడిపోతున్నారు. మీది ఏ శాఖ అని అడిగితే సడన్ గా వారికీ గుర్తు రావడం లేదు. కొంతమంది అయితే చెయ్యడానికి పనిలేక, ఖాళీగా కూర్చోలేక, ఊసుపోక సరదా సంభాషణలతో ఫోన్లో మాట్లాడి దొరికిపోతున్నారు. చేయడానికి పని లేదు ఎవరిని పని చేయనివ్వడం లేదు.
గ్రామ సచివాలయ ఉద్యోగులను సులబ్ కాంప్లెక్స్ దగ్గర వారికి చేతకానీ పనిచేయిస్తూ డబ్బులు వసూలు చేయిస్తున్నారు. రోడ్లు పరిస్థితి అయితే కార్లో వస్తే పాడే మీద మోసుకొస్తున్నట్లు ఉంది. అధికారంలోకి వచ్చాక ఒక్క రోడ్డు వేశారా? ఒక్క ఇండ్రస్టీ తీసుకొచ్చారా?
* రాజకీయ దొంగలు మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు దోచేస్తారు
సామాన్యంగా దొంగలు రెండు రకాలు. ప్రజల్లో ఉండే దొంగలను సామాన్య దొంగలు అంటాం. రాజకీయాల్లో ఉండే దొంగలను రాజకీయ దొంగలు అంటాం. సామాన్య దొంగలు మన డబ్బు, వాచీ, గొలుసు వంటివి దోచేస్తే… రాజకీయ దొంగలు మాత్రం మన భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తును దోచుకుంటారు. సామాన్య దొంగ ఎవరిని, ఎప్పుడు, ఎలా దోచుకోవాలో వాడు ఎన్నుకుంటాడు. రాజకీయ దొంగల్ని మాత్రం మమ్మల్ని బాగా దోచుకోండిరా బాబు అని మనమే ఎన్నుకుంటాం. సామాన్య దొంగలు మనల్ని దోచుకోవడానికి వస్తే ప్రతిఘటిస్తాం. రాజకీయ దొంగల్ని ఎవరైనా ఏమైనా అంటే ఆ దొంగను మనమే సమర్ధిస్తాం. మనలో మనమే కొట్టుకు చస్తాం. ఇది కొంతమంది రాజకీయ దొంగలకు, సామాన్య దొంగలకు ఉన్న తేడా. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక రాష్ట్రానికి ఏమీ వచ్చాయంటే అప్పులు, తిప్పలు, కష్టాలు, కడగండ్లు, కన్నీరు. అవి మర్చిపోవడానికి కొంతరకం బ్రాండ్లు. గోల్డ్ మెడల్ రావాలంటే ఎంతో సాధించాలి. కానీ మన రాష్ట్రంలో చాలా మంది చేతిలో కూడా మెడల్ ఉంటుంది. మరికొంత మంది అయితే ప్రెసిడెంట్ మెడల్ కూడా సాధిస్తున్నారు. రాష్ట్రానికి రూ.7 లక్షల కోట్లు అప్పు ఉందని కొన్ని వెబ్ సైట్లలో చదివాను. అటే ప్రతివాడి నెత్తిమీద లక్ష అప్పు ఉంది. వాటిని మళ్లీ మనమే ట్సాక్సుల రూపంలో తీర్చాలి. దురదృష్టం ఎంటంటే నవరత్నాలతో లాభపడిన వారు కూడా ఈ అప్పు కట్టాలి. కళ్లు పొడిచినా బతకొచ్చు. కాళ్లు నరికినా నడవచ్చు. కానీ వెన్నుముక లేకపోతే ఎందుకు పనికిరాం. కలబడాలంటే ముందు నిలబడాలి. నిలబడాలంటే వెన్నుముక కావాలి. నిలవలేక, నడవలేక అవస్థలు పడుతున్న వ్యవస్థల్ని నిట్టనిలువునా నిలబెట్టడానికి ఒక వెన్నుముక వచ్చింది. మనందరి కోసం నిలబడిన ఆ వెన్నుముకే మన అద్యక్షులు పవన్ కళ్యాణ్ . తోడబుడ్టిన వాడే కావాచ్చు కానీ ఆయన నాకు నాయకుడు. జనసేన పార్టీ గుండె పవన్ కళ్యాణ్. జనసైనికుడి చేతిలో జెండా పవన్ కళ్యాణ్. తనొచ్చింది ప్రజల కోసం. ఆశయం కోసం. ఆయన పార్టీ పెట్టింది ప్రశ్నంచడానికి మాత్రమే కాదు. సమాధానాలు సాధించడానికి, తద్వారా రాజ్యాధికారం సాధించి ప్రజలకు అద్భుతమైన పాలన అందించడానికి వచ్చాడు. అందుకే ఒక జనసైనికుడిగా చెబుతున్నాను. జనం కోసం మా అధ్యక్షుల వారి ప్రయాణంలో నేను ఒక అడుగునవుతాను. ఆయన వెంటే నడుస్తాను. ఈ ప్రజా యజ్ఞంలో నేను ఓ సమిధనవుతాను. ఈ పోరాటంలో ఎన్ని గాయాలనైనా పంచుకుంటాను. నిలబడదాం… తలబడదాం… గెలుద్దాం సాదిద్దామని” అన్నారు.
* అలరించిన సాంస్కృతిక ప్రదర్శనలు
తెలుగుదనం ఉట్టిపడేలా ప్రదర్శించిన సంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి . ముఖ్యంగా శ్రీకాకుళం జిల్లా కళాకారులు ప్రదర్శించిన తప్పెటగుళ్ళు, అరకు గిరిజనుల దింసా నృత్య రూపకాలు ఆకట్టుకున్నాయి. తెలంగాణ కళాకారుల జానపదాలు, కర్నూలు డ్రమ్స్, వరంగల్ మహిళల డప్పు కళాకారుల నృత్యాలు అయితే దుమ్మురేపాయి. మన సంస్కృతి, సాంప్రదాయాలు ప్రతిబంబించేలా నృత్యరూపకాలను ప్రదర్శించారు. ముఖ్యంగా ప్రభుత్వ వైఫల్యాలు, రాజధాని అమరావతి రైతుల ఇక్కట్లు, అధ్వాన్నమైన రోడ్ల దుస్థితిపై ప్రదర్శించిన వీడియోలు, ఆలోచింపజేశాయి. అంతకుముందు పార్టీకి క్షేత్రస్థాయిలో అంకితభావంతో పనిచేసి కరోనా మహమ్మారి కోరలకు చిక్కి బలైపోయిన జనసైనికులు, ప్రమాదాలకు గురై ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలకు ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు. వారి కుటుంబాలకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.