లోకల్‌ను గ్లోబల్‌గా మార్చేందుకు ఐఐఎం విద్యార్థులు కృషి చేయాలి

ఒడిశాలోని ఐఐఎం-సంబల్‌పూర్ శాశ్వత క్యాంపస్ నిర్మాణానికి ప్రధాని నరేంద్రమోదీ శంకుస్థాపన చేశారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆయన ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అదేవిధంగా ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌, కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని మోదీ.. లోకల్‌ను గ్లోబల్‌గా మార్చేందుకు ఐఐఎం విద్యార్థులు కొత్త ఆలోచనలతో ముందుకు రావాలని పిలుపునిచ్చారు భారత ప్రధాని నరేంద్ర మోదీ.

నేడు స్టార్టప్‌లుగా పురుడుపోసుకున్న సంస్థలే భవిష్యత్తులో ఎంఎన్‌సీలుగా మారతాయని ప్రధాని తెలిపారు. నేటి విద్యార్థులే రేపటి ఎంఎన్‌సీ కంపెనీలకు నాయకత్వం వహించాలని ప్రధాని పిలుపునిచ్చారు. అలాగే బ్రాండ్‌ ఇండియాకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం మన బాధ్యత’ అని మోదీ అన్నారు. వ్యవసాయ రంగం మొదలు అంతరిక్ష రంగం వరకు అన్ని రంగాల్లో నూతన స్టార్టప్‌ల ఏర్పాటుకు రోజురోజుకు అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. 2014లో దేశంలో కేవలం 13 ఐఐఎంలు మాత్రమే ఉండేవని, ఇప్పుడు ఐఐఎంల సంఖ్య మొత్తం 20కి చేరిందని పేర్కొన్నారు.

ఇలాంటి విద్యాసంస్థల నుంచి వచ్చే ప్రతిభా సమూహం ఆత్మనిర్భర్ భారత్ ప్రచారం మరింత బలోపేతానికి తోడ్పడుతుందని ప్రధాని చెప్పారు. అనంతరం ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో వేగవంతమైన పరివర్తనకు విద్య దోహదపడిందన్నారు. ఒడిశా రాష్ట్రం తూర్పు భారతదేశంలో ఎడ్యుకేషన్ హబ్‌గా మారడం తనకు ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *