IPL 2021: నాలుగు పరాజయాల తర్వాత కోల్‌కతా గెలుపు

ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మళ్లీ గెలుపు బాట పట్టింది. వరుసగా 4 పరాజయాల తర్వాత కెకెఆర్ జట్టు విజయం సాధించింది. ఆ జట్టు పంజాబ్ కింగ్స్‌ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో పంజాబ్‌ కింగ్స్‌పై 5 వికెట్లతో కోల్‌కతా విజయం సాధించింది. మొదట పంజాబ్‌ కింగ్స్‌ 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 123 పరుగులు చేసింది. మయాంక్‌ అగర్వాల్‌ (34 బంతుల్లో 31; 1 ఫోర్, 2 సిక్స్‌లు) ఫర్వాలేదనిపించగా. చివర్లో క్రిస్‌ జోర్డాన్‌ (18 బంతుల్లో 30; 1 ఫోర్, 3 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. ప్రసిధ్‌ కృష్ణ (3/ 30), సునీల్‌ నరైన్‌ (2/22), కమిన్స్‌ (2/31) ప్రత్యర్థి భారీ స్కోరు చేయకుండా కళ్లెం వేశారు. అనంతరం ఛేదనలో కోల్‌కతా 16.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసి గెలుపొందింది. మోర్గాన్‌ (40 బంతుల్లో 47 నాటౌట్‌; 4 ఫోర్లు , 2 సిక్స్‌లు), రాహుల్‌ త్రిపాఠి (32 బంతుల్లో 41; 7 ఫోర్లు) జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. 6 మ్యాచ్‌ల్లో కెకెఆర్‌కు ఇది రెండో విజయం. పంజాబ్ 6 మ్యాచ్‌ల్లో 2 మ్యాచ్‌లు కూడా గెలిచింది. పాయింట్ టేబుల్‌లో కెకెఆర్ ఐదవ స్థానంలో, పంజాబ్ ఆరో స్థానంలో ఉన్నాయి.