హరిత పన్నుతో హాహాకారాలు!

* వాహనదారుల గగ్గోలు
* పొంతన లేని విధంగా పెంపు
* పొరుగు రాష్ట్రాల కంటే అత్యధికం
* అడ్డగోలు విధానంతో దోపిడీ

”తమిళనాడులో రెండొందలండి… తెలంగాణలో ఐదొందలండి… కానీ ఆంధ్రాలో ఆరువేల ఆరువందల అరవై అండి… తమరే న్యాయం చేయాలి”
– ఇది ఆంధ్రప్రదేశ్‌లో విధిస్తున్న హరిత పన్ను గురించి ఓ లారీ డ్రైవర్‌ ఆవేదన.
నిజానికి ఇది ఆవేదన కాదు… అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఎక్కడ వీలుంటే అక్కడ అడ్డమైన పన్నులు విధిస్తూ అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న ప్రభుత్వంపై పెల్లుబికిన ఆక్రోశం!
తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుని, రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి, ప్రజల నుంచి ఏదో విధంగా డబ్బులు పిండుకోవడమే పరమావిధిగా బరితెగించిన సర్కారు కర్కశ విధానాలపై కట్టలు తెగిన ఆగ్రహం!
ఈ ఆవేదన, ఆక్రోశం, ఆగ్రహం కలిసి బయట పడినది వారాహి విజయ యాత్ర సాగుతున్న సందర్భంలో జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్‌ కళ్యాణ్‌ ముందు.
ఆ లారీ డ్రైవర్‌ చెప్పిన విషయాలు విని ఆశ్చర్యపోవడం శ్రీ పవన్‌ కళ్యాణ్‌ వంతయింది.
ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలను ఆర్థికంగా పీల్చిపిప్పి చేస్తున్నప్పుడు సామాన్యులు ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తారు. అలాంటి భరోసా ఇవ్వగలిగే నాయకుడు కనిపించినప్పుడు వాహనానికి అడ్డం పడైనా తమ కడుపులో బాధలను పంచుకోవాలని ప్రయత్నిస్తారు.
జనసేన యాత్రలో అడుగడుగునా కనిపిస్తున్న ఇలాంటి ఎన్నో విన్నపాల మధ్య ఈ లారీ డ్రైవర్‌ ఆవేదన కూడా ఒకటి. అతడి ఆవేదన వెనుక ఉన్న వివరాల కేసి దృష్టి సారించినప్పుడు హరిత పన్ను వాహనదారుల చేత ఎలా హాహాకారాలు చేయిస్తోందో అర్థమవుతుంది.
* ఏమిటీ హరిత పన్ను?
ఎన్విరాన్‌మెంటు టాక్స్‌… ఎకో టాక్స్‌… గ్రీన్‌ టాక్స్‌… పేరేదైనా పర్యావరణ పరిరక్షణ చర్యల కోసం కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన విధానమిది. పర్యావరణానికి హాని చేసే వాహనాలు, పరికరాలపై విధించే పన్ను విధానాలను రూపొందించుకోడానికి రాష్ట్రాలకు అధికారం ఉంటుంది. ఆ అవకాశాన్ని అడ్డం పెట్టుకుని ఆంధ్రప్రదేశ్‌ లో కొలువుదీరిన వైకాపా ప్రభుత్వం అడ్డగోలుగా విధించిన ఈ పన్ను వాహనదారుల నడ్డి ఎలా విరగ్గొడుతోందో ఆ లారీ డ్రైవర్‌ ఆవేదన తేటతెల్లం చేసింది.
వివరాల్లోకి వెళితే… వ్యక్తిగత వాహనాలతో పాటు, రవాణా వాహనాల వరకు అన్నింటికీ ఈ పన్ను వర్తిస్తుంది. అయితే దాన్ని విధించడానికి కొన్ని నిబంధనలు, విధానాలు కూడా ఉంటాయి. గతంలో ఈ పన్ను ఆంధ్రప్రదేశ్ లో కేవలం రూ. 200 ఉండగా, ఇప్పుడు దాన్ని జగన్‌ ప్రభుత్వం గరిష్ఠంగా రూ. 30,820 వరకు పెంచేసిన విషయం ఎవరినైనా ఆశ్చర్యపరిచేలా ఉంది. సరుకు రవాణా చేసే వాహనాలేవైనా వాటి వయసు ఏడేళ్లు దాటితే ఏటా హరిత పన్ను చెల్లించాల్సి ఉంటుంది. కాలం గడిచే కొద్దీ వాహనాలు వెదజల్లే కాలుష్యం అధికంగా ఉంటుంది కాబట్టి అలాంటి వాహనాల సంఖ్యను తగ్గించే ఉద్దేశంతో ఈ పన్నును కేంద్రం తలపెట్టింది. అయితే జగన్‌ సర్కారు దాన్ని ప్రజలను బాదడానికి ఉపయోగించుకుంటోంది. ఇందుకోసం మూడు స్లాబ్‌లను ప్రవేశ పెట్టింది. వాహనం వయసు 7-10 ఏళ్ల మధ్య ఉంటే త్రైమాసిక పన్ను విలువలో సగం, 10-12 ఏళ్ల మధ్య ఉంటే త్రైమాసిక పన్ను విలువకు సమానంగా, 12 ఏళ్లు దాటితే త్రైమాసిక పన్నుకు రెండు రెట్లు విధించాలని నిర్ణయించింది. ఆ ప్రకారం చూసినప్పుడు ప్రస్తుతం రాష్ట్రంలో త్రైమాసిక పన్ను 6 టైర్ల లారీకి రూ.4700 నుంచి 16 టైర్ల లారీకి రూ. 15,410 వరకు ఉంది. అంటే ఆయా లారీలను బట్టి వాటి వయసును బట్టి హరిత పన్ను కనిష్ఠంగా రూ. 2395 నుంచి గరిష్ఠంగా రూ. 30,820 వరకు చెల్లించాల్సి ఉంది.
* ఏపీలోనే బండబాదుడు
పొరుగు రాష్ట్రాల్లో హరిత పన్నును గమనిస్తే… కర్నాటకలో ఏటా రూ. 200, తమిళనాడులో రూ.500 వసూలు చేస్తున్నారు. తెలంగాణలో కూడా మూడు స్లాబులు పెట్టి పన్ను పెంచగా అక్కడి లారీ యజమానుల సంఘాలు విజ్ఙప్తి చేయడంతో 7-12 ఏళ్ల వాహనాలకు రూ.1500, అలాగే 12 ఏళ్లు దాటిన వాహనాలకు రూ. 3000 మాత్రమే వసూలు చేసేలా సవరణలు చేశారు. రాష్ట్రంలో మాత్రం ఎన్ని విన్నపాలు చేసినా మొండిగా తాము అనుకున్నట్టుగానే అత్యధిక పన్ను విధిస్తోంది జగన్‌ ప్రభుత్వం. దీంతో సరుకు రవాణా వాహనదారులు, ఆ వాహనాలను కొనుక్కుని నడుపుకునే డ్రైవర్లు తీవ్ర భారాన్ని మోయాల్సి వస్తోంది. పైగా ఇక్కడ త్రైమాసిక పన్ను, హరిత పన్ను, నేషనల్‌ పర్మిట్‌ పన్ను అన్నీ కలిసి వాహనదారుల నడ్డి విరుస్తున్నాయి. ఉదాహరణకు 12 టైర్ల లారీకి రాష్ట్రంలో త్రైమాసిక పన్ను రూపేణా ఏడాదికి రూ. 43,640, హరిత పన్ను కింద రూ. 21,820, నేషనల్‌ పర్మిట్‌ కోసం రూ. 17 వేలు లెక్కేస్తే మొత్తం రూ. 82,460 చెల్లించాల్సి వస్తోంది. ఆపై థర్డ్‌ పార్టీ ఇన్స్యూరెన్స్‌ కింద దాదాపు రూ. 50 వేలు కట్టాలి. ఇలా మొత్తం మీద రూ.1.32 లక్షలు కిస్తీలు చెల్లిస్తూ మిగిలిన దాంతోనే కుటుంబాన్ని పోషించుకోవలసి వస్తోంది.
ఈ నేపథ్యంలోనే శ్రీ పవన్‌ కళ్యాణ్‌ కారును ఆపిన ఓ లారీ డ్రైవర్‌… ”సర్‌ హరిత పన్ను పొరుగు రాష్ట్రాల్లో రూ. 200 నుంచి రూ. 500 వుంది. నేను మాత్రం ఇక్కడ రూ. 6,660 కడుతున్నాను. ఇదెక్కడి న్యాయం? దీన్ని మీరు ప్రశ్నించాలి” అంటూ వాపోయాడు. విశాఖలో జరిగిన ఈ సంఘటన తాలూకు వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
పరిస్థితి ఇలా ఉంటే తమ గోడు వినిపించుకోడానికి ఏపీ లారీ యజమానుల సంఘం నాయకులు ముఖ్యమంత్రిని కలవాలని ప్రయత్నిస్తుంటే కనీసం వారికి అపాయింట్‌మెంటు కూడా దొరకడం లేదు.
ఏదో ఒక విధంగా పన్నులు పెంచి ప్రజలను పీడించడమే ధ్యేయంగా ముందుకు సాగుతున్న జగన్‌ ప్రభుత్వం ఇలాంటి విన్నపాలను, ఆవేదనలను, ఆక్రందనలను వినిపించుకునే స్థాయిలో ఉందా?