ఇంజనీర్స్ డే సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య కు అంజలి ఘటించిన పవన్

ఇంజనీర్స్ డే సందర్భంగా పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలియజేసారు. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ మన ఇంజనీరింగ్ నిపుణులకు మార్గదర్శకులు ‘భారతరత్న’ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారని కొనియాడారు. ఈ రోజు ఆ మహనీయుని జయంతి.. సందర్భంగా మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారికి నా తరఫున, జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక అంజలి ఘటిస్తున్నానని అన్నారు.

హైదరాబాద్ నగరాన్ని మూసీ వరదల నుంచి గట్టెక్కించే విధంగా నీటి పారుదల వ్యవస్థను రూపొందించారని ఆయన పేర్కొంటూ విశాఖపట్నం ఓడరేవును సముద్రపు కోత నుంచి కాపాడే విధానాన్ని అందించారని అన్నారు. దేశంలో పలు ఇరిగేషన్ ప్రాజెక్టుల రూపకల్పనలో విశ్వేశ్వరయ్య గారి భాగస్వామ్యం మరువలేనిదని ఆయన కీర్తించారు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారి గౌరవార్థం వారి జయంతిని జాతీయ ఇంజనీర్ల దినోత్సవాన్ని నిర్వహించుకొంటూ ఉంటామని అన్నారు. విశ్వేశ్వరయ్య గారిలోని తపన, దృఢ సంకల్పం ఆయన జీవితం యువతకు ఆదర్శంగా నిలుస్తాయన్నారు.