1000 పడకల కొవిడ్ హాస్పిటల్ నిర్మించనున్న రిలయన్స్ ఫౌండేషన్

దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోన్న క్రమంలో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో 1000 పడకలతో ఆక్సీజన్ సౌకర్యాలతో కూడిన కొవిడ్-19 ఆస్పత్రిని నిర్మించనున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ ప్రకటించింది. ఈ కేంద్రాల్లో ఆక్సిజన్ సరఫరాతోపాటు.. అన్ని సౌకర్యాలు ఉచితంగా అందజేస్తామని పేర్కొంది. దేశంలో భారీగా పెరుగుతున్న కరోనా కేసులను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు రిలయన్స్ ఫౌండేషన్ వెల్లడించింది. ఇదే విషయమై గుజరాత్ ముఖ్యమంత్రిత్వ కార్యాలయం ట్విటర్ ద్వారా స్పందిస్తూ.. గుజరాత్ సీఎం విజయ్ రూపానీ చేసిన విజ్ఞప్తికి స్పందిస్తూ కొవిడ్ హాస్పిటల్ నిర్మాణానికి రిలయన్స్ ఫౌండేషన్  ముందుకు వచ్చినట్టు తెలిపింది.

మే 2వ తేదీనాటికి తొలి దశలో భాగంగా 400 పడకలతో కొవిడ్-19 హాస్పిటల్ అందుబాటులోకి రానుందని వెల్లడించిన గుజరాత్ సీఎంవో.. ” సౌరాష్ట్రలోని జామ్‌నగర్, ద్వారకా, పోర్బందర్ జిల్లాల నుంచి వచ్చే కరోనా రోగులకు ఈ ఆస్పత్రి ఎంతో ఉపయోగపడుతుంది” అని అభిప్రాయపడింది. మరో రెండు వారాల్లో మరో 600 పడకలు, ఆక్సీజన్ సౌకర్యాలతో కూడిన కొవిడ్ కేర్ సెంటర్ నిర్మాణం పూర్తవుతుందని రిలయన్స్ ఫౌండేషన్ పేర్కొంది.