సార్వత్రిక ఎన్నికల్లో వీర మహిళల పాత్ర క్రియాశీలకం

• జనసేన అభ్యర్థుల గెలుపు కోసం కృషి చేయాలి
• రాష్ట్రానికి జనసేన – టీడీపీ – బీజేపీ కూటమి అవసరాన్ని గడప గడపకు చేర్చాలి
• జనసేన మహిళా నేతల సమావేశంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్

జనసేన పార్టీలో మహిళలకు ఎప్పుడూ ప్రత్యేక గుర్తింపు ఉంటుందని… ఈ సార్వత్రిక ఎన్నికలో వీర మహిళలు క్రియాశీలక పాత్ర తీసుకోవాలని జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. 2029 సార్వత్రిక ఎన్నికల నాటికి 33 శాతం రాజకీయ రిజర్వేషన్లు అమలులోకి రానున్న నేపథ్యంలో వీర మహిళా విభాగాన్ని మరింత బలోపేతం చేసే దిశగా ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. సార్వత్రిక ఎన్నికల సన్నాహకాల్లో భాగంగా శనివారం పార్టీ పీఏసీ, రాష్ట్ర కార్యవర్గంలో ఉన్న మహిళా నేతలు, వీర మహిళా విభాగం ప్రాంతీయ కన్వీనర్లు, నియోజకవర్గాల ఇంచార్జులతో మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కల్యాణ్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలో మహిళల సాధికారతకు సంబంధించిన పథకాలు, వారి సంక్షేమ కార్యక్రమాలు చిత్తశుద్ధితో అమలు కావడం లేదు. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం 2029 నుంచి 33శాతం రిజర్వేషన్లు తీసుకురావడం మూలంగా మహిళల్లో మరింత రాజకీయ చైతన్యం వస్తుంది. అప్పటికల్లా మన వీర మహిళలు మరింత శక్తిమంతం కావాలి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో మన పార్టీతో కలసి నడుస్తున్న వీర మహిళలు చురుగ్గా బాధ్యతలు చేపట్టాలి. జనసేన – టిడిపి – బీజేపీ పొత్తు ఆవశక్యతను, కూటమి ప్రభుత్వ విధానాలను గడప గడపకు తీసుకు వెళ్ళాలి” అన్నారు.
• జనసేన పోటీ చేసే స్థానాల్లో ప్రచారం చేపట్టాలి: శ్రీ నాదెండ్ల మనోహర్
పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ.. “జనసేన పార్టీ ఈసారి శాసనసభలో బలమైన అడుగు వేయాలి అని శ్రీ పవన్ కల్యాణ్ గారి ఆకాంక్ష. అందుకోసం ప్రతి ఒక్కరం బాధత్యతో పని చేయాలి. ఇందుకోసం మహిళా నేతలు సన్నద్ధం కావాలి. ప్రస్తుతం జనసేన పార్టీ బరిలోకి దిగుతున్న నియోజకవర్గాల్లో మీకు కొన్ని బాధ్యతలు అప్పగించాలని అధ్యక్షుల వారు నిర్ణయించారు. మహిళా, యువ ఓటర్లతో మన పార్టీ విధానాలు, ప్రజలకు ఏ విధంగా అండగా ఉంటున్నదీ తెలియచెప్పండి. మన అభ్యర్ధులంతా విజయం సాధించాలి” అన్నారు.
• మహిళల భద్రత… సంక్షేమానికి ప్రాధాన్యం: శ్రీ కె.నాగబాబు
పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె.నాగబాబు గారు మాట్లాడుతూ.. “రాష్ట్రంలో మహిళల భద్రత, సంక్షేమానికి పార్టీ ప్రాధాన్యం ఇస్తుంది. పార్టీ కమిటీల్లోనూ వారికి సముచిత స్థానం కల్పిస్తున్నాం. వారి గౌరవాన్ని పెంచే విధంగా మరిన్ని నిర్ణయాలు ఉంటాయి. ఈ రోజు సమావేశంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణ కోసం, ఎన్నికల్లో తాము ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనుకొంటున్నదీ మహిళా నేతలు అందించిన సూచనలు ఎంతో విలువైనవి” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ కోటంరాజు శరత్ కుమార్ పాల్గొన్నారు.