అంగన్వాడీ వ్యవస్థ నిర్వహణపై వైసీపీ పాలకులకు చిన్న చూపు

• అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లకు హామీలిచ్చి మోసం చేసిన శ్రీ జగన్
పేద మహిళలు, చిన్నారులకు సేవ చేసే అంగన్వాడీ వ్యవస్థను సమర్థంగా నిర్వహించడంలో వైసీపీ సర్కార్ విఫలమైందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ ఒక ప్రకటనలో విమర్శించారు. గర్భవతులు, బాలింతలు, బిడ్డలు ఆరోగ్యంగా ఉండేలా చూడటంలో అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్లు ఎంతో కీలకం. వీరికి 2019 ఎన్నికల ముందు శ్రీ జగన్మోహన్ రెడ్డి ఎన్నో హామీలిచ్చారు. వాటిని పాలనలోకి వచ్చాక విస్మరించారు. తమకు ఇచ్చిన హామీలను వైసీపీ పాలకులకు గుర్తు చేస్తూ, వాటిని నెరవేర్చాలని అడుగుతుంటే- అంగన్వాడీ మహిళలను అరెస్టులు చేసి భయపెట్టడం అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యరీతిలో నిరసనకు సిద్ధపడితే రాష్ట్రవ్యాప్తంగా అరెస్టులు చేస్తున్నారు. ప్రభుత్వ వైఖరిని జనసేన పార్టీ ఖండిస్తుంది. మాట ఇచ్చి మడమ తిప్పిన శ్రీ జగన్ అంగన్వాడీ మహిళలకు సమాధానం చెప్పాలి. అంగన్వాడీ వ్యవస్థను బలోపేతం చేయాల్సిన ప్రభుత్వం తిరోగమన దిశలో ఆలోచనలు చేస్తుంది. మినీ అంగన్వాడీలను రద్దు చేయడం దురదృష్టకరం. వైసీపీ పాలకులకు ఈ వ్యవస్థపైనా, నిర్వహణపైనా చిన్న చూపు ఉంది. అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్ల పోరాటానికి జనసేన పార్టీ మద్దతు తెలియచేస్తుందని శ్రీ నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు.