ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే విశాఖ విన్యాసాలు

•జనసేనకు వస్తున్న ఆదరణ చూసి తట్టుకోలేకపోయారు
•జనవాణి జరిగితే వైసీపీ అరాచకాలు బయటకి వస్తాయని భయపడ్డారు
•సూట్ కేసు రెడ్డి వ్యవహారాన్ని మూడున్నరేళ్ల క్రితమే హెచ్చరించారు
•ఇప్పుడు వారి అరాచకాలు ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారు
•శ్రీ పవన్ కళ్యాణ్ పర్యటనను అడ్డుకోవడం వెనుక రాజకీయ దురుద్దేశాలున్నాయి
•దుర్మార్గమైన ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వం ముందుకెళ్తోంది
•ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమాలను అడ్డుకున్నారు
•మంగళగిరిలో జనసేన కార్యకర్తల సమావేశలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

రాష్ట్రంలో అలజడి సృష్టించడం కోసం, సొంత రాజకీయ ప్రయోజనాల కోసం సమాజంలో కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే దుర్మార్గమైన ఆలోచనలతో వైసీపీ ప్రభుత్వం ముందుకు వెళ్తోందని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. జనవాణి జరిగితే విశాఖలో వారి దోపిడీలు బయటకు వస్తాయనే శ్రీ పవన్ కళ్యాణ్ గారి పర్యటనను అడ్డుకున్నారని తెలిపారు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి ఓ రాజకీయ దురుద్దేశంతో శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు అడ్డుకోవాలని దుర్మార్గమైన ఆలోచనలు చేస్తున్నారన్నారు. స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షణలోనే పవన్ కళ్యాణ్ గారి పర్యటనకు ఆటంకాలు కలిగించారని చెప్పారు. మా నాయకుల మీదే దాడులు చేయించి మాపైనే కేసులు పెట్టడాన్ని ఎలా స్వీకరించుకోవాలో అర్ధం కావడం లేదన్నారు. జగన్ రెడ్డి మాట్లాడిన మాటలకు విరుద్దంగా ప్రజల్ని మభ్యపెట్టి ప్రజలు ఆశీర్వదిస్తారనుకోవద్దని హెచ్చరించారు. ఇలాంటి అరాచక పాలనను శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రోత్సహించరని, ప్రతి జనసేన కార్యకర్త వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించడమే లక్ష్యంగా పని చేయాలని పిలుపునిచ్చారు. మంగళగిరిలోని జనసేన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో విశాఖపట్నం సంఘటనల మీద పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి సంఘీభావం తెలిపేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “నాలుగు రోజులుగా విశాఖ వేదికగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు లక్ష్యంగా చోటు చేసుకున్న పరిణామాలు రాష్ట్రం మొత్తం చూస్తోంది. విశాఖలో ప్రశాంతంగా జరగాల్సిన కార్యక్రమాలను అడ్డుకున్నారు. మన నాయకులు పొరపాటున నోరు జారి దూషించినా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఒప్పుకోరు. ఆయన దృష్టికి వెళ్లగానే దాన్ని ఖండిస్తారు. రాజకీయ ప్రస్థానంలో సహనంతో ఉండాలి. ప్రతి వ్యక్తిని, ప్రతి వ్యవస్థను గౌరవించాలని పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరికీ చెబుతూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఏ కార్యక్రమం కోసం మేము విశాఖ వెళ్లాం.. వాళ్లు ఏం చేశారో అర్ధం కాలేదు. నేను 30 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాను. మా తండ్రి గారి హయాం నుంచి వ్యవస్థలు ఎలా పని చేస్తాయి. ప్రభుత్వం ఎవరి కోసం పని చేస్తుంది. రాజకీయ నాయకుడిగా నిబద్దతతో ఎలా పని చేయాలనే అంశాలు నేర్చుకున్నా. విశాఖలో జరిగిన సంఘటన మర్చిపోలేను.
•మంత్రుల తీరు రాష్ట్రం మొత్తం చూశారు
ఉదయం 8 గంటల ప్రాంతంలో వైసీపీ ప్రభుత్వం గర్జన కార్యక్రమం తలపెట్టింది. ఏఎన్ఎంలు, వాలంటీర్ల సాయంతో డ్వాక్రా మహిళలను, పాఠశాలల యాజమాన్యాలను భయపెట్టి హుకుం జారీ చేసి బెదిరించి గ్రామాల్లో పేర్లు నమోదు చేసుకుని లక్ష మందితో ఈ కార్యక్రమాన్ని చేద్దామనుకున్నారు. అది రాజకీయ కారణం. మీ నాయకుడు గతంలో మాట్లాడిన మాటకు విరుద్ధంగా ప్రజల్ని మభ్యపెడితే ఆశీర్వదిస్తారు అనుకుంటే కుదరదు. చివరికి గర్జనకు వెయ్యి మంది కూడా రాకపోవడంతో నాయకులు ఉపన్యాసాలు ఇచ్చుకుని వెళ్లిపోయారు. వారు మాట్లాడిన భాష, మంత్రుల తీరు మొత్తం రాష్ట్ర ప్రజలు చూశారు.
•హారతులిద్దామంటే వీధి దీపాలు తీసేశారు
జనసేన పార్టీ తరఫున నిర్వహించ తలబెట్టిన కార్యక్రమాల కోసం మేము సాయంత్రం గం. 4.45 నిమిషాలకు విశాఖ విమానాశ్రాయానికి చేరుకున్నాం. ఎయిర్ పోర్టులో దిగిన వెంటనే ఓ అధికారి వచ్చి ఊహించిన దాని కంటే ఎక్కువ మంది ప్రజలు ప్రాంగణంలోకి వచ్చేశారు. మీరు త్వరగా వెళ్తే భాగుంటుంది అని రిక్వెస్ట్ చేశారు. అప్పటికే మా పార్టీ నాయకులు అంతా స్వాగతం పలికేందుకు వేచిచూస్తున్నా తోటి ప్రయాణీకుల ఇబ్బందిని దృష్టిలో ఉంచుకుని నేరుగా వచ్చి వాహనంలోకి ఎక్కేశారు. అక్కడి నుంచి విమానాశ్రయం బయటకు రావడానికి గంటా 40 నిమిషాల సమయం పట్టింది. అది మా తప్పిదమా? ఇక్కడ పూర్తిగా పోలీసు వైఫల్యం జరిగింది. స్వయంగా ఒక మంత్రే ఆ మాట చెప్పారు. ఇవన్నీ మర్చిపోయి కొంత మంది మంత్రుల మీద దాడి జరిగిందని అరగంటలోపే మా పార్టీ నాయకుల మీద కేసులు పెట్టారు. విమానాశ్రయం నుంచి బయటకు రాక ముందే కమిషనర్ వచ్చి మా వాహనాన్ని అడ్డుకుని ఈ కార్యక్రమం ముందుకు వెళ్లకూడదు అని చెప్పారు. మీ నాయకులకు ఆ మేరకు సందేశం పంపమన్నారు. అయితే మేము వెనకాడలేదు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరగా ముందుకు వెళ్దామని చెప్పారు. పోలీసు అధికారులు అవమానకర పరిస్థితులు సృష్టించారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారికి హారతులు ఇచ్చేందుకు మా ఆడపడుచులు రహదారుల మీద వేచి చూస్తుంటే వీధి దీపాలు తీసేశారు. అలాంటి పరిస్థితుల్లో సెల్ ఫోన్ లైట్లు వేసి మరీ మహిళలు స్వాగతం పలికారు.
•ముఖ్యమంత్రే అధికారులకు ఆదేశాలిచ్చారు
విశాఖలో జరుగుతున్న ర్యాలీ లైవ్ ప్రసారాలు ఎవరో మంత్రులు చూసి ఆదేశాలు ఇచ్చారని అనుకున్నాం.. కానీ చివరికి మాకు తెలిసింది ముఖ్యమంత్రే స్వయంగా చూసి అధికారులకు ఆదేశాలిచ్చారు. ఆయన పర్యవేక్షణలోనే ఈ కార్యక్రమాన్ని ఆపించమని ఒత్తిడి తీసుకువచ్చి భయానక వాతావరణం సృష్టించారు. మేము బస చేసిన హోటల్ లో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు ఆధీనంలోకి తీసుకున్నారు. అనేక గదుల్లో విదేశీ పర్యాటకులు ఉన్నారు. ప్రభుత్వ సంస్థల్లో పని చేయడానికి వచ్చిన వారు ఉన్నారు. అతిధుల్ని అవమానపర్చే విధంగా ప్రవర్తించారు. హడావిడి చూసి మేము సిద్ధమయ్యాం. మన నాయకుల్ని అరెస్టు చేస్తే మనమే పోలీస్ స్టేషన్ కి వెళ్దామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు సిద్ధమయ్యారు. ఎక్కడికి వెళ్లాలో తెలియదు. గంట గంటకీ స్టేషన్లు మార్చేస్తున్నట్టు తెలిసింది. ఒంటిగంట ప్రాంతంలో మేము బస చేస్తున్న రూముల మీదకు 700 మంది పోలీసులతో దాడి చేశారు. మన నాయకులందర్నీ ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి వాన్ లో ఎక్కించారు. సాయంత్రం 6 గంటల తర్దాత మహిళల్ని అరెస్టు చేయకూడదని రూలు ఉంది. మా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్వి గారిని ఈడ్చుకుంటూ తీసుకువెళ్లారు. ఎక్కడికి తీసుకువెళ్లారో తెలియదు.
•శ్రీ పవన్ కళ్యాణ్ తో బలవంతంగా సంతకం పెట్టించాలని చూశారు
తెల్లవారు ఝామున 4 గంటలకు మా రూముల తలుపులు బాది రకరకాల విన్యాసాలు చేశారు. మూడు గంటలకు, నాలుగు గంటలకు, 5 గంటలకు అరెస్టు చేస్తామన్నారు. గదుల నుంచి బయటకు రాకూడదని హుకుం జారీ చేశారు. సెక్షన్ 30 కింది శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నోటీసులు జారీ చేయాలన్నారు. అడ్డుకున్నాం. మన పార్టీ న్యాయ విభాగానికి చెందిన న్యాయవాదులు చాలా గొప్పగా నిలబడ్డారు. శ్రీ నాగబాబు గారు ఏడున్నర గంటలకే వచ్చేశారు. నోటీసులు ఎందుకు ఇస్తున్నారని అడిగాం. మేమేం సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి రాలేదు. ప్రజా సమస్యల మీద అర్జీలు తీసుకుని సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నాం. పోలీసులు నాలుగు గంటల పాటు శ్రీ పవన్ కళ్యాణ్ గారు సంతకం పెట్టాలని వాదించారు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన మా పార్టీ క్రియాశీలక సభ్యులు మరణిస్తే.. 12 కుటుంబాలకు జనవాణి కార్యక్రమంలో రూ. 60 లక్షల సాయం అందచేయాల్సి ఉంది. అయితే కార్యక్రమానికి ఎంతో కష్టపడి ఏర్పాట్లు చేసిన నాయకులు లేకుండా జనవాణి ఎలా చేస్తాం. మా నాయకుల్ని విడిచిపెట్టినప్పుడే జనవాణి నిర్వహిద్దామని శ్రీ పవన్ కళ్యాణ్ గారు నిర్ణయించారు. చివరికి మీడియా సమక్షంలో ఆ 12 కుటుంబాలకు రూ. 60 లక్షలు అందించాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఇలాంటి కార్యక్రమాలు చేయడానికే విశాఖ వచ్చారు.
•జనవాణి అర్జీలతో వారి తప్పులు బయటకొస్తాయని భయపడ్డారు
2019 ఎన్నికలు పూర్తయిన తర్వాత 8 గంటల్లోనే మన పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ పెట్టారు. వైసీపీకి రాష్ట్ర ప్రజలు 151 సీట్ల భారీ మెజారిటీ కట్టబెట్టారు. రాష్ట్ర ప్రజలు మద్దతు ఇచ్చారు కాబట్టి ఏడాది పాటు ఎలాంటి విమర్శలు చేయమని ఆయన మనస్ఫూర్తిగా చెప్పారు. విధానపరంగా ఏవైనా నిర్మాణాత్మక లోపాలు ఉంటే సరిదిద్దుకోవాలని ప్రభుత్వానికి సూచనలు మాత్రమే చేయాలని నిర్ణయించారు. ఇసుక కొరత సృష్టించి మూడున్నర నెలల్లోనే భవన నిర్మాణ కార్మికులను రోడ్డున పడేశారు. వారి కోసం అదే విశాఖలో భారీ కార్యక్రమం చేపట్టాం. మూడున్నరేళ్ల క్రితం విశాఖలో పర్యటించినప్పుడే సూట్ కేసు రెడ్డి గారి వ్యవహారం మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు హెచ్చరించారు. ఈ రోజున వాస్తవాలు బయటపడ్డాయి. ఇప్పుడు అంతర్గత కలహాలతో వాళ్ళ పార్టీ నాయకులే ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెబుతున్నారు. విశాఖలో ప్రభుత్వ భూములు లాగేసుకున్నారు. ప్రజల ఆస్తులు గుంజుకుంటున్నారు. రుషికొండను దోచేశారు. జనవాణి కార్యక్రమంలో మీ దోపిడీలు, దౌర్జన్యాల మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారికి అర్జీలు ఇస్తే.. మీ తప్పులన్నీ బయటపడతాయన్న ఉద్దేశంతోనే కార్యక్రమాలను అడ్డుకున్నారు. మూడున్నర నెలల్లోనే భవన నిర్మాణ కార్మికుల సమస్య తెచ్చారు. విశాఖ వెళ్లాం.. మూడున్నర సంవత్సరాల క్రితం విశాఖలో సూట్ కేసు రెడ్డి గారి విషయం హెచ్చరించారు. వాస్తవాలు ఈ రోజు బయటపడ్డాయి. అంతర్గత కలహాలతో మీ పార్టీ నాయకులే ప్రెస్ మీట్లు పెట్టి చెబుతున్నారు. మహిళల దగ్గర లాగేసుకున్నారు. ఇవన్నీ భయటపడుతున్నాయనే ప్రజలు అర్జీలు ఇస్తారనే భయంతోనే జనవాణి జరగకూడదు విశాఖ పర్యటనలో ర్యాలీ, మీటింగ్, డ్రోన్ కెమెరా వాడకూడదని నోటీసులు ఇచ్చారు. దాని వెనుక ఉద్దేశం ఇదే. మనం ఎండగడతాం . ప్రభుత్వ పెద్దల దుర్మార్గ చర్యలు ప్రజలకు తెలుస్తాయని వెనకడుగు వేశారు. రాష్ట్రంలో రైతాంగం కోసం నిలబడిన పార్టీ ఏదైనా ఉందా? కౌలు రైతులు ఆత్మహత్య చేసుకుంటే శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా రూ. 5 కోట్లు ఇచ్చారు. రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాం. ముఖ్యమంత్రి సొంత నియోజకవర్గంలో 46 మంది ఆత్మహత్య చేసుకున్నారు. అలాంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. నాయకత్వం లేదు. పరిపాలించే శక్తి లేదు. ప్రజలకు ఉపయోగపడడం లేదు. అధికార దుర్వినియోగం, బూతుల పురాణానికే మొగ్గు చూపుతున్నారు. జరిగిన సంఘటన మీ దృష్టికి తీసుకువచ్చి భవిష్యత్తులో ఎలాంటి ప్రణాళికలతో సిద్ధమవ్వాలన్న ఉద్దేశంతో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నాం. శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల కోసం సొంత కుటుంబానికి దూరంగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తిని సొంత ప్రజల్ని కలవనీయకుండా చేస్తే రాష్ట్రం ఏమైపోతోంది. రైతు భరోసాతో పాటు జనవాణిలో మూడు వేల మంది అర్జీలు ఇచ్చారు. ప్రతి సమస్య విని శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్వయంగా ప్రభుత్వానికి ఉత్తరాలు రాశారు. లా అండ్ ఆర్డర్ దుర్వినియోగం చేస్తారు. అదే ముఖ్యమంత్రి లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతారు. ఈ వేదిక మీద నుంచి ఒకటే చెబుతున్నా.. ఎవరికి ఎలాంటి సమస్య వచ్చినా శ్రీ పవన్ కళ్యాణ్ గారు మీతో ఉంటారు. జనసేన పార్టీ వీ వెంట ఉంటుందన్న విషయం గుర్తుపెట్టుకోండి. పార్టీ విజయం కోసం ప్రతి ఒక్కరు నిలబడతారని కోరుకుంటూ సంఘీభావం తెలిపేందుకు వచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు అని అన్నారు.
* వైసీపీ ఇంజూరియస్ టూ ఆంధ్రప్రదేశ్ : శ్రీ నాగబాబు
రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ కొణిదెల నాగబాబు గారు మాట్లాడుతూ “వైసీపీ ప్రభుత్వం ఇంజూరియస్ టూ ఆంధ్రప్రదేశ్. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ తోనే అభివృద్ధి సాధ్యం. అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి విశాఖ పర్యటనకు అడుగడుగునా అడ్డంకులు సృష్టించారు. వేలాది మంది పోలీసులను అడ్డంపెట్టుకొని వేధించారు. అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకు నోవటెల్ హోటల్ లో గందరగోళం సృష్టించి మా పార్టీ నాయకులను అరెస్టు చేశారు. ఐ.పి.సి. సెక్షన్ 307 కింద కేసులు నమోదు చేశారు. వైసీపీ నిర్వహించిన గర్జన కార్యక్రమంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా దూషించడం వల్లే… భావోద్వేగంకు గురైన కార్యకర్తలు విమానాశ్రయంలో ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యక్తిగతంగా తిట్టడం వల్లే భావోద్వేగానికి గురైన కార్యకర్తలు ఎన్టీఆర్ భవన్ పై దాడులకు పాల్పడ్డారని జగన్ తన కార్యకర్తలను వెనకేసుకురావొచ్చు. ఏం మిగతా పార్టీ కార్యకర్తలకు భావోద్వేగాలు ఉండవా? ఒక్క వైసీపీ నాయకులకేనా భావోద్వేగాలు ఉండేది? నీతి, నిజాయితీ, నిబద్ధత, క్రమశిక్షణ, మానవత్వం వంటి గొప్ప లక్షణాలతో ఏర్పడిన జనసేన పార్టీని మోస్తున్న కార్యకర్తలకు ఇంకా ఎక్కువ భావోద్వేగాలు ఉంటాయి. శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలను రెచ్చగొడుతున్నారని వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు… ఆయన నిజంగా రెచ్చగొడితే పరిస్థితి ఇలా ఉండదు. మరోలా ఉంటుంది. ఆయన వాళ్లను కంట్రోల్ చేస్తున్నారు కాబట్టే సంయమనం పాటిస్తున్నారు. వైసీపీ ముందస్తు ప్లాన్ లో భాగంగానే విమానాశ్రయం ఘటన జరిగింది తప్ప మరొకటి కాదు. కుట్రపూరిత రాజకీయాలకు బలవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడారు… ఈ రోజు సభా ముఖంగా చెబుతున్నాను.. నాయకుడే బలి కావాల్సి వస్తే… అందరికంటే నేనే ముందుంటాను. అధ్యక్షులను తాకాలంటే ముందు నా శవం దాటాలని” అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శలు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గాల సభ్యులతో పాటు వేలాదిగా జనసైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు.