మనదే రాబోయే ప్రభుత్వం

• ఎన్నికలకు 100 రోజులే సమయం ఉంది
• కలసి పని చేద్దాం.. ప్రభుత్వంలో భాగస్వాములవుదాం
• జగనన్న అన్ని వర్గాలను దోచుకుంటున్నాడు
• రైతులను దగా చేశాడు.. కేవలం 16 మంది రైతులకే పంట నష్టం బీమా వచ్చింది
• రాష్ట్ర ప్రభుత్వం వాటా చెల్లించకపోవడంతో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు ఏపీకి అర్హత లేకుండాపోయింది
• బడికి వెళ్ళే చిన్నపిల్లల దగ్గర డబ్బు కొట్టేశాడు
• ప్రభుత్వ దోపిడీని ప్రజల్లోకి తీసుకువెళ్ళండి
• త్వరలో ఇసుక కొరతపై జనసేన – టీడీపీ తదుపరి కార్యాచరణ
• చిత్తశుద్ధితో పని చేస్తే భవిష్యత్తుకు ఢోకా ఉండదు
• జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్

‘ఎన్నికలకు 100 రోజులు మాత్రమే సమయం ఉంది. మనదే రాబోయే ప్రభుత్వం. ప్రతి ఒక్కరు గర్వపడే స్థాయిలో ఆ ప్రభుత్వంలో భాగస్వాములవుదామ’ని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వం ప్రతి వర్గాన్ని మోసం చేస్తోంది.. సామాన్యులను ఇబ్బందిపెడుతోందన్నారు. కేసులు పెడతామని భయపెడుతోందని, ఇలాంటి పరిస్థితుల మధ్యే తెలంగాణ ప్రజలు తీర్పునకు సిద్ధమయ్యారనే విషయాన్ని గుర్తుంచుకోవాలని చెప్పారు. జగన్ అన్ని వర్గాలను దోచుకుంటున్నాడు… ఈ సీఎం రైతుని దగా చేశాడు.. ఆఖరుకి బడికిపోయే చిన్నపిల్లల దగ్గర కూడా డబ్బు కొట్టేశాడని తెలిపారు. ఇన్ని సమస్యలు సృష్టిస్తూ మనకు పోరాటం చేసే అవకాశం కల్పిస్తున్న వైసీపీకి ధన్యవాదాలు తెలియచేయాలన్నారు. జనసేన పార్టీ సిద్ధాంతాలు, టీడీపీతో ఎందుకు పొత్తుకి వెళ్తున్నామనే విషయాన్ని క్రమశిక్షణతో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. ప్రతి అంశాన్ని ఎక్కడా తగ్గకుండా ముందుకు తీసుకువెళ్లాలని కోరారు. శుక్రవారం జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారితో కలసి పాల్గొన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ నాగబాబు గారు పాల్గొన్నారు. పీఏసీ సభ్యులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, సంయుక్త కార్యదర్శులు, నియోజకవర్గ బాధ్యులు, వీర మహిళ రీజినల్ కో ఆర్డినేటర్లు, అధికార ప్రతినిధులు, అనుబంధ విభాగాల చైర్మన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో శ్రీ చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులతో నిర్బంధించినప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర భవిష్యత్తు కోసం కీలక నిర్ణయం తీసుకున్నారు. రాజమండ్రిలో శ్రీ చంద్రబాబు గారిని కలసిన అనంతరం జనసేన పార్టీ టీడీపీతో కలసి ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. ఆ సందర్భంగా ఆరు మాసాలే సమయం ఉంది. వైసీపీని ఇంటికి పంపాలని పిలుపు ఇచ్చారు. సుస్థిర స్వర్ణాంధ్ర కోసం అంతా అంకిత భావంతో కలసి పని చేసి ఈ ప్రభుత్వాన్ని ఇంటికి పంపాలని కోరారు. ఇప్పుడు మరో మూడు మాసాలు మాత్రమే సమయం మిగిలింది. పొత్తు ప్రకటన తర్వాత వివిధ స్థాయిల్లో ఇరు పార్టీల నాయకుల మధ్య సమావేశాలు విజయవంతంగా జరిగాయి. ఈ సందర్భంగా జనసేన పార్టీ బలం చూపగలిగాం. జిల్లా స్థాయి నుంచి మండల స్థాయి వరకు కలసి చేపట్టాల్సిన కార్యక్రమాలపై చర్చించుకున్నాం. అభివృద్ధి, చేపట్టే సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించాం. గత నెల 17వ తేదీ నుంచి భవిష్యత్ గ్యారెంటీ పేరిట ఇంటింటి కార్యక్రమం చేపట్టాం. డిసెంబర్ 15వ తేదీ వరకు నిర్వహించనున్న ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కోటి గృహాలు సందర్శనకు కార్యచరణ సిద్ధం చేశాం. ఈ కార్యక్రమాన్ని కీలకంగా తీసుకుంటే నియోజకవర్గాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రభుత్వం చేపడుతున్న ప్రజా వ్యతిరేక కార్యక్రమాలు అర్ధం అవుతాయి.
• వైసీపీ అవినీతిని, ఉమ్మడి మేనిఫెస్టోని ప్రజల్లోకి తీసుకువెళ్లండి
ప్రజా సమస్యలపై ఉమ్మడి కార్యచరణలో భాగంగా గత నెల 18, 19 తేదీల్లో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల దుస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ నిర్వహించాం. మరిన్ని ప్రజా సమస్యలు రాష్ట్ర స్థాయిలో జరిగిన సమన్వయ సమావేశాల్లో గుర్తించాం. ఉమ్మడి కార్యాచరణలో భాగంగా తదుపరి అంశంగా ఇసుక అంశాన్ని గుర్తించాం. వైసీపీ నాయకులు సామాన్యులకు ఇసుక దొరకకుండా ఏ విధంగా దోపిడి చేస్తున్నారో ప్రజలకు తెలియ చేసే విధంగా కార్యక్రమం చేపడదాం. ఇసుక రీచ్ లు, స్టాక్ యార్డులు సందర్శించి ప్రజల ఇబ్బందులు ఎండగడదాం. త్వరలో తేదీలు ప్రకటిస్తాం. ఇసుక కొరత అంశం తదుపరి కార్యక్రమంగా ఉంటుంది. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన కోసం పార్టీ నుంచి కమిటీ ఏర్పాటు చేశాం. షణ్ముఖ వ్యూహంతో పాటు టీడీపీ సూపర్ సిక్స్ లోని అంశాలు కలుపుకుని వెళ్లే విధంగా మేనిఫెస్టో రూపొందిస్తున్నాం. మేనిఫెస్టోతోపాటు ప్రభుత్వ అవినీతిపై సమాచారం తెప్పించుకుని ప్రజల్లోకి తీసుకువెళ్లాలి. పాల వెల్లువ పేరిట రూ.2787 కోట్లు దోచేశారు. జగనన్న విద్యా కానుక ముసుగులో బడికిపోయే పిల్లల దగ్గర డబ్బులు కొట్టేశారు. ఈడీ అధికారులు రూ. 120 కోట్లు పట్టుకున్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ఆ డబ్బు పంచారు. నాడు – నేడు అంటే ఇదేనా? విద్యా శాఖలో అవినీతి మామూలుగా జరగలేదు. టోఫెల్, ఐబీల గురించి మీడియా సమావేశాల్లో తెలియపర్చాం. సి.బి.ఎస్.సి. గురించి త్వరలో వివరిస్తాం. ప్రజలు జగన్ రెడ్డి ఇసుక, మద్యం అమ్ముకుని మాత్రమే సంపాదించుకుంటున్నాడన్న భ్రమలో ఉన్నారు. ప్రతి వర్గాన్ని, ప్రతి శాఖను దెబ్బ తీసే విధంగా సాగుతున్న ఇంత భారీ అవినీతిని ఎన్నడూ చూడలేదు. నిధులన్నీ మళ్లించి విద్యాశాఖను నిర్వీర్యం చేశారు. ఏడాది 9 నెలల వయసున్న ఇండోసెల్ అనే కంపెనీకి 8,348 ఎకరాల భూమిని ఈ ప్రభుత్వం దోచిపెట్టింది. ఊహించని స్థాయిలో రాయితీలు ఇచ్చింది. 20 కిలోమీటర్ల పరిసరాల్లో ఎలాంటి కట్టడాలు రాకుండా చేశారు. రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. గతంలో జగనన్న కాలనీలు సందర్శించి అక్కడి వాస్తవాలు తెలిచపర్చినప్పుడు రాష్ట్ర ప్రజలు ఆశ్చర్యపోయారు. భూ సేకరణ పేరిట అన్యాయంగా దోచేశారు. వాళ్ల మనుషులకు లబ్ది కలిగే విధంగా చేశారు. నియోజకవర్గ స్థాయిలో మీరు జగనన్న కాలనీల్లో సందర్శించి అక్కడ సాగుతున్న అక్రమాలపై మాట్లాడండి.
• బీమా మేమే కడతామని జగన్ మోసం చేశారు
రైతుని జగనన్న దగా చేశాడు. రైతులకు బీమా మేమే కడతాం అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నుంచి కట్టాల్సిన మొత్తం చెల్లించలేదు. రూ.400 రూపాయలు కట్టుకోగలిగే రైతుని ప్రతి రూపాయి మేమే కడతామని చెప్పి మోసం చేశారు. కేంద్రం వరుసగా రెండేళ్లు డబ్బు చెల్లించింది. రైతుని కట్టొద్దని చెప్పి మోసం చేశారు. ప్రభుత్వ మోసం కారణంగా ప్రధాన మంత్రి ఫసల్ బీమా మనకు వర్తించకుండా పోయింది. చివరికి కరవు మండలాలు కూడా ప్రకటించకుండా చేశారు. కేంద్రం రాష్ట్రాన్ని బ్లాక్ లిస్టులో చేర్చిన పరిస్థితి. ముఖ్యమంత్రి మాత్రం ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో రాజకీయ ప్రసంగాలు చేసి మన పార్టీ అధ్యక్షుడిని కించపర్చే విధంగా వ్యాఖ్యలు చేస్తారు. మన వరకు మనం పార్టీ అధ్యక్షుల వారి వ్యూహానికి కట్టుబడి నిజాయితీగా, చిత్తశుద్దితో నిలబడితే భవిష్యత్తు గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. అందర్నీ కలుపుకుపోతూ, యువత, మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నియోజకవర్గంలో మనం విజయం సాధించే విధంగా పని చేయండి. ప్రతి గంటా పని చేస్తూ జనసేన – టీడీపీ అభ్యర్ధుల విజయం కోసం పని చేయండి” అన్నారు.