న్యూజీలాండ్‌లో ఎంపీగా గెలిచి.. సంస్కృతంలో ప్రమాణ స్వీకారం..

న్యూజీలాండ్ పార్లమెంట్‌కు భారతసంతతి వైద్యుడు ఎన్నికయ్యారు. భారత సంతతికి చెందిన డాక్టర్ గౌరవ్ శర్మ పశ్చిమ హామిల్టన్ నుంచి న్యూజిలాండ్ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికయ్యారు. అంతే కాకుండా.. ఆయన కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టి తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. న్యూజీలాండ్ పార్లమెంట్‌లో ఎంపీగా సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసి గౌరవ్ శర్మ సరికొత్త రికార్డును నెలకొల్పారు. న్యూజీలాండ్ చట్ట సభ చరిత్రలో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన తొలి భారత సంతతి వ్యక్తిగా చరిత్ర సృష్టించారు. కాగా, విదేశీ చట్ట సభల్లో సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేసిన రెండవ వ్యక్తిగా గౌరవ్ నిలిచారు. తొలుత ఆ దేశానికి సంబంధించిన మావొరి భాషలో ప్రమాణ స్వీకారం చేసిన గౌరవ్ శర్మ.. ఆ తరువాత సంస్కృతంలో తన ప్రమాణ స్వీకారాన్ని కొనసాగించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కాగా, ఆయన ప్రమాణ స్వీకారంపై సోషల్ మీడియాలో చిన్నపాటి చర్చ జరిగింది. శర్మ సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశాడు ఓ నెటిజెన్. దీనికి ఆయన గట్టి సమాధానమే ఇచ్చారు. ”లేబర్ పార్టీ నుంచి గెలిచిన శర్మ.. భారతదేశంలో నిమ్న కులాలను అణచివేసిన సంస్కృతంలో ప్రమాణ స్వీకారం చేయడమేంటి? సంస్కృతం హిందుత్వకు సూచిక. అంతే కాకుండా పెట్టుబడిదారి విధానానికి సూచిక. లేబర్ పార్టీ పాటించే విలువలు ఇవేనా?” అని ఓ నెటిజెన్ ప్రశ్నించారు.

దీనికి శర్మ సమాధానం ఇస్తూ ”భారతదేశంలో చాలా భాషలు ఉన్నాయి. అందులో సంస్కృతం ఒకటి. సంస్కృతం అనేది భారత్‌లో పురాతన భాష. ఈ భాష నుంచి ఇండియాలోని చాలా భాషలు పుట్టుకొచ్చాయి. నేను ఒకే భాషలో ప్రమాణ స్వీకారం చేయలేదు. రెండు భాషల్లో ప్రమాణ స్వీకారం చేశాను. అందులో సంస్కృతం ఒకటి. నా మాతృభాష పహారి. అయితే ఏ భాషలో ప్రమాణ స్వీకారం చేసిన స్థానికతను సూచిస్తుంది. అదే సంస్కృతంలో అయితే భారత్ మొత్తానికి వర్తిస్తుందని ఆ భాషలో ప్రమాణ స్వీకారం చేశాను” అని అన్నారు.