కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారు

హైదరాబాద్‌లోని దుర్గం చెరువుపై నిర్మించిన కేబుల్ బ్రిడ్జి ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న సాయంత్రం 5గంటలకు ఈ కేబుల్‌ బ్రిడ్జిని కేటిఆర్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. దాదాపు రూ.184కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 45-ఐటీ కారిడార్‌ను అనుసంధానం చేయనుంది.

233 మీటర్ల పొడవు, ఆరు లేన్ల వెడల్పు ఉన్న ఈ బ్రిడ్జిపై పాదచారులు, సైకిలిస్ట్‌ల కోసం ప్రత్యేక ట్రాక్‌లు ఏర్పాటు చేశారు. బ్రిడ్జిపై ప్రత్యేకంగా లైటింగ్‌ ఏర్పాటు చేశారు. రాత్రి సమయంలో వివిధ రంగుల్లో జిగేల్‌మంటోంది. కేబుల్‌ బ్రిడ్జికి రెండువైపుల వాటర్‌ ఫౌంటేన్‌లు ఏర్పాటు చేయనున్నారు. ఒకరకంగా నగరంలో ఇది కూడా ఓ టూరిస్ట్ స్పాట్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో టూరిజం శాఖ అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో ఇక్కడ బోటింగ్, రెస్టారెంట్లను కూడా ఏర్పాటు చేస్తోంది.

దుర్గం చెరువుపై నిర్మించిన ఈ కేబుల్ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే మాదాపూర్-జూబ్లీహిల్స్ మధ్య దూరం తగ్గనుంది. వాహనదారులకు ట్రాఫిక్ సమస్య తగ్గుతుంది.