అడుగడుగునా అక్రమ అరెస్టులు, నిర్భంధాలు

• జనసేన నాయకుల ఇళ్ల చుట్టూ పోలీసు పహారా
• ఆదివారం రాత్రి నుంచి కొనసాగిన అరెస్టులు
• మితిమీరిన ఆంక్షల నడుమ రాజధానిలో సీఎం పర్యటన

జనసేన నేతల అక్రమ అరెస్టులు, గృహ నిర్భంధాల మధ్య ముఖ్యమంత్రి రాజధాని పర్యటనకు రంగం సిద్ధమైంది. నిషిద్ధ ఆర్ 5 జోన్ పరిధి అంశం న్యాయస్థానంలో పెండింగ్ లో ఉన్నప్పటికీ పేదల ఇళ్ల శంకుస్థాపనల పేరిట ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం వద్ద శాంతియుత నిరసన తెలియజేసేందుకు జనసేన పార్టీ నిర్ణయించింది. దీనిలో భాగంగా గుంటూరు జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ గాదె వెంకటేశ్వరరావు ఛలో కృష్ణాయపాలెం పిలుపు నేపధ్యంలో ఆదివారం రాత్రి నుంచే పోలీసులు జనసేన నాయకుల కోసం జిల్లా మొత్తం జల్లెడ పట్టారు. జిల్లా అధ్యక్షుడు శ్రీ గాదె వెంకటేశ్వరరావుని మొబైల్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసి వెళ్లి మరీ తెనాలిలో అదుపులోకి తీసుకున్నారు. ముఖ్యమంత్రి పర్యటనకు వెళ్లడానికి వీల్లేదంటూ నోటీసులు ఇచ్చి గుంటూరు నగరంలోని ఆయన నివాసంలో నిర్భంధించారు. ఇద్దరు ఎస్సైల ఆధ్వర్యంలో పహారా ఏర్పాటు చేశారు. పార్టీ గుంటూరు జిల్లా కార్యాలయంతో పాటు, పట్టణ కార్యాలయంలోనూ సోదాలు నిర్వహించి అక్కడ ఉన్న నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మంగళగిరి, తాడికొండ నియోజకవర్గాల్లోని జనసేన పార్టీ నాయకుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. మంగళగిరి పార్టీ ఇంఛార్జ్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాసరావుకి కనీసం నోటీసులు కూడా జారీ చేయకుండా పోలీసులు గృహనిర్భంధం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బేతపూడి విజయ్ శేఖర్, మంగళగిరి-తాడేపల్లి కార్పోరేషన్ అధ్యక్షులు శ్రీ మునగపాటి వెంకట మారుతీరావు, తాడేపల్లి మండలాధ్యక్షులు శ్రీ సామల నాగేశ్వరరావు, తాడికొండ మండల అధ్యక్షులు శ్రీ గులకవరపు నరేష్ లను ఆదివారం రాత్రే అరెస్టు చేసి మంగళగిరి రూరల్, తాడేపల్లి, తాడికొండ పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఉండవల్లి గ్రామాధ్యక్షులు శ్రీ శిరిగిశెట్టి రాజరమేష్, శ్రీ పోతురాజు రాము, శ్రీ గుర్రాల శేషగిరి, రేపల్లి టౌన్ అధ్యక్షులు శ్రీ మహేష్, రూరల్ మండలాధ్యక్షులు శ్రీ జానకి రామయ్య తదితరులను కూడా పోలీసులు అక్రమంగా అరెస్టు చేశారు. పొన్నూరు మండల అధ్యక్షులు శ్రీ సుబ్బారావుతో పాటు పార్టీ నాయకులు శ్రీ అప్పారావు, శ్రీ సూర్య తదితరులు అరెస్టు అయిన వారిలో ఉన్నారు.

మంగళగిరి, తాడేపల్లి నియోజకవర్గాలతో పాటు గుంటూరు నగర పరిధిలోని జనసేన నాయకులందరి ఇళ్ల వద్ద పోలీసు పహారా ఏర్పాటు చేశారు. అందరికీ నోటీసులు జారీ చేశారు. తెనాలితో పాటు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర, జిల్లా కార్యవర్గం సభ్యులు, మండలాధ్యక్షులందరికీ పోలీసులు ముందస్తు నోటీసులు జారీ చేశారు. తెనాలిలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బండారు రవికాంత్ ను పోలీస్ స్టేషన్ కి పిలిపించి మరీ నోటీసులు జారీ చేశారు. జనసేన నాయకుల కదలికలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి రోడ్డెక్కిన ప్రతి వాహనాన్ని జనసేన నాయకుల అరెస్ట్ లక్ష్యంగా తనిఖీలు చేస్తున్నారు. రాజధాని ప్రాంతంలోని జనసేన నేతలు, కార్యకర్తలను ఇళ్ల నుంచి కూడా బయటకు రావడానికి వీల్లేదంటూ ఆంక్షలు విధించారు.
• రాత్రంతా స్టేషన్ లో హైడ్రామా
పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీ బేతపూడి విజయ్ శేఖర్ తో పాటు మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని నాయకులన్ని అర్ధరాత్రి నోటీసులు ఇస్తామంటూ స్టేషన్ కి పిలిచి రాత్రంతా స్టేషన్ లోనే హైడ్రామా నడిపించారు. ముందుగా నోటీసు ఇచ్చి దాన్ని వెనక్కి 

తీసేసుకున్నారు. ఇదిగో అదిగో అంటూ రాత్రంతా స్టేషన్ లోనే ఉంచి తెల్లవారిన తర్వాత నోటీసులు ఇచ్చి విడుదల చేశారు. శాంతియుతంగా నిరసన తెలియచేసే ప్రయత్నం చేస్తే పోలీసులను అడ్డు పెట్టుకుని అక్రమ అరెస్టులకు పాల్పడడాన్ని ఈ సందర్భంగా శ్రీ విజయ్ శేఖర్ తప్పుబట్టారు. అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరంటూ మండిపడ్డారు. ఇలాగే ముందుకు వెళ్తే రానున్న ఎన్నికల్లో ప్రజలు బుద్ది చెబుతారన్నారు. పోలీసులు ప్రజల కోసం మాత్రమే పని చేయాలని, పాలకుల కోసం కాదని హితవు పలికారు. ఎన్ని అరెస్టులు చేసినా జనసేన పార్టీ ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని తెలిపారు.
• రాజధాని పరిసరాల్లో భయానక వాతావరణం
మూడు రాజధానుల ప్రకటన తర్వాత పరదాలు కట్టుకుని వెలగపూడి సచివాలయానికి, అసెంబ్లీకి వెళ్లి వచ్చిన ముఖ్యమంత్రి, ఇళ్ల శంకుస్థాపన సందర్భంగా పోలీసుల సాయంతో మరింత నిర్భంధంకాండ సాగిస్తున్నారు. రాజధాని ప్రాంతంలో అప్రకటిత కర్ఫ్యూ స్థితి నెలకొంది. రెండు రోజులుగా రాజధాని గ్రామాల్లో వందలాది మంది పోలీసులు, ప్రత్యేక బలగాలు మోహరించాయి. కృష్ణాయపాలెం పరిసరాల్లోని వెంకటాయపాలెం, తుళ్లూరు, యర్రబాలెం, పెనుమాక గ్రామాల్లో మరింత తీవ్రమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అమరావతి రాజధాని కోసం ఉద్యమం చేస్తున్న రైతులు, వారి కుటుంబ సభ్యులపై తీవ్రమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. సోమవారం ఉదయం నుంచి ముఖ్యమంత్రి పర్యటన పూర్తయ్యేంత వరకు ఇళ్ల నుంచి ఎవరూ బయటకు రాకూడదని ఇంటింటికీ వెళ్లి పోలీసులు హుకుం జారీ చేశారు. నలుపు రంగు వస్త్రాలు బయట కనబడకుండా జల్లెడ పడుతున్నారు. ఇళ్లు పట్టాల లబ్దిదారులైన 50 వేల మంది కుటుంబాలు, వారితో పాటు వచ్చే వారికి ప్రత్యేకంగా ఐడీ కార్డులు జారీ చేశారు. రాజధాని గ్రామాల్లో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు వస్తే పోలీసులు ఏం చేస్తారోనని భయంతో వణికిపోతున్నారు. ఉద్యమంపై మొదటి నుంచి ఉక్కుపాదం మొపుతున్న ప్రభుత్వం నిబంధనలకు విరుద్దంగా ఆర్ 5 జోన్ లో ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం పట్ల తీవ్ర స్థాయిలో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. ఈ అంశంపై ఉన్నత న్యాయ స్థానంలో తీర్పు రిజర్వ్ లో ఉంది. న్యాయపరమైన చిక్కులు ఉన్నప్పటికీ అక్కడ వైసీపీ ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపడతామంటూ సోమవారం సీఎం శంకుస్థాపనకు శ్రీకారం చుట్టారు.