వైసీపీ పాలనలో వృక్షాలు కూడా విలపిస్తున్నాయి

– ట్విటర్ లో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ 
ముఖ్యమంత్రి జగన్ పర్యటనల సందర్భంలో చెట్లు నరికి వేస్తున్న తీరుపై జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఈ రోజు స్పందించారు. ఇందుకు సంబంధించి చేసిన ట్వీట్స్ సారాంశం ఇది…
“మనకు నీడను అందించడమే కాకుండా ఆహారాన్ని కూడా అందించే చెట్లను మీరు రక్షించనప్పుడు, చివరికి ఆ కర్మ కేవలం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రినే కాదు ఈ పరిపాలనలో భాగమైన అందరినీ పట్టుకుంటుంది. ఏపీ సీఎం పర్యటనలో చెట్లను నరికివేయడం అనేది ఒక విచిత్రమైన తీరుగా కనిపిస్తోంది.
శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ‘పుష్ప విలాపం’ చదవనప్పుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త జగదీష్ చంద్రబోస్ ప్రయోగాలు అర్థం కానప్పుడు- వృక్షాలను, మొక్కలను నరికేస్తుంటే కలిగే బాధ వాళ్ళకు ఎలా తెలుస్తుంది? కాబట్టే ఈ వృక్షాల నరికివేత సాగిపోతుంది.
సీఎం కాకపోతే కనీసం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అయినా విచక్షణారహితంగా చెట్లను నరికివేయవద్దని సంబంధిత అధికారులకు సూచించాలి.
కోనసీమలో కొబ్బరి చెట్టును ఇంటికి పెద్ద కొడుకుగా భావిస్తారు. అటువంటి కొబ్బరి చెట్లను సైతం నిలువునా నరికేశారు. ముఖ్యమంత్రి అమలాపురం పర్యటనకు వెళ్తున్నారని అక్కడి చెట్లను నరికేశారు. తమిళనాట చెట్టును కుటుంబ సభ్యునిగా చూసుకుంటారు. ఆ రాష్ట్రంలో ఆస్తులు కూడబెట్టుకొనే వాళ్లు ఈ విషయం కూడా తెలుసుకోవాలి.”
వృక్షో రక్షతి రక్షితః
శ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి ‘పుష్ప విలాపం’ నుంచి…
ఓయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చెనేమి
అందమును హత్య చేసెడి హంతకుండా
మైలపడిపోయెనోయి నీ.. మనుజ జన్మ ..
అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలి గైకొని
నాపై నీ కరుణశ్రీరేఖలను ప్రసరింపుము ప్రభు..
ప్రభూ …