రోడ్లు వేయ లేరు.. రాజధాని కడతామని మోసం చేస్తున్నారు

•అమరావతితో అభివృద్ధి సాధ్యపడేది
•రాష్ట్రాన్ని ఈ ప్రభుత్వం 20 ఏళ్లు వెనక్కి తీసుకువెళ్లింది
•కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జనసేనతోనే సాధ్యం
•క్రియాశీలక సభ్యత్వం కేవలం బీమా పథకం కాదు.. పార్టీతో అనుబంధం
•మార్పు కోసం చేసే ప్రయాణంలో మనమంతా భాగస్వాములవుదాం
•తెనాలి నియోజకవర్గ క్రియా వాలంటీర్ల సమీక్షా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్

కుళ్లిపోయిన రాజకీయ వ్యవస్థ ప్రక్షాళన జనసేన పార్టీతోనే సాధ్యమని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. రాజకీయాల్లో మార్పు కోసం చేస్తున్న ప్రయాణంలో ప్రతి కార్యకర్తని భాగస్వాముల్ని చేసే ఉద్దేశంతో క్రియాశీలక సభ్యత్వ నమోదు ప్రక్రియ చేపట్టినట్టు తెలిపారు. క్రియాశీలక సభ్యత్వాన్ని కేవలం ఒక బీమా పథకంగా కాకుండా ఒక ప్రత్యేక గుర్తింపుగా.. పార్టీతో అనుబంధంగా భావించి స్వీకరించాలన్నారు. మనం ఎంత బలంగా క్రియాశీలక సభ్యత్వం చేస్తే ఎన్నికలకు అంత బలంగా సిద్ధమవుతామన్నారు. రోడ్లు కూడా వేయలేని మనుషులు రాజధానులు కడతామని చెప్పి ప్రజల్ని మోసం చేస్తున్నారని.. అమరావతి వచ్చి ఉంటే ఎంతో అభివృద్ధి జరిగేదని అన్నారు. సోమవారం సాయంత్రం తెనాలి నియోజకవర్గ క్రియా వాలంటీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో మూడో విడత సభ్యత్వ నమోదు ప్రక్రియపై చర్చించారు. అనంతరం శ్రీ మనోహర్ గారు మాట్లాడుతూ “క్రియాశీలక సభ్యత్వాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రత్యేకంగా గుర్తించారు. సభ్యత్వ నమోదును ప్రతి కార్యకర్త ఒక బాధ్యతతో స్వీకరించాలి. చిత్తశుద్దితో ముందుకు తీసుకువెళ్లాలి. క్రియాశీలక సభ్యులకు ప్రత్యేక గుర్తింపుతో పాటు ఐడీ కార్డు, గాజు గ్లాసు, బ్యాడ్జితో కూడిన కిట్టును ఈ ఏడాది సిద్ధం చేస్తున్నాం. దీంతో పాటు షణ్ముఖ వ్యూహంతో కూడిన బ్రోచర్ అందుబాటులో ఉంటుంది. షణ్ముఖ వ్యూహమే జనసేన ఎన్నికల ప్రణాళిక. జనసేన పార్టీ ప్రభుత్వంలో.. వ్యవసాయ రంగానికి ఏం చేయబోతున్నామనేది షణ్ముఖ వ్యూహంలో తెలియచేశారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చేందుకు ఏటా లక్ష మందికి రూ.10 లక్షల చొప్పున ప్రభుత్వం ద్వారా సాయం చేయడం ద్వారా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే అవకాశం కల్పిస్తాం. క్రియాశీలక సభ్యులంతా షణ్ముఖ వ్యూహాన్ని ఇంటింటికీ తీసుకువెళ్లాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వ ఆవశ్యకతను ప్రజలకు వివరించాలి.
•పాలకుల బెదిరింపులు తిప్పికొట్టండి
తెనాలి నియోజకవర్గంలో స్వయంగా వార్డులు, గ్రామాల్లో పర్యటించి క్రియాశీలక సభ్యత్వ ఆవశ్యకతను వివరిస్తాను. క్రియాశీలక సభ్యులంతా కంకణబద్దులై ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకువెళ్లాలి. శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక మార్పు తీసుకురాగలమన్న నమ్మకంతో ప్రతి ఒక్కరు పని చేయాలి. ఎన్నికల కోసం రకరకాల పుకార్లు పెడతారు. రాజకీయంగా కావాలని మన మీద బురద చల్లే ప్రయత్నాలు చేస్తారు. అంతిమంగా ప్రజలు మన చిత్తశుద్దిని గుర్తిస్తారు. అమరావతిని నిర్వీర్యం చేసిన కారణంగా ఈ ప్రభుత్వం వచ్చాక రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోయింది. అన్నింటినీ ధైర్యంగా ప్రజల్లోకి తీసుకువెళ్లండి. కేసులకు భయపడవద్దు. ఏ ప్రభుత్వమైనా సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే. ఇంటింటికి వెళ్లి బెదిరిస్తే తిప్పికొట్టండి. మన పార్టీ గురించి ప్రజాస్వామ్య బద్దంగా ప్రజలకు చెప్పుకుందాం. వర్ధమాన రాజకీయాల్లో జనసేన అవసరం ప్రజలకు తెలియాలి. మంచి మార్పు కోసం జనసేన నిలబడుతుంది. అందులో అంతా భాగస్వాములు కావాలి” అన్నారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి శ్రీ బండారు రవికాంత్, పార్టీ నాయకులు శ్రీ ఇస్మాయిల్ బేగ్, శ్రీ పసుపులేటి మురళీకృష్ణ, శ్రీ షేక్ జాకిర్ హుస్సేన్, శ్రీ తోటకూర వెంకటరమణారావు, శ్రీ గుంటూరు కృష్ణమోహన్, శ్రీ ఎర్రు వెంకయ్యనాయుడు, శ్రీ దివ్వెల మధుబాబు తదితరులు పాల్గొన్నారు.