ఆకలి తీర్చే అమ్మలా ‘అన్నపూర్ణ’

జీహెచ్‌ఎంసీ నిరు పేదల ఆకలి తీర్చేందుకు ఏర్పాటు చేసిన అన్నపూర్ణ 5 రూపాయల భోజన పథకానికి ఎంతో విశేషమైన  ఆదరణ లభిస్తోంది. కరోనా సమయంలో పూర్తి ఉచితంగా అన్నార్తుల ఆకలి తీర్చే అమ్మలా ‘అన్నపూర్ణ’ నిలుస్తోంది. ఈ భోజనం కావాలంటూ ఎక్కువ సంఖ్యలో వినతులు కొవిడ్‌ కంట్రోల్‌ రూమ్‌కు వస్తున్నాయి. ఇతరులతో పాటు హోం ఐసోలేషన్‌, కంటైన్‌మెంట్‌ జోన్లలో ఉన్నవారూ భోజనం కోసం అభ్యర్థిస్తుండగా వారికి కూడా భోజనాన్ని ఉచితంగా అందచేస్తున్నారు. కరోనా నేపథ్యంలో నెలకొన్న పరిస్థితుల్లో పూర్తి ఉచితంగా అన్నపూర్ణ భోజనాన్ని జీహెచ్‌ఎంసీ అందిస్తోంది. ఒక్కపూటైనా కడుపునిండా అన్నం పెట్టాలనే ఉద్దేశంతో 5 రూపాయల బోజన పథకానికి శ్రీకారం చుట్టింది బల్దియా. ఒక్కో భోజనానికి రూ.24.25 ఖర్చు అవుతుండగా 450 గ్రాముల అన్నం, 100 గ్రాముల పప్పు, సాంబార్‌, ఒక కూర, పచ్చడితో భోజనం అందిస్తున్నారు. కరోనా కష్టకాలంలో సైతం ఎవరూ ఆకలితో ఇబ్బంది పడొద్దనే ఉద్దేశంతో రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ చొరవ తీసుకుని అన్నపూర్ణ భోజనం పంపిణీ కేంద్రాలను పెంచాలని నగర మేయర్‌ బొంతు రామ్మోహన్‌కు నిర్దేశించారు.