పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడం వైసీపీ ప్రభుత్వ బరి తెగింపునకు పరాకాష్ట

• దేశంలో ఇలాంటి దారుణ దుశ్చర్య ఎక్కడా జరగలేదు
• శ్రీ పవన్ కళ్యాణ్ వెంట కదిలిన ఆశేష జనవాహిని మార్పునకు సంకేతం
• వారాహి యాత్ర చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది
• పార్టీకి ప్రజల్లో పెరిగిన బలాన్ని అందిపుచ్చుకోవాలి
• ఎన్నికల సమరానికి ప్రతి ఒక్కరినీ సన్నద్దం చేయండి
• పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షుల సమావేశంలో శ్రీ నాదెండ్ల మనోహర్

జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని రాష్ట్రంలో అడుగుపెట్టకుండా అడ్డుకునేందుకు చేసిన ప్రయత్నం వైసీపీ ప్రభుత్వ బరి తెగింపుకు పరాకాష్ట అని పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు స్పష్టం చేశారు. ఇలాంటి దారుణమైన దుశ్చర్య దేశంలో ఇంతకు ముందెన్నడూ జరగలేదని తెలిపారు. పార్టీ కార్యాలయానికి వచ్చేందుకు బయలుదేరిన శ్రీ పవన్ కళ్యాణ్ గారి విమానాన్ని అడ్డుకోవడమే కాకుండా, రోడ్డు మార్గంలోనూ రాష్ట్ర సరిహద్దు నుంచి తిప్పి పంపే ప్రయత్నం చేశారన్నారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అనే స్థాయికి వైసీపీ ప్రభుత్వ చర్యలు చేరాయన్నారు. అర్ధరాత్రి సైతం ఆయన కోసం తరలివచ్చిన ఆశేష జనవాహిని.. మార్పుకి సంకేతమన్నారు. ప్రజల్లో వచ్చిన మార్పుని, పార్టీకి పెరిగిన బలాన్ని నాయకులు అందిపుచ్చుకోవాలని సూచించారు. ఆదివారం సాయంత్రం మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ పీఏసీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, జిల్లా అధ్యక్షులతో జరిగిన సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “రాష్ట్రంలో నిన్న జరిగిన సంఘటనలు ప్రతి ఒక్కరూ ముక్త కంఠంతో ఖండించాలి. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న పరిణామాలు చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఎటువంటి పరిణామాలు ఎదురైనా మనం నిలబడ్డాం. గతంలో విశాఖలో జనవాణికి వెళ్ళిన శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకున్నారు. అధికార దుర్వినియోగానికి పాల్పడి భయబ్రాంతులకు గురి చేయాలని కుట్ర చేశారు. వైసీపీ ప్రభుత్వం పనితీరు ఎలా ఉందో చూస్తున్నాం. జగన్ మంచి చేస్తే హర్షించాం. చెడు చేస్తే ప్రశ్నించాం. రాజకీయ పార్టీగా జనసేన పార్టీ ప్రజల పక్షాన నిలబడింది. హక్కులు అనేవి అందరికీ సమానంగా ఉండాలనేది శ్రీ పవన్ కళ్యాణ్ గారి విధానం.
• వాలంటీర్ వ్యవస్థపై హైకోర్టులో పిటీషన్
జనసేన పార్టీకి ప్రజల్లో పెరిగిన బలాన్ని నాయకులు అందిపుచ్చుకోవాలి. ప్రజా బలాన్ని ఓటు బలంగా మార్చుకోవడంలో సమర్థంగా పని చేయాలి. వారాహి యాత్ర ద్వారా జనసేన పార్టీ సిద్ధాంతాలను ఆలోచనలను అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లారు. వారాహి యాత్ర పార్టీ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ప్రజలకు వైసీపీ ప్రభుత్వ అసమర్ధ విధానాలను తెలియచెప్పడంతో పాటు జరుగుతున్న మోసాన్ని భవిష్యత్తు నష్టాలను బలంగా వినిపించగలిగాం. ఎంతో ధైర్యంగా క్షేత్ర స్థాయిలో జరుగుతున్న వాలంటీరు వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపడంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారి తెగువ అమోఘం. వైసీపీ ప్రభుత్వం ఒక సమాంతర వ్యవస్థను ఏర్పాటు చేసుకుని రాష్ట్రంలో నియంత పాలనకు ఎలా తెరతీసిందో ప్రజలకు వివరించగలిగాం. వాలంటీర్ వ్యవస్థ గురించి శ్రీ పవన్ కళ్యాణ్ గారు మట్లాడినప్పుడు మొదట్లో కొన్ని విభిన్న వాదనలు వచ్చినా తర్వాత ప్రజలు శ్రీ పవన్ కళ్యాణ్ గారి మాటలను అర్ధం చేసుకోవడం మొదలు పెట్టారు. దీనిపై పార్టీ తరఫున త్వరలోనే హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయాలని నిర్ణయించాం. వాలంటీర్ వ్యవస్థ పుట్టడానికి కారణాలు, క్షేత్ర స్థాయిలో వారు చేస్తున్న పని. ఈ వ్యవస్థకు అజమాయిషీ ఎవరు అనే పూర్తి విషయాలపై ఆ పిటీషన్ దాఖలు చేస్తాం.
• కొత్త ఓటర్లకు జనసేన ఆవశ్యకత తెలియచెప్పాలి
జనసేన నాయకులు క్షేత్ర స్థాయిలో ఓట్ల పరిశీలనపై ప్రధానంగా దృష్టి సారించాలి. బూత్ ల వారీగా ఓటర్ల లిస్టులు తీసుకుని ప్రతి ఓటును తనిఖీ చేయండి. వచ్చే ఎన్నికల్లో కొత్తగా రాష్ట్రంలో ఇప్పటికే 3 లక్షల 62 వేల మంది ఓట్లు నమోదు చేసుకున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారి భావజాలం నచ్చి ఇంత భారీ మొత్తంలో కొత్త ఓటర్లు నమోదయ్యారు. వారిని పార్టీ వైపు తిప్పుకునేలా విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలి. మై ఫస్ట్ ఓట్ ఫర్ జనసేన కార్యక్రమం ద్వారా కొత్త ఓటర్లకు జనసేన ప్రభుత్వ ఆవశ్యకత గురించి తెలియ చెప్పండి. ప్రతి నియోజకవర్గంలోనూ ఈ కార్యక్రమం జరగాలి. జనసైనికులు, వీర మహిళలను దీనిలో భాగస్వాముల్ని చేయాలి. అక్టోబర్ 21లోపు ఓటు వెరిఫికేషన్ చేసి అభ్యంతరాలు తెలియచేయాల్సిన అవసరం ఉంది. క్షేత్ర స్థాయి పరిస్థితిని, ఓట్ల గల్లంతును ఖచ్చితంగా ఎన్నికల సంఘానికి తెలియ చేయాలి.
• ప్రతి ఒక్కరినీ ఎన్నికలకు సిద్ధం చేయండి
వారాహి యాత్ర అయిపోయిన తర్వాత కొన్ని చోట్ల కార్యక్రమాలు చాలా స్తబ్దుగా జరుగుతున్నట్టు సమాచారం ఉంది. వారాహి యాత్ర ద్వారా వచ్చిన ప్రజాదరణను అందిపుచ్చుకునేలా ప్రజా సమస్యల పట్ల స్పందిస్తూ ప్రభుత్వ విధానాల వైఫల్యాన్ని వెల్లడించేలా మన కార్యక్రమాలు ఉండాలి. రాబోయేది చాలా కీలకమైన ఎన్నికల సమయం. ప్రతి ఒక్కరినీ సన్నద్దం చేసేలా కార్యచరణ రూపొందించుకోండి. శనివారం తెలుగుదేశం పార్టీ అధినేత శ్రీ చంద్రబాబు నాయుడు గారి అరెస్టు జరిగిన వెంటనే సమాచారం వచ్చింది. వెంటనే అధ్యక్షుల వారితో పంచుకోగా దీనిపై పార్టీ స్టాండ్ మేరకు ముందుకు వెళ్లాలని చెప్పారు. అయితే ముందుగానే అనుకున్నట్టు ఆదివారం పార్టీ పీఏసీ సమావేశం నిమిత్తం శ్రీ పవన్ కళ్యాణ్ గారు హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో రావడానికి ప్రయత్నించగా రాష్ట్ర ప్రభుత్వం గన్నవరం విమానాశ్రయ అధికారులతో చెప్పి ల్యాండింగ్ కు అనుమతించలేదు. పార్టీ సమావేశం నిమిత్తం ఎట్టి పరిస్థితుల్లో మంగళగిరి రావాలని నిర్ణయించుకున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు రోడ్డు మార్గం ద్వారా వస్తే రాష్ట్ర సరిహద్దులో పోలీసులు భారీగా గుమిగూడి శ్రీ పవన్ కళ్యాణ్ గారిని అడ్డుకోవాలని ప్రయత్నించారు. అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా తిరిగి హైదరాబాద్ పంపాలని భావించారు. అయితే సమావేశం ఉన్న దృష్ట్యా మంగళగిరి రావాలని శ్రీ పవన్ కళ్యాణ్ గారు భావించడంతో పోలీసులతో వాగ్వాదం మొదలయ్యింది. ఆ సమయంలో పోలీసు జీపులో ఉన్న శ్రీ పవన్ కళ్యాణ్ గారి వెంట అశేష జనవాహిని రాజకీయాలకు అతీతంగా కదలడం ఓ గొప్ప మార్పుకి సంకేతం. ఖచ్చితంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి నాయకత్వాన్ని ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారని ఇది సూచిస్తోంది. రాబోయే ఎన్నికల కోసం మనం చేసే రాజకీయ పోరాటం గొప్పగా ఉండాలి. భవిష్యత్తు తరాల కోసం శ్రీ పవన్ కళ్యాణ్ గారు పడుతున్న తపనకు మనమంతా బాసటగా నిలవాలి” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ పిఏసీ సభ్యులు శ్రీ కోన తాతారావు, శ్రీ ముత్తా శశిధర్, శ్రీ పితాని బాలకృష్ణ, శ్రీ కనకరాజు సూరి, శ్రీ చేగొండి సూర్యప్రకాష్, ప్రధాన కార్యదర్శులు శ్రీ తమ్మిరెడ్డి శివశంకర్, శ్రీ చిలకం మధుసూదన్ రెడ్డి, శ్రీ బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, శ్రీమతి పాలవలస యశస్వి, శ్రీ పెదపూడి విజయ్ కుమార్, జిల్లాల అధ్యక్షులు శ్రీ కొటికలపూడి గోవిందరావు, శ్రీ పోతిన వెంకట మహేష్, శ్రీ షేక్ రియాజ్, శ్రీ గాదె వెంకటేశ్వరరావు, శ్రీ చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి, శ్రీ టి.సి.వరుణ్, కార్యక్రమాల నిర్వహణ విభాగం కన్వీనర్ శ్రీ కళ్యాణం శివశ్రీనివాస్, మత్స్యకార వికాస విభాగం ఛైర్మన్ శ్రీ బొమ్మడి నాయకర్, చేనేత వికాస విభాగం ఛైర్మన్ శ్రీ చిల్లపల్లి శ్రీనివాస్ పాల్గొన్నారు.