సామాన్యుడికి రాజకీయ భాగస్వామ్యం కల్పించే మార్పు రాబోతోంది

* వ్యక్తిగత స్వార్థం వీడి రాజ్యాంగబద్ధంగా పాలన సాగాలి
* జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్
* తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా గణతంత్ర వేడుకలు

‘రాజకీయాల్లో డబ్బు, అధికార అహంకారం తగ్గాలి. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యర్యంలో రాసిన భారత రాజ్యాంగ ఫలాలు ప్రతి ఒక్కరికీ సమానంగా దక్కినపుడే నిజమైన గణతంత్ర సంబరం’ అని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అన్నారు. తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో శుక్రవారం గణతంత్ర దినోత్సవ వేడుకలను పార్టీ నాయకులు, జన సైనికులు, వీర మహిళలు మధ్య నిర్వహించారు. శ్రీ మనోహర్ గారు త్రివర్ణ పతకాన్ని ఎగురవేసి, జాతీయ గీతాన్ని ఆలపించారు. జాతీయ జెండాకు సెల్యూట్ చేశారు. అనంతరం శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మీడియాతో మాట్లాడుతూ “దేశం కోసం జాతి నాయకులు చేసిన త్యాగాలు చాలా గొప్పవి. మనం తయారు చేసుకున్న అత్యుత్తమ రాజ్యాంగాన్ని అమలు చేసుకుని, మనల్ని మనం పాలించుకున్న గొప్ప రోజుగా రిపబ్లిక్ డే నిలిచిపోతుంది. రాజ్యాంగ స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. పేదల బతుకులు మార్చేలా రాజకీయాలు ఉండాలి. రాజకీయంగా వచ్చిన పదవుల్లో వ్యక్తిగత స్వార్థం వీడి, ప్రజల కోసం, వారి క్షేమం కాంక్షిస్తూ పాలన సాగాలి. రైతాంగానికి ధైర్యం చెప్పే విధంగా, మహిళలకు భద్రత కల్పించేలా, అన్ని వర్గాల అభ్యున్నతి, అన్ని ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా పాలన సాగాలి. ఓ గొప్ప సామాజిక మార్పు, రాజకీయాల్లో సామాన్య ప్రజల భాగస్వామ్యం పెరిగేలా సరికొత్త రాజకీయ మార్పు కోసం రాష్ట్ర ప్రజలు వేచి చూస్తున్నారు. త్వరలోనే ఆ మార్పు రాష్ట్ర రాజకీయాల్లో వస్తుందని బలంగా విశ్వసిస్తున్నాం” అన్నారు.