పంటల బీమాతో రైతుకు ఏదీ ధీమా!

*పరిహారం పంపిణీ అస్తవ్యస్తం
*అర్హుల జాబితాలో లక్షలాది మందికి దక్కని చోటు
*ఆందోళనలో అన్నదాతలు ….పట్టించుకోని పాలకులు
*సాంకేతిక సమస్యలతో చిక్కులు….సరిదిద్దలేకపోతున్న వ్యవసాయాధికారులు

పంటల బీమా పక్కదారి పట్టింది. వరదలు, తుఫానులు, కరవు, అనుకూలించని వాతావరణ పరిస్థితుల్లో పంట నష్టపోయిన రైతులను ఆదుకోవాల్సిన పంటల బీమాలో తీవ్ర అవకతవకలు చోటుచేసుకున్నాయి. పంటలు నష్టపోయిన ఎంతో మంది రైతులకు పంటల బీమా పరిహారం అందలేదు. ఈ క్రాప్ నమోదు చేసినా, అవి తప్పుల తడకగా మారడం రైతుల పాలిట శాపంగా మారింది. ఒక పంటకు బదులు మరో పంట నమోదు కావడం, కొందరు రైతులు తమ పంటలను ఈ క్రాప్ చేయించినా ఆన్ లైన్ కాకపోవడంతో పంటల బీమా పరిహారం దక్కలేదని అధికారులు చెబుతున్నారు. వ్యవసాయ శాఖ అధికారులు చేసిన తప్పులకు రైతులు బలి కావాల్సి రావడం దారుణం. జరిగిన తప్పులను సరిదిద్దుతామని ప్రభుత్వం చెబుతున్నా, అది అమలు జరిగేనా అనే ఆందోళన అన్నదాతల్లో నెలకొంది.
*తెగుళ్ల నష్టానికి రాదంట!
గడచిన వ్యవసాయ సీజన్ లో 15.60 లక్షల మంది రైతులకు చెందిన 36,99,094 ఎకరాల్లో 26 రకాల పంటలు దెబ్బతిన్నాయని అధికారులు గుర్తించారు. ఇందుకుగాను రూ.2,977 కోట్ల పంటల బీమా మంజూరైంది. ఈ మొత్తాన్ని సీఎం 15,60,703 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు. అయితే పంటలు నష్టపోయిన ఇంకా లక్షలాది మంది రైతులను గాలికొదిలేశారు. గుంటూరు జిల్లాలో లక్షల ఎకరాల్లో మిర్చి సాగు చేసి రైతులు తీవ్రంగా నష్టపోయారు. జెమిని వైరస్, నల్ల తామర వల్ల మిర్చి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. చాలా మంది రైతులకు ఎకరాకు ఒకటి, రెండు క్వింటాళ్ల దిగుబడి మాత్రమే వచ్చింది. మిర్చికి వాతావరణ బీమా మాత్రమే వర్తిస్తుందని, తెగుళ్లు, నల్ల తామర వల్ల నష్టపోతే పరిహారం ఇవ్వలేమని అధికారులు తేల్చి చెప్పారు. తెగుళ్లు, నల్ల తామర వాతావరణ బీమా పరిధిలోకి రావని వ్యవసాయశాఖ అధికారులు ప్రకటించారు. ఎకరాకు లక్ష పెట్టుబడి పెట్టి దారుణంగా నష్టపోయిన మిర్చి రైతులకు మాత్రం పరిహారం అందలేదు.
*పరిహారంలో అవకతవకలు
పంటల బీమా పరిహారం చెల్లించేందుకు రూ.2,977 కోట్లు విడుదల చేసినట్టు సీఎం స్వయంగా ప్రకటించారు. కానీ ప్రస్తుతం రూ.50వేల లోపు పరిహారం వచ్చిన వారికే జమ చేశారు. రూ.50వేల పైన పంట నష్ట పరిహారం ఇవ్వాల్సిన వారు ఎదురు చూస్తున్నారు. వారికి ఎప్పుడు ఇస్తారో తెలియడం లేదు. ఇక ఈ క్రాప్ నమోదులో సాంకేతిక సమస్యలు ఇన్నీఅన్నీ కావు. ప్రకాశం జిల్లాలో పంటలు సాగు చేయని రైతుల పేర్లతో ఈ క్రాప్ చేశారని రైతులు ఆందోళనకు దిగారు. శ్మశానాలు, వాగులు, రోడ్లు, చెరువుల్లో కూడా పంటలు సాగు చేసినట్టు నమోదు చేశారు. ప్రకాశం జిల్లాలో ఓ రైతు దాల్చిన చెక్క సాగుచేసి నష్టపోయినట్టు నమోదు చేశారు. అసలు ప్రకాశం జిల్లాలో ఎక్కడా దాల్చిన చెక్క పంట సాగు చేసిన దాఖలాలు లేవు. ఈ క్రాప్ సమయంలో రైతులు వేలిముద్రలు వేయడంలో కూడా తీవ్ర సమస్యలు వస్తున్నాయి. ఈ కేవైసీ చేసినా తరువాత ఆన్ లైన్లో కనిపించడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. రైతులు వారి సమస్యలు చెప్పుకునేందుకు కాల్ సెంటర్ కు కాల్ చేయాలని ఉన్నతాధికారులు ప్రకటనలు ఇచ్చారు. రైతులు కాల్ సెంటర్ కు ఫోన్ చేస్తే వ్యవసాయశాఖ అధికారులను కలవాలని చెబుతున్నారు. వ్యవసాయశాఖ అధికారులు మాత్రం రైతులు వద్ద నుంచి ఎలాంటి వివరాలు తీసుకోవడం లేదు. మండలాల వారీగా సాగు విస్తీర్ణం, ఈ క్రాప్ చేసింది సరిపోవాలి. కానీ చాలా ప్రాంతాల్లో వ్యత్యాసం ఉంది. పంటల ఈ క్రాప్ నమోదు ప్రక్రియ దగ్గర నుంచి అనేక సమస్యలు రైతుల పాలిట శాపంగా మారాయి. ఇక ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట నియోజకవర్గం వత్సవాయి మండలం పోలంపల్లి గ్రామంలో పత్తి సాగు చేసిన రైతులకు మిర్చి సాగు చేసినట్టు, మిర్చి సాగు చేసిన రైతులు పత్తి వేసినట్టు నమోదు చేశారు. దీంతో కొందరు రైతులకు బీమా పరిహారం విషయంలో తీవ్ర అన్యాయం జరిగింది. పెనమలూరులో కొందరు రైతులు పసుపు సాగు చేసినట్టు అక్రమంగా ఆన్ లైన్ చేయించి రూ.79 వేల చొప్పున పరిహారం పొందారు. పంట నష్టపోయిన రైతులు పరిహారం అందక గగ్గోలు పెడుతుంటే, అసలు పంటలే సాగు చేయని వారి ఖాతాల్లో పరిహారం సొమ్ము జమ చేయడం వివాదాలకు దారితీసింది.
*రాయసీమలో వేరుశనగకు అరకొరే….
రాయలసీమ జిల్లాల్లో వేరుశనగ పంట లక్షల ఎకరాల్లో సాగవుతోంది. ఎకరాకు కనీసం రూ.30,000 పెట్టుబడి అవుతుంది. గత సీజన్లో అధిక వర్షాల వల్ల ఎకరాకు క్వింటా దిగుబడి కూడా రాలేదు. ముఖ్యంగా అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో విపరీతమైన వర్షాలకు పంట నష్టం వాటిల్లింది. అయితే వేరుశనగ రైతులకు ఎకరాకు కేవలం రూ.2,674 పంటల బీమా పరిహారం చెల్లించారు. అంటే పంట పెట్టుబడిలో కేవలం 9 శాతం మాత్రమే పరిహారం చెల్లించి చేతులు దులిపేసుకున్నారనే విమర్శలు వస్తున్నాయి. అరకొర పరిహారం అందించడంపై అనంతపురం జిల్లా రైతులు ఆందోళనలు చేపట్టారు. అయినా అధికారులు మాత్రం పట్టించుకున్న దాఖలాలు లేవు.
*కౌలు రైతుకు మొండి చేయి
రాష్ట్రంలో 16 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని అంచనా. వీరిలో కౌలు రైతు గుర్తింపు కార్డులు మాత్రం కేవలం 3 లక్షల మందికే ఇచ్చారు. వీరు కూడా అనేక పంటలు సాగు చేసి తీవ్రంగా నష్టపోయారు. అయితే పంటల బీమా పరిహారం విషయంలో మాత్రం స్పష్టత లేదు. పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకే పరిహారం సక్రమంగా అందలేదు. ఇక కౌలు రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. రాష్ట్రంలో ఎంత మంది కౌలు రైతులకు పంటల బీమా పరిహారం అందించారనే విషయం కూడా ప్రభుత్వం చెప్పలేకపోతోంది. అంటే కౌలు రైతులకు బదులు భూ యజమానుల ఖాతాల్లో పంటల బీమా జమ చేశారా అనే అనుమానం కూడా వస్తోంది. అధికారులకే దీనిపై స్పష్టత లేదు. ఇక రైతులకు ఏం సమాధానం చెబుతారని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.
*అన్ని పంటలకూ అందని సాయం
ప్రస్తుతం 31 పంటలకు బీమా అందుబాటులో ఉంది. అయితే మన రాష్ట్రంలో 26 పంటలకు మాత్రమే పరిహారం విడుదల చేశారు. కొన్ని పంటలకు వాతావరణ బీమా, మరికొన్ని పంటలకు దిగుబడి ఆధారంగా నష్టం అంచనా వేస్తారు. 26 పంటలకు బీమా పరిహారం అందించిన ప్రభుత్వం అందులో 12 పంటలకు కలపి కేవలం రూ.41 కోట్లు మాత్రమే విడుదల చేయడం విమర్శలకు తావిస్తోంది. మినుము పంటకు తీవ్రనష్టం వాటిల్లినా రాష్ట్రం మొత్తం మీద కేవలం రూ.8.67 కోట్లు విడుదల చేసి చేతులు దులిపేసుకున్నారు. ఇక మిర్చి, పత్తి, చెరకు, ఉద్యానపంటలు సాగు చేసిన రైతులకు అరకొర సాయం మాత్రమే దక్కింది. ఏటా మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ఇంత వరకు పంటల బీమా పరిదిలోకే తీసుకురాలేదు. ఆపత్కాలంలో రైతుకు అండగా నిలవాల్సిన పంటల బీమా పరిహారాన్ని పరిహాసంగా మార్చి సాగును మరింత సంక్షోభంలోకి నెట్టారని రైతు సంఘాల నేతలు విమర్శిస్తున్నారు.