10వ తరగతి పాస్ మార్కులు 35 నుండి 25 కు తగ్గించాలి: శేషుబాబు

అవనిగడ్డ: గడిచిన రెండు సంవత్సరాల నుండి కరోనా కారణంగా రెగ్యులర్ తరగతులు జరగక.. పూర్తి స్థాయి పాఠాలు వినలేక పోవడం కారణంగానే ఎక్కువ మంది విద్యార్థులు 10వ తరగతి ఫైనల్ పరీక్షలలో ఫెయిల్ అయినట్లు, దీనికి నైతిక బాధ్యత వహించి ప్రభుత్వం పాస్ మార్కులను 35 నుండి 25 కు తగ్గించి, వీలు అయినంత వరకు విద్యార్థులు పాస్ అయ్యేలా చూడాలని లేదా రీ కౌంటింగ్, రీ వాల్యుయేషన్, సప్లిమెంటరీ లకు ఫీజులు లాంటివి ప్రభుత్వమే చెల్లించాలని అవనిగడ్డ మండల జనసేన పార్టీ అధ్యక్షులు గుడివాక శేషుబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరం పేపర్ లీకేజీ ఆరోపణలు వచ్చాయని, సాధారణంగా వచ్చే ఫలితాలకు విరుద్ధంగా కృష్ణా, గుంటూరు జిల్లాల విద్యార్థులు ఉత్తీర్ణత లో వెనుక బడ్డారని, ఫలితాలు తారుమారు అయ్యాయని, దీనిని బట్టి చూస్తే సామాన్యులకు కూడా విద్యా వ్యవస్థ మీద విశ్వాసం సన్నగిల్లుతుంది అని ఎద్దేవా చేసారు.

ఎప్పుడూ లేని విధంగా కేవలం 67 శాతం పాస్ అవ్వడం చూస్తుంటే ఫలితాల సరళిని అనుమానించాల్సి వస్తుందన్నారు. అలాగే పేపర్ కాఠిన్యతా స్థాయిని పెంచడం, పరీక్షలను 11 రోజులకు కాకుండా 7 రోజులకు కుదించడం కూడా విద్యార్థుల పాలిట శాపంగా మారిందని అన్నారు.

ఇంగ్లీష్ మీడియం అని, తెలుగు మీడియం అని కోర్టుల చుట్టూ తిరుగుతూ.. విద్యార్థులను అయోమయానికి గురి చేశారని, ర్యాంకులు, గ్రేడులు అంటూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడారని దుయ్యబట్టారు.

దీనికి తోడు నాడు – నేడు, మరుగుదొడ్లు శుభ్ర పరిచే ఫోటోలు అప్లోడ్ చేయడం, వైన్ షాప్ ల వద్ద డ్యూటీ లు వేయడం లాంటి అనేక రకాల అదనపు బాధ్యతలు ఉపాధ్యాయులకు అప్పచెప్పడంతో విద్యా వ్యవస్థ కుంటు పడిందని.. వీటన్నింటికీ ప్రభుత్వం నైతిక బాధ్యత వహిస్తూ పాస్ మార్కులను 35 నుండి 25 కు తగ్గించాలి.. మరియు 13 కోట్లు వరకు అయ్యే సప్లిమెంటరీ పరీక్షలు ఫీజులు లాంటివి ప్రభుత్వమే చెల్లించాలి అని ప్రభుత్వాన్నిశేషుబాబు డిమాండ్ చేశారు.