3 నుండి శ్రీనూకాలమ్మవారి జాతర మహోత్సవాలు

విజయనగరం, ఈ నెల 3వ తేదీ నుండి 8వ తేదీ వరకు శ్రీ నూకాలమ్మవారి జాతర మహోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని శ్రీశ్రీశ్రీ నూకాలమ్మ యువజన సేవా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు గురాన అయ్యలు, యడ్ల రాజేష్‌ తెలియజేశారు. మంగళవారం నూకాలమ్మ అమ్మవారి ఆలయంలో జాతరకు సంబంధించిన కరపత్రాలను, ఆహ్వాన పత్రాలను కమిటీ సభ్యులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు, యడ్ల రాజేష్‌ మాట్లాడుతూ విజయనగరం మంగళవీధి, పాత పశువుల మార్కెట్‌ ఆవరణలో శ్రీశ్రీశ్రీ నూకాలమ్మవారి 66వ వార్షికోత్సవ మహోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 2వ తేదీ మంగళవారం సాయంత్రం నూకాలమ్మవారికి పాలాభిషేకం నిర్వహించి జాతర మహోత్సవాలను ప్రారంభిస్తామన్నారు. జాతర సందర్భంగా ప్రతీరోజు రాత్రి సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. సాంస్కరితిక కార్యక్రమాలను వీక్షించడానికి వచ్చేవారికి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించామన్నారు. అలాగే 8వ తేదీన శ్రీ అమ్మవారి చల్లదనం మహోత్సవం, అమ్మవారి ఊరేగింపు నిర్వహిస్తామన్నారు. ఘటాలతో, శక్తి, గరడి, పులివేషాలతో జరిగే ఊరేగింపులో భక్తులందరూ పాల్గొవాలని విజ్ఞప్తి చేశారు. ప్రతీ సంవత్సరంలాగే అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు వజ్రపు నవీన్‌ కుమార్‌, యడ్ల భాస్కరరావు, రొంగలి శరత్ బాబు రాజేంద్రప్రసాద్‌, వెంపడాపు వెంకటరావు, పిన్నింటి సునీల్, యడ్ల రాంబాబు, యడ్ల శ్రీనివాస్, తణుకు హేమసుందర్ తదితరులు పాల్గొన్నారు.