అప్రకటిత విద్యుత్ కోతలు ఆపండి!

  • వర్షాకాలంలో విద్యుత్ కోతలు సరికాదు
  • దోమల బెడదతో ప్రజలు అవస్థలు పడుతున్నారు
  • పిల్లలు, వృద్ధులు, జ్వర పీడితులు నిద్రలేక అగచాట్లు పడుతున్నారు
  • విద్యుత్ శాఖ ఏడీని కోరిన జనసేన పార్టీ నాయకులు

పార్వతీపురం: అప్రకటిత విద్యుత్ కోతలు ఆపాలని జనసేన పార్టీ నాయకులు కోరారు. గురువారం జనసేన జిల్లా నాయకులు వంగల దాలి నాయుడు, అన్నాబత్తుల దుర్గాప్రసాద్ లు పార్వతీపురం విద్యుత్ శాఖ ఏడి ఎం ప్రసాద్ రావుని కలిసి జిల్లాలో విధిస్తున్న విద్యుత్ కోతలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వర్షాకాలంలో విద్యుత్ కోతలు సరికాదన్నారు. వేసవిలో కూడా ఇలాగే అప్రకటిత కరెంటు కోతలతో ఇబ్బందులకు గురి చేశారన్నారు. ప్రస్తుతం రోగాలు సీజన్ కావడంతో అర్ధరాత్రి నిద్రించే వేళ కరెంటు కోత విధించడంతో ప్రజలు నిద్ర పట్టక అవస్థలు పడుతున్నారన్నారు. ముఖ్యంగా దోమలు బెడతతో ప్రజలు రోగాలు బారిన పడుతున్నారన్నారు. మలేరియా, డెంగ్యూ తదితర జ్వరాలు ప్రజలను పీడిస్తున్నాయన్నారు. రాత్రిపూట కరెంట్ కోత విధిస్తూ ఉండడంతో పిల్లలు, వృద్దులు, జ్వర పీడితులు రోగులు నిద్ర పట్టక అవస్థలు పడుతున్నారన్నారు. కరెంట్ కోతలతో రాత్రి నిద్రలేక తెల్లవారి పాఠశాలలో కార్యాలయాలకు పనులకు వెళ్లేందుకు పిల్లలు, ప్రజలు, రైతులు, మహిళలు తదితరులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. తక్షణమే దీనిపై స్పందించి ఈ ఎల్ ఆర్ పేరుతో విధిస్తున్న అప్రకటిత కరెంటు కోతలు లేకుండా చూడాలన్నారు. అలాగే ప్రస్తుతం పెంచిన కరెంట్ చార్జీలు ప్రజలకు భారంగా మారాయని వాటిని తగ్గించాలని కోరారు. ప్రజలకు నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని కోరారు. ఈ సందర్భంగా వారు వినతిపత్రాన్ని అందజేశారు.