ధర్నా చౌక్ కోసం ఎస్పీకి వినతి

తిరుపతి: ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ… ప్రభుత్వం అవలంభించే ప్రజా వ్యతిరేక విధనాలపై ప్రజాస్వామ్య బద్దంగా ఆందోళనలు చేసేందుకు తిరుపతిలో ఓ ధర్నా చౌక్ ను ఏర్పాటు చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ జిల్లా ఎస్పీ పరమేశ్వరరెడ్డికి విన్నవించారు. ఆదివారం ఆయన జనసేన, టిడిపి నేతలతో వెళ్లి ఎస్పీకి వినతిపత్రం సమర్పించారు. తిరుపతిలో ప్రతిపక్షాలు నిరసనలు, ధర్నాలు చేసేందుకు అనువైన ప్రాంతం లేదని అందుకోసం ఒక ధర్నా చౌక్ ను ఏర్పాటు చేయాలని కోరారు. దిష్టిబొమ్మలు దగ్ధం చేసినా, మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినా సెక్షన్ 307 కింద కేసులు పెడుతున్నారన్నారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయడం ప్రతిపక్షాలకు రాజ్యాంగం కల్పించిన హక్కని ఆయన అన్నారు. ప్రతిపక్షాలు చేసే శాంతియుత అందోళనలకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందుకు కలగకుండా అన్ని పార్టీలకు ధర్నా చౌక్ కోసం ఓ స్థలాన్ని ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా. పసుపులేటి హరిప్రసాద్ వెంట మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, జనసేన తిరుపతి ఇంచార్జ్ కిరణ్ రాయల్, నగర అధ్యక్షులు రాజారెడ్డి, టీడీపీ తిరుపతి పార్లమెంటరీ ఇంచార్జ్ నరసింహయాదవ్, ఆర్సీ మునిక్రిష్ణ, జనసేన జిల్లా కార్యదర్శి ఆనంద్, నగర నాయకులు రవి, రాజేష్ ఆచారి జనసైనికులు వీరమహిళలు తదితరులు పాల్గొన్నారు.