రాష్ట్రాన్ని అనారోగ్యాంధ్ర ప్రదేశ్ గా మార్చిన జగన్

  • రాష్ట్రంలో జ్వరాలు లేని ఇల్లు లేదు
  • అస్తవ్యస్తంగా డ్రైనేజీ వ్యవస్థ
  • జగనన్న ఆరోగ్య సురక్ష అంతా బూటకం
  • యుద్ధప్రాతిపదికన సమస్యల్ని పరిష్కరించకపోతే కార్పోరేషన్ ను ముట్టడిస్తాం
  • గుంటూరు నగర జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్

గుంటూరు: తన అసమర్ధ, అవినీతి పాలనతో ఇప్పటివరకు రాష్ట్రాన్ని అవినీతాంధ్ర ప్రదేశ్ గా, గంజాయాంధ్ర ప్రదేశ్ గా, దౌర్జన్యాంధ్ర ప్రదేశ్ గా మార్చిన ముఖ్యమంత్రి జగన్ ఇప్పుడు రాష్ట్రాన్ని అనారోగ్యా ఆంధ్రప్రదేశ్ గా కూడా మార్చేసాడని గుంటూరు నగరం జనసేన పార్టీ అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్ విమర్శించారు. శుక్రవారం స్థానిక 22వ డివిజన్ పరిధిలో శ్రీనివాసరావుతోట 12వ లైన్లో పర్యటించారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు ఇల్లలోకి మురుగు చేరి ప్రతీరోజూ తాము ఎంత నరకం అనుభవిస్తున్నామో అంటూ సురేష్ ఎదుట కన్నీళ్లపర్యంతమయ్యారు. మామూలు రోజుల్లోనే ఇలా ఉంటే ఒక్క ఐదు నిముషాలు వర్షం పడితే ఇక గడపదాటి బయటికి రాలేని పరిస్థితి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తమ దుస్థితిపై స్థానిక ఎమ్మెల్యేకు , కార్పొరేటర్ కు, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసారి ఓట్లు అడగటానికి వస్తే నిలదిస్తామంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నేరేళ్ళ సురేష్ మాట్లాడుతూ సైడ్ కాలువల నిర్మాణం సరిగ్గా లేకపోవడంతో చెత్తా చెదారంతో నిండిన కాలువలు పొంగి మురుగు అంతా రోడ్లపైకి, ఇల్లల్లోకి చేరటంపై అధికారుల మీద ఆయన తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చిన్న చెరువుని తలపించే విధంగా రోడ్లపై మురుగు పారుతుండటంతో పగటిపూటే దోమలు ప్రజల రక్తాన్ని తాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కోసారి పాములు కూడా ఇళ్లల్లోకి వస్తుండటంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారన్నారు. రాష్ట్రంలో టైఫాయిడ్, మలేరియా విజృంభిస్తున్నా ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో జ్వరం లేని ఇల్లు లేదని, ప్రజల ఆరోగ్యాన్ని, వారి సంరక్షణ ను గాలికిదిలేసి ఇప్పుడు జగనన్న ఆరోగ్య సురక్ష అంటూ వైసీపీ నేతలు కొత్త నాటకానికి తెరతీసారని విమర్శించారు. రాష్ట్రాన్ని ఒక అసమర్దుడి చేతిలో పెట్టామని రానున్న ఎన్నికల్లో వైసీపీని భూస్థాపితం చేయాలని ప్రజల్ని కోరారు. అప్పుడే ఆంద్రప్రదేశ్ కు మంచి భవిష్యత్ ఉంటుందని నేరేళ్ళ సురేష్ అన్నారు. జిల్లా అధికార ప్రతినిధి ఆళ్ళ హరి మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు వైసీపీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకొని కునారిల్లుతున్నాయని ఆవేదన చెందారు. రాష్ట్రంలో ప్రజల్ని పట్టించుకునే నాధుడే లేడని విమర్శించారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమంలో ప్రజలు చెప్పుకున్న సమస్యల్ని సైతం పట్టించుకోకుండా పాలకులు, అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహించటం దుర్మార్గమన్నారు. అభివృద్ధి గురించి వైసీపీ నేతల్ని ప్రశ్నిస్తే వారికి ఎక్కడలేని కోపం వస్తుందని, అభివృద్ధి అనే పదమే పెద్ద భూతులా వారికి వినిపిస్తోందని ఎద్దేవా చేశారు. శ్రీనివాసరవుతోటలో నెలకొన్న సమస్యల్ని పాలకులు, అధికారులు వెంటనే పరిష్కరించాలని లేనిపక్షంలో ప్రజల్ని కలుపుకొని కార్పోరేషన్ ను ముట్టడిస్తామని ఆళ్ళ హరి హెచ్చరించారు. డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ షర్ఫుద్దీన్ , మహమ్మద్ బాషా, కొలసాని బాలకృష్ణ, రెల్లి యువ నేత సోమి ఉదయ్ కుమార్, ఎర్రబోతు వాసు, కోలా అంజి, పులిగడ్డ గోపి, వడ్డె సుబ్బారావు, దాసరి రాము, తాడికొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.