రాష్ట్రంలోని ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో జనసేన న్యాయవాది

* ప్రభుత్వ అక్రమ కేసులకు జన సైనికులు భయపడొద్దు
* జనసేన నాయకులు, శ్రేణులకు న్యాయపరమైన అండ
* రాష్ట్రాన్ని వైసీపీ పాలకులు గంజాయి ప్రదేశ్ చేశారు
* యువతకు సులభంగా గంజాయి దొరుకుతోంది… ఉపాధి మాత్రం దొరకడం లేదు
* ఎన్నికల ముందు ముద్దులు పెట్టిన జగన్ రెడ్డి ఇప్పుడు మొహం చాటేస్తున్నారు
* పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టాలని వైసీపీ చూసింది
* కోనసీమ నుంచీ వలసలు పెరిగిపోతున్నాయి
* వ్యూహంతో, ఓర్పుతో రాజకీయాలు చేద్దాం
* పి. గన్నవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్


ప్రజా పోరాటాలతో ముందుకు వెళ్ళండి… జన సైనికుల మీద ప్రభుత్వం పెట్టే అక్రమ కేసులకు ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. కచ్చితంగా రాష్ట్రంలోని ప్రతీ పోలీస్ స్టేషన్ పరిధిలో జనసేన పార్టీ తరఫు నుంచి ఒక న్యాయవాది ఉండేలా శ్రీ పవన్ కళ్యాణ్ గారు చర్యలు తీసుకుంటున్నారని జనసేన పార్టీ పీఏసీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరం నియోజకవర్గ కార్యకర్తల సమావేశం అంబాజీపేటలో మంగళవారం సాయంత్రం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “సామాన్యులు మా బతుకు మేం బతుకుతాం అంటే కనీస సౌకర్యాలు, సహాయం అందించని ప్రభుత్వం ఇది. ఎప్పుడు ఎవరిపై కక్ష సాధించాలా.. ఎవరి పొట్ట కొట్టాలా అన్న ఆలోచన తప్ప వేరే ఏమి చేతకాని పాలన ఇది. ఇంతకాలం ప్రభుత్వానికి వెన్నుదన్నుగా నిలబడి, తమ ఉద్యోగాలు ఎప్పటికైనా పర్మినెంట్ అవుతాయని భావిస్తున్న వాలంటీర్ల కడుపు కొట్టడానికి ఈ ప్రభుత్వం గృహ సారథులను నియమిస్తోంది. ఉత్తరాంధ్రలోనే వలసలు ఎక్కువ అనుకున్నాం. అయితే కోనసీమ నుంచీ వలసలు ఏ విధంగా ఉన్నాయో తెలిస్తే విస్తుపోతాం. పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ చెరుకూరి పనసరాముడు మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు, ఆయన తమిళనాడుకు వలస వెళ్లి ఉపాధి కోసం పని చేస్తున్న తీరును వారి కుటుంబ సభ్యులు చెప్పడం కలిచివేసింది.
* బటన్ పాలన
బటన్ నొక్కడం తప్ప ఇంకేం చేయను అన్నట్లు ఉంది ఈ వైసీపీ ముఖ్యమంత్రి తీరు. 56 బీసీ కార్పొరేషన్లకు కనీస నిధులు విడుదల చేయడం లేదు. బీసీలకు కనీసం ఒక్క రుణం కూడా ఈ ప్రభుత్వంలో రాలేదు. బీసీల సంక్షేమాన్ని కనీసం పట్టించుకోని ప్రభుత్వం… కేవలం ప్రకటనలు, గర్జనలు అంటూ కాలం గడిపేస్తోంది. వైసీపీ సభలకు కళాశాలలకు, పాఠశాలలకు సెలవులు ఇచ్చి మరీ బస్సులలో జనం తరలిస్తున్నారు. మీ పాలన అద్భుతంగా ఉంటే ఇలా బలవంతంగా జనం తరలించడం ఎందుకు..? గడపగడపకు కార్యక్రమంలో భాగంగా ముందుగానే కొన్ని ఇళ్ళను ఎంపిక చేసుకొని, వాళ్లకు తగిన తర్ఫీదు ఇచ్చి వెళ్లే దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు..?
* ఆర్బీకేలు వైసీపీ కేంద్రాలు
మాండౌస్ తుపాను వస్తే రైతుల పంట నష్టం మీద కనీసం ఏ అధికారి స్పందించలేదు. అసలు పంట నష్టం ఎంత వచ్చింది..? తీసుకున్న సహాయక చర్యల గురించి చెప్పే నాథుడు లేడు. రైతు భరోసా కేంద్రాలు పూర్తిస్థాయిలో వైసీపీ కేంద్రాలుగా మారిపోయాయి. జగనన్న ఇళ్లలో అంతులేని దోపిడీ చేశారు. భూముల కొనుగోలు మాయ రాత్రికి రాత్రి జరిగింది. ప్రజాధనంలోని రూ. 23,500 కోట్లను వైసీపీ నాయకులు జేబులో వేసుకున్నారు. ఈ అవినీతి తతంగాన్ని బయటపెట్టింది జనసేన పార్టీ మాత్రమే.
* ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ కొట్టుకుపోవడం ఖాయం
వైసీపీ ప్రభుత్వ పాలన తీరు మీద అన్ని వర్గాల ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ఎన్నికలు ఇప్పటికి ఇప్పుడు వచ్చినా… ఎప్పుడు వచ్చినా ప్రజా ఆగ్రహం ఓట్ల రూపంలో వైసీపీని తుడిచి పెట్టేస్తుంది. కచ్చితంగా వైసీపీ పాలన ముగిసిపోయే రోజులు చాలా దగ్గర్లోనే ఉన్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎన్ని బెదిరింపులు చేసి గెలిచారో అందరికీ తెలుసు. జగన్ ఆలోచన విధానం ఎన్నికల ముందు ఒకలా ఇప్పుడు మరోలా ఉందని కచ్చితంగా చెప్పగలను. కనిపించిన ప్రతి ఒక్కరికి ముద్దులు పెట్టి తనకు ఓటు వేయాలని.. నేను ఉన్నాను నేను విన్నాను అన్న ముఖ్యమంత్రి ఇప్పుడు కనీసం ఎవరి కష్టాలు కనకుండా, ప్రజల బాధలు వినకుండా తయారయ్యారు. దీనిని కచ్చితంగా ప్రజలు గమనిస్తున్నారు.
* గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది
వైసీపీ పాలనలో యువతను పూర్తిగా నిర్వీర్యం చేసే కుట్ర జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ ను గంజాయి ప్రదేశ్ గా చేసేశారు. సాయంత్రం ఆరు దాటితే కనీసం మహిళలు రోడ్లపైకి రాలేని పరిస్థితి ఏర్పడింది. గంజాయి మత్తులో యువత ఏం చేస్తారోనన్న భయం మహిళల్లో కనిపిస్తోంది. విచ్చలవిడిగా ప్రతి గ్రామంలోనూ, ప్రతి వీధిలోను గంజాయి యథేచ్ఛగా దొరుకుతోంది. వైసీపీ ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే గంజాయి విచ్చలవిడిగా అమ్మకాలు జరుగుతున్నాయి. మారుమూల ప్రాంతాలకు గంజాయి ఎలా వస్తోంది..? యువతకు సులభంగా ఎలా దొరుకుతుంది..? అన్నది ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రజలు ఆలోచించాలి. గంజాయి రవాణాను నిరోధించలేక పోవడానికి అసలు కారణం ఏమిటో ప్రజలు గమనించాలి.
* పచ్చని కోనసీమలో చిచ్చు పెట్టాలని చూశారు
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ లాంటి మహనీయుడి పేరు జిల్లాకు పెడతాం అంటే ఎవరు వద్దంటారు..? కచ్చితంగా అలాంటి నిర్ణయాలను జనసేన పార్టీ స్వాగతిస్తుంది. వైసీపీ ప్రభుత్వం మాత్రం దీని వెనుక కూడా ఒక కుట్ర చేసి ఈ ప్రాంతంలో చిచ్చు పెట్టాలని చూసింది. మహనీయుడి పేరుని సైతం తన కుటిల రాజకీయాలకు వాడుకోవాలని భావించింది. కోనసీమలో అల్లర్లు జరిగిన వెంటనే బాధ్యత గల పార్టీ అధ్యక్షునిగా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు స్పందించారు. తన స్వలాభం కోసం ఎలాంటి చిచ్చులు పెట్టడానికి అయినా, గొడవలు రేపడానికైనా వైసీపీ సిద్ధంగా ఉంటుంది. పేదలకు భూముల పట్టాలు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వ పట్టాలను చూస్తే విస్తు పోవాల్సిందే. మన భూమి పట్టా మీద సీఎం ఫోటో ఎందుకు..? ఆ పట్టాలో పూర్తిస్థాయి వివరాలు ఉండడం లేదు. కొబ్బరి రైతులను పట్టించుకోవడం లేదు. వారికి కొబ్బరి సాగు లాభసాటిగా జనసేన మారుస్తుంది.
* నాయకులెవరో పవన్ కళ్యాణ్ నిర్ణయిస్తారు
నియోజకవర్గ నాయకత్వం మీద శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలోనే నిర్ణయం తీసుకుంటారు. నియోజకవర్గ ఇంచార్జి ఎవరో శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెబుతారు. నేనే నాయకుడిని.. నేనే ఇంచార్జి అనే మాటలు వద్దు. రెండు ఫ్లెక్సీలు కట్టుకుంటే, మూడు సోషల్ మీడియా పోస్టులు పెడితే నాయకులు అయిపోరు. కొందరు ఈ సీట్ నాది అంటూ కర్చీఫ్ వేస్తే పార్టీ సహించదు. పార్టీలో చేరేందుకు ఎవరు వస్తున్నా ముందు జన సైనికులతో కలిసి ప్రజల సమస్యల మీద పోరాడండి.. నిలబడండి అని శ్రీ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు. ఆయన నిర్ణయానికి ప్రతి ఒక్కరు కట్టుబడాల్సిందే.. గౌరవించాల్సిందే. జనసేన పార్టీ అనే వేదిక ఒకటే ఉంటుంది. ఆ వేదిక నుంచే ప్రతి ఒక్కరూ ఎలాంటి అరమరికాలు లేకుండా సమష్టిగా రాజకీయాలు చేద్దాం. ఉమ్మడిగా ముందుకు వెళ్తే పి. గన్నవరం నియోజకవర్గంలో జనసేన పార్టీ బలం ఎంతో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలిసింది. 8 సర్పంచులు, 16 ఎంపీటీసీలు, 223 వార్డు మెంబర్లను గెలుచుకోవడం అంటే చిన్న విషయం కాదు. పూర్తిస్థాయి రాజకీయ ప్రయాణానికి యువత సిద్ధంగా ఉండాలి. ఒక ఆలోచన విధానం, పాలనదక్షత లేని ప్రభుత్వం తీరు మీద పోరాడుదాం. ఇక్కడి రాజకీయ సామాజిక అంశాల పట్ల శ్రీ పవన్ కళ్యాణ్ గారికి స్పష్టమైన విజన్ ఉంది. మీరు చేసే ప్రతి కార్యక్రమం శ్రీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వెళుతుంది. ఈ ప్రాంతానికి కచ్చితంగా కోకోనట్ బోర్డును తీసుకురావాలి అని గొప్ప ఆలోచన శ్రీ పవన్ కళ్యాణ్ గారిది. వచ్చే పరిశ్రమలు మన వనరుల్ని కొల్లగొట్టకుండా మనకి భవిష్యత్తు ఇచ్చేలా ఉండాలనే నినాదం జనసేన పార్టీది. ఒక వ్యూహం ప్రకారం, ఓపికతో రాజకీయాలు చేద్దాం. ప్రజా సమస్యల పరిష్కారమే మన అజెండా” అన్నారు. ఈ సమావేశంలో పార్టీ పీఏసీ సభ్యులు పంతం నానాజీ, పితాని బాలకృష్ణ, జనసేన అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, పి. గన్నవరం నియోజకవర్గ పార్టీ నాయకులు, వీర మహిళలు పాల్గొన్నారు.
* పార్టీ క్రియాశీలక సభ్యత్వ వాలంటీర్లకు సత్కారం
పి. గన్నవరం నియోజకవర్గ జనసేన క్రియాశీలక సభ్యత్వాలను భారీ స్థాయిలో చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిపిన మొత్తం 46 మంది పార్టీ క్రియాశీలక వాలంటీర్లకు మనోహర్ సత్కారం చేశారు. వారిని అభినందించారు. వివిధ పార్టీల నుంచి, సామాజిక వర్గాల సంఘాల నుంచి పి. గన్నవరం నియోజకవర్గంలో సుమారు 200 మంది మనోహర్ గారి సమక్షంలో జనసేన పార్టీలో చేరారు.
* క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు రూ.5 లక్షల చెక్కులు పంపిణీ
ఇటీవల రెండు వేర్వేరు ప్రమాదాల్లో మృతి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుల కుటుంబాలను శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మంగళవారం పరామర్శించారు. పి.గన్నవరం నియోజకవర్గం అయినవిల్లి గ్రామానికి చెందిన పార్టీ క్రియాశీలక సభ్యుడు శ్రీ గుద్దటి ముక్తేశ్వరరావు ఇటీవల విద్యుతాఘాత ప్రమాదంలో మృతి చెందారు. అతడి తల్లిదండ్రులు నారాయణ, నాగలక్ష్మిలను మనోహర్ పరామర్శించి దైర్యం చెప్పారు. వారికి పార్టీ తరఫున రూ. 5 లక్షల చెక్కు అందించారు. అలాగే కొర్లవారిపాలెం గ్రామానికి చెందిన శ్రీ చెరుకూరి పనస రాముడు ప్రమాదంలో మృతి చెందగా వారి కుటుంబాన్ని మనోహర్ పరామర్శించి, తగిన ధైర్యం చెప్పారు. పార్టీ నుంచి రూ.5 లక్షల బీమా చెక్కును అందజేశారు. పార్టీ అండగా నిలబడుతుందని హామీ ఇచ్చారు.