క్రాప్ హాలీడే కాదు.. వైసీపీకీ హాలిడే ఇవ్వండి

* ప్రజా వ్యతిరేకతతో వైసీపీ నాయకులు గడప గడపకు వెళ్లలేకపోతున్నారు
* వాలంటీర్లు సెలక్ట్ చేసిన గడపలకు మాత్రమే వెళుతున్నారు
* ప్రభుత్వ విధానాలతో ఆక్వా రైతుల అవస్థలు
* 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే… 1100 అంటూ దొంగ లెక్కలు
* ఉంగుటూరు మీడియా సమావేశంలో జనసేన పీఏసీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్


రైతాంగం క్రాప్ హాలీడే ప్రకటించడం కాదు… వైసీపీ పాలనకు మనందరం కలిసి హాలీ డే ప్రకటించేలా కలిసి పని చేయాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు పిలుపునిచ్చారు. పరిపాలన చేతకాని ముఖ్యమంత్రి వ్యక్తిగత విమర్శలతో సమయం వృథా చేస్తున్నారని, శ్రీ జగన్ రెడ్డి పాలనతో రాష్ట్రం అంధకారంలోకి వెళ్లిపోయిందని అన్నారు. గడప గడప కార్యక్రమం అంటే రాష్ట్రంలోని అన్ని గడపలకు నాయకులు వెళ్లాలని… అయితే వాలంటీర్లు సెలక్ట్ చేసిన కొన్ని గడపలకు మాత్రమే వైసీపీ ప్రజా ప్రతినిధులు వెళుతున్నారని ఎద్దేవా చేశారు. బుధవారం ఉంగుటూరులో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు మాట్లాడుతూ “కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా చేయని విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు పార్టీ క్రియాశీలక సభ్యుల కోసం ప్రమాద బీమాను తీసుకొచ్చారు. అధికారంలో ఉన్న పార్టీలు తమ కార్యకర్తలు ప్రమాదవశాత్తు చనిపోతే కేవలం రూ.2 లక్షలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నాయి. మన పార్టీ అధికారంలో లేకపోయినా… జనసైనికులను సొంత కుటుంబ సభ్యులుగా భావించే శ్రీ పవన్ కళ్యాణ్ గారు… వారి కోసం ప్రమాద బీమా తీసుకొచ్చారు. ప్రమాదవశాత్తు ఏ క్రియాశీలక కార్యకర్త మరణించినా తక్షణమే బాధిత కుటుంబానికి రూ. 5 లక్షలు పరిహారం… యాక్సిడెంట్లు అయి గాయాల పాలయితే రూ. 50 వేలు వచ్చేలా బీమా సౌకర్యం కల్పించారు. 40 ఏళ్లు, 30 ఏళ్లు మనల్ని పాలించిన ఏ పార్టీలు కూడా చేయని విధంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తల కోసం నిలబడ్డారు.
* ఆక్వా రంగానికి ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రస్థానంలో నిలిపిన ఆక్వా రైతులకు ఇప్పుడు ఎన్నడూ లేని కష్టం వచ్చింది. ఉత్పత్తి కొనేవారు లేక పడరాని పాట్లు పడుతున్నారు. గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలని రెండు, మూడు నెలలుగా ఆందోళనలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వారికి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయింది. ఆక్వా రంగాన్ని కాపాడే విధంగా ప్రభుత్వం ప్రోత్సాహకాలు, సబ్సిడీలు ప్రకటించాలి. ఈ ప్రాంతంలో లాజిస్టికల్ హబ్ ఏర్పాటు చేయాలి. గతంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పర్యటించినప్పుడు ఆక్వా రంగం గురించి లోతుగా అధ్యయనం చేశారు. చాలా మంది ఆక్వా రైతులతో మాట్లాడారు. ప్రభుత్వం ఆక్వా రంగాన్ని పట్టించుకోని పక్షంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారే ఈ ప్రాంతంలో పర్యటించి ఆక్వా రైతులకు అండగా నిలబడతారు. అలాగే మన పార్టీ భవిష్యత్తులో అధికారంలోకి వస్తే ఆక్వా రంగాన్ని మరో మెట్టు ఎక్కించే విధంగా పాలసీలను రూపకల్పన చేస్తాం. మత్స్యకార శాఖ మంత్రి శ్రీ సీదిరి అప్పల రాజు ఏ గ్రామానికి వెళ్లినా నిలదీయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ఆయన ఏ మాత్రం భరోసా ఇవ్వకపోగా … నిర్లక్ష్యంగా ప్రకటనలు చేయడం బాధాకరం.
* ప్రభుత్వానివి దొంగ లెక్కలు
రాష్ట్రవ్యాప్తంగా మూడు వేల మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే చలించిపోయి అప్పటికప్పుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బుల నుంచి రూ. 5 కోట్లు విరాళంగా ఇచ్చారు. అంత గొప్ప మనసున్న నాయకుడు ఆయన. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందులలో ఈ మూడున్నరేళ్లలో 46 మంది కౌలు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి పాలన దక్షతపై నిజంగా వాళ్లకు నమ్మకం ఉంటే ఆత్మహత్యలకు పాల్పడరు. ప్రభుత్వ విధానాలతో రాయలసీమతో పాటు పచ్చని గోదావరి జిల్లాల్లో వందలాది మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. గతంలో చింతలపూడిలో సభ పెట్టి 46 కౌలు రైతు కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించాం. జగన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక దాదాపు 3 వేల మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే… 1100 మందే చనిపోయారని ప్రభుత్వం దొంగ లెక్కలు చెబుతోంది. రైతు స్వరాజ్య వేదిక అనే సంస్థతోపాటు మా నాయకులు క్షేత్రస్థాయిలో పర్యటించి ఆధారాలతో సహా చనిపోయిన కౌలు రైతుల వివరాలు సేకరించారు. ఎఫ్ఐఆర్ లతో సహా మా పార్టీ దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయి. రాష్ట్రంలో ఆత్మహత్యలకు పాల్పడిన ప్రతి కౌలు రైతు కుటుంబాన్ని ఆదుకుంటాం. వ్యవసాయ రంగానికి పూర్వ వైభవం తీసుకొస్తాం.
* కులం పేరుతో రైతుల మధ్య చిచ్చు పెట్టారు
భారతదేశంలో ఇప్పటి వరకు ఏ రాజకీయ పార్టీ కూడా అన్నం పెట్టిన అన్నదాతలకు కులాన్ని అంటగట్టలేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక కులం పేరిట రైతుల మధ్య చిచ్చుపెట్టింది. మాండౌస్ తుపాన్ వల్ల రైతులు తీవ్రంగా నష్టపోయి ఆందోళనలో ఉంటే… ముఖ్యమంత్రి తాడేపల్లి ప్యాలస్ లో అధికారులతో సమీక్ష సమావేశాలు అంటూ సమయం వృథా చేస్తున్నారు. ప్రతి గింజా కొంటామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. బస్తాల కొరత రైతులను వేధిస్తోంది. బస్తాకు రైతు దగ్గర రూ. 50 వసూలు చేస్తున్నారు. రాజోలు నియోజకవర్గంలో అయితే రూ. 100 వసూలు చేస్తున్నారు. ఈ డబ్బులు ఎవరి జేబుల్లోకి పోతున్నాయి. రోజుల తరబడి ఆర్బీకే కేంద్రాల్లో పంటను అమ్ముకోవడానికి రైతులు నానా అవస్థలు పడుతున్నారు. గోదావరి జిల్లాల్లో రైతులు క్రాప్ హాలీడే ప్రకటించడం కాదు… మనందరం కలిసి కట్టుగా పనిచేసి వైసీపీ పాలనకు హాలీడే ప్రకటించాలి.
* పకడ్బందీ వ్యూహం, ప్రణాళికతో ముందుకు వెళ్దాం
జనసేన పార్టీ కార్యక్రమాలకు వెళితే సంక్షేమ పథకాలు నిలిపివేస్తాం. రేషన్ కార్డులు తీసేస్తామని వైసీపీ నాయకులు బెదిరిస్తున్నారు. వాళ్లకు మేము ఒకటే చెబుతున్నాం. సంక్షేమ పథకాలు ఇస్తుంది మీ జేబులో డబ్బులతో కాదని గుర్తుపెట్టుకోవాలి. వచ్చే ఎన్నికల్లో పక్కా వ్యూహం, ప్రణాళికతో ముందుకు వెళ్లాలి. జనసైనికులు, వీర మహిళలు ఎన్నికల వరకు పార్టీ కోసం మరికొంత సమయం కష్టపడి పనిచేయండి. మన బలం చూపించే సమయం ఆసన్నమైంది. అక్రమ కేసులు బనాయించినా అధైర్య పడొద్దు. కేంద్ర కార్యాలయానికి సమాచారం ఇస్తే గంటలో మీకు అండగా నిలబడేలా పార్టీ తరఫున కృషి చేస్తాం. మీకు అండగా ఉండేలా న్యాయవాదిని ఏర్పాటు చేస్తాం. మరో ఏడాదో, ఆరేడు నెలలే పోలీసులు ప్రభుత్వం కోసం పనిచేస్తారు. తరువాత వైసీపీ నాయకులను వాళ్లే లాఠీలతో కొట్టే పరిస్థితి వస్తుంది. ఇప్పటికే చాలా మంది పోలీసులు వైసీపీ నాయకులు యూనిఫాం పరువు తీసేస్తున్నారనే భావనలో ఉన్నారని” అన్నారు. జనసేన పార్టీ నేతలు కొటికలపూడి గోవిందరావు, కనకరాజు సూరి, చేగొండి సూర్య ప్రకాష్, బొమ్మిడి నాయకర్, పి.ధర్మరాజు, మేకల ఈశ్వరయ్య, విడివాడ రామచంద్రరావు, శ్రీమతి ఘంటసాల వెంకట లక్ష్మి, శ్రీమతి ప్రియా సౌజన్య, శ్రీమతి విశాలి, చన్నమళ్ళ చంద్ర శేఖర్, కరాటం సాయి, మల్నీడి బాబి, చిర్రి బాలరాజు తదితరులు పాల్గొన్నారు.
* క్రియాశీలక సభ్యుడి కుటుంబానికి రూ.5 లక్షల బీమా
ఇటీవల రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఉండి నియోజక వర్గానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక కార్యకర్త పూలపాకల శ్రీమన్నారాయణ కుటుంబానికి పార్టీ తరఫు నుంచి రూ.ఐదు లక్షల చెక్కును మనోహర్ గారు వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. కుటుంబం వివరాలను తెలుసుకొని వారిని ఓదార్చారు.