పరిశ్రమల నెత్తిపై కత్తి!

* విద్యుత్‌ ఛార్జీల మోత
* పారిశ్రామికవేత్తల గగ్గోలు
* సంక్షోభంలో ఫ్యాక్టరీలు
* పవర్‌ హాలీడే నీలినీడలు
* మూతపడుతున్న సంస్థలు
* అల్లాడుతున్న ఉద్యోగులు
*వైకాపా అస్తవ్యస్త విధానాల ఫలితం

అదనీ ఇదనీ కాదు… ఏపీలో పరిశ్రమలన్నీ అనేక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నాయి.
ఉండనా… ఊడనా… అన్నట్టు కునారిల్లుతున్నాయి.
ఇప్పటికే 20 శాతం పరిశ్రమలు మూతపడ్డాయని అంచనా.
మిగతావి కూడా తరచు లేఆఫ్‌ లతో కాలక్షేపం చేస్తున్నాయి.
ఈ ఫలితం ఉద్యోగుల మీద కూడా పడుతోంది.
పరిశ్రమల ఆధారంగా నడిచే ఇతర సంస్థలు కూడా ఉసూరుమంటున్నాయి.
లక్షలాది మందికి ఉపాధి కల్పిస్తూ, కోట్లాది రూపాయల టర్నోవర్‌తో ప్రభుత్వానికి కూడా వివిధ పన్నుల ద్వారా ఆదాయం కల్పించే పరిశ్రమలకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం సంగతి అటుంచి రోజుకో నిర్ణయం, వారానికో సమస్య ఎదురవుతుండడంతో ఉలిక్కిపడుతున్నాయి.
పోనీ తమ గోడు ముఖ్యమంత్రి దగ్గర వెళ్లబోసుకుందామా అంటే… కనీసం ఆయన అపాయింట్‌మెంటయినా దొరకక పారిశ్రామిక వేత్తలు తలలు పట్టుకుంటున్నారు.
నిన్నటికి నిన్న ‘పవర్‌ హాలీడే’ అన్నారు. పరిశ్రమలు తమ అవసరంలో నాలుగోవంతు తగ్గించుకోవాలన్నారు. ఆ వెంటనే ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నా…. అస్తవ్యస్త నిర్ణయాలతో, పొంతన లేని ప్రకటనలతో పరిశ్రమలన్నీ దిగాలుపడుతున్నాయి.
అన్నింటినీ మించి ఏపీ పరిశ్రమలపై పిడుగు పడింది. అదే విద్యుత్ ఛార్జీల పెంపు. ఏ పరిశ్రమ నడవాలన్నా విద్యుత్‌ వినియోగం తప్పనిసరి. అలాంటిది పవర్‌ హాలీడే అయినా, విద్యుత్‌ ఛార్జీలు పెంపు అయినా అది ఉత్పత్తిపై పెను ప్రభావం చూపిస్తుంది.
ఆ ఫలితంగానే పరిశ్రమలు మూసివేత దిశగా అడుగులు వేయక తప్పడం లేదు.
* మూలిగే నక్కపై…
వైకాపా అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి విద్యుత్‌ ఛార్జీలపై సర్దుబాటు అనో, ట్రూఅప్‌ అనో, వేర్వేరు రూపాల్లో కరెంటు బిల్లులు వసూలు చేయడం ఫ్యాక్టరీలకు తలకు మించిన భారంగా మారింది. ఇందువల్ల ఓ మోస్తరు పరిశ్రమపై కూడా ప్రతి నెలా రూ.4 లక్షలకు పైగానే భారం పడుతోంది. ఉదాహరణకు గత ప్రభుత్వం హయాంలో కరెంటు ఛార్జీ యూనిట్‌కి రూ.4.95 ఉండేది. అదే వైకాపా ఆధ్వర్యంలో ఇప్పుడు యూనిట్‌కి రూ. 8.50 కిపైగానే పెరిగింది. ఇందువల్ల ఉత్పత్తి వ్యయం విపరీతంగా పెరిగిపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో వారి సమస్యలను అర్థం చేసుకుని, వేర్వేరు పద్ధతుల ద్వారా రాయితీలు, అదనపు సౌకర్యాలు కల్పించి ఈ పరిశ్రమలకు ఊతంగా నిలవకపోగా, వైకాపా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు మిన్నకుండిపోయింది. గతంలో వాణిజ్య పారిశ్రామిక సంస్థలకు యూనిట్‌కు కేవలం 6 పైసలుగా ఉండే విద్యుత్‌ సుంకాన్ని 2022 మే నుంచి ఏకంగా రూపాయికి పెంచేశారు. అదే ఏడాది ఆగస్టు నుంచి ట్రూఅప్‌ పేరుతో యూనిట్‌కి 22 పైసలు కట్టాలన్నారు. ఇదికాక 2021-22 లో వినియోగించుకున్న విద్యుత్‌ కి ఇంధన సర్దుబాటు ఛార్జీలంటూ 2023 ఏప్రిల్‌ నుంచి యూనిట్‌కు 63పైసలు అదనపు భారం వేశారు. యూనిట్‌కు మరో రూ.1.10 వంతున వసూలు చేసుకోడానికి అనుమతి ఇవ్వాలంటూ డిస్కంలు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలికి ప్రతిపాదించాయి. అందులో భాగంగా యూనిట్‌కు 40 పైసలు వంతున గత ఏప్రిల్‌ నుంచి వసూలు ప్రారంభించాయి. ఇప్పుడు మిగిలిన 70 పైసలను ఏడాది చివర్లో ట్రూఅప్‌ కింద వసూలు చేయడానికి సమాయత్తమవుతున్నాయి. ఇలా జగన్‌ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నాలుగేళ్లలో పరిశ్రమలపై యూనిట్‌కు రూ. 2.89 భారం పడింది. ఇలా ఏదో పేరుతో పెరిగిపోతున్న విద్యుత్‌ ఛార్జీల భారం వల్ల పరిశ్రమల ఉత్పత్తిపై ఎలా లేదన్నా 26 శాతం పడుతోంది. సాధారణంగా పరిశ్రమల తీరును బట్టి వాటి ఉత్పత్తి వ్యయంలో కరెంటు వ్యయం సగటున కనీసం 20 శాతం ఉంటుంది. అదే ఫర్నేస్‌, మోల్టింగు, స్పిన్నింగు మిల్లుల తరహా పరిశ్రమలైతే విద్యుత్‌ వ్యయం 40 శాతం, ఫెర్రో ఎల్లాయిస్‌ ఫ్యాక్టరీల్లో 60 శాతం వరకు ఉంటుంది. దాంతో విద్యుత్‌ను అధికంగా వాడుకోక తప్పని ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలు ఇప్పటికే చాలా వరకు మూత పడ్డాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమలకు 2016లో రూ.1.50లు, 2017లో రూ.0.75లు వంతున విద్యుత్‌ బిల్లుల్లో రాయితీలు కల్పించారు. ఇప్పుడు రాయితీల మాట అటుంచి మరింతగా విద్యుత్‌ ఛార్జీలు పెంచే పరిస్థితి కనిపిస్తోంది. ఇక కేవలం 5 నుంచి 10 శాతం లాభాలతో నడిచే చిన్నతరహా పరిశ్రమలు కూడా రాష్ట్రంలో అనేకం ఉన్నాయి. విద్యుత్‌ బిల్లుల భారం వల్ల ఇవి నష్టాల్లో పడితే మూసివేత తప్ప మరో దారి లేని పరిస్థితి నెలకొంటుంది. ఉదాహరణకి కోళ్ల ఫారాల నిర్వాహకులు గతంలో యూనిట్‌కు రూ. 3.85 చెల్లించేవారు. ఇప్పుడు ఇవే యూనిట్‌కు రూ. 6.70 చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఓ మోస్తరు పౌల్ట్రీలపై కూడా నెలకు రూ. 40 వేల వరకు భారం పడుతోంది. మొత్తానికి విద్యుత్‌ బిల్లలు భారం వల్ల చిన్న, మధ్య తరహా పరిశ్రమలు మూతపడితే ఆ ప్రభావం లక్షలాది మంది ఉద్యోగుల మీద, పరిశ్రమల ఆధారంగా నడిచే వేలాది వ్యాపార సంస్థల మీద కూడా పడుతుంది.
* సమస్యల సుడిలో…
వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ నాలుగేళ్ల కాలాన్ని చూస్తే ఏ పరిశ్రమను తీసుకున్నా ఇంచుమించు ఇదే దుస్థితి కనిపిస్తోంది. అందుకనే వైకాపా హయాంలో రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమల కన్నా తరలిపోయిన పరిశ్రమలే అధికంగా కనిపిస్తున్నాయి. ఏపీలో భారీ పరిశ్రమలు స్థాపించడానికి ఉత్సాహంగా ముందుకు వచ్చి కూడా, జగన్‌ ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లేక విసిగిపోయి వెనక్కి వెళ్లిపోయిన దేశ, విదేశీ కంపెనీలు, సంస్థలు అనేకం ఉన్నాయి. ఇందువల్ల దాదాపు 1.70 లక్షల కోట్ల రూపాయల విలువైన పెట్టుబడులను రాష్ట్రం కోల్పోయిందని ఓ అంచనా. ఇవన్నీ ఏపీకి వచ్చి ఉంటే ఎలా లేదన్నా లక్షలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించి ఉండేవి.
* అడుగడుగునా అవస్థలే..
రాష్ట్రంలో విద్యుత్‌ వినియోగానికి సంబంధించి అనేక అవకతవక విధానాలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో థర్మల్‌, జల, గ్యాస్‌, పవన, సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రాల ద్వారా సుమారు 190 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అందుతోంది. రాష్ట్ర విద్యుత్‌ డిమాండ్‌ను ఎదుర్కోడానికి 40 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ను డిస్కంలు బహిరంగ మార్కెట్‌ ద్వారా కొంటున్నాయి. మార్కెట్లో దొరకని పరిస్థితుల్లో రోజుకు సుమారు 4 లేదా 5 మిలియన్‌ యూనిట్ల కొరత ఏర్పడుతోంది. అందుకు ఫలితంగానే గృహ, వ్యవసాయ విద్యుత్‌ వినియోగదారులకు ఎదురవుతున్న కోతలు. ఈ నేపథ్యంలో రైతులు విద్యుత్‌ సబ్‌స్టేషన్లను ముట్టడించడంతో ప్రత్యామ్నాయంగా పరిశ్రమలకు సరఫరా చేసే విద్యుత్‌ను తగ్గించాలని నిర్ణయించారు. దాని ఫలితంగానే పరిశ్రమలకు పవర్‌ హాలీడే ప్రకటించారు. పరిశ్రమలు తమ డిమాండ్‌లో కేవలం మూడొంతులు మాత్రమే వాడుకోవాలని ప్రకటించారు. దాంతో పరిశ్రమలన్నీ ఉలికిపాటుకు గురయ్యాయి. కానీ ఒక్క రోజులోనే ఆ నిర్ణయాన్నిప్రభుత్వం వెనక్కి తీసుకుంది. అయితే కొన్ని వారాలు విద్యుత్‌ డిమాండు, సరఫరాలను గమనించాక తుది నిర్ణయం తీసుకుంటామని విద్యుత్‌ అధికారులు చెబుతుండడంతో ఇది పరిశ్రమల మెడపై వేలాడుతున్న కత్తిలాంటిదేనని పారిశ్రామికవేత్తలు గగ్గోలు పెడుతున్నారు.