డిమాండ్ ఉన్న ప్రతి చోటా కొత్త జిల్లా ఏర్పాటు చేయాలి

• ప్రజాభీష్టం మేరకు జిల్లాల ఏర్పాటునీ నిరంతర ప్రక్రియగా స్వీకరించాలి
• పులివెందుల కేంద్రంగా భీమ్ రావ్ జిల్లా పెట్టాలి
• మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయాలి
• అమలాపురం అల్లర్లు వైసీపీ సృష్టే
• సోషల్ మీడియా పోస్టులతో అధికార పార్టీ గుట్టురట్టు
• ప్రజల దృష్టిని మళ్లించేందుకే జనసేనపై ఆరోపణలు
• జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ

ఎస్సీల పట్ల, మహనీయుల పట్ల ఈ ప్రభుత్వానికి నిజంగా ప్రేమ ఉంటే పులివెందుల కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేసి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పేరు మీద భీమ్ రావ్ జిల్లా పేరు పెట్టాలని జనసేన పార్టీ అధికార ప్రతినిధి శ్రీమతి రాయపాటి అరుణ డిమాండ్ చేశారు. మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ ప్రకటనతో ఈ ప్రభుత్వం ప్రజలకు పనికొచ్చే పనులు కాకుండా కేవలం ప్రచార ఆర్భాటాలకు ఉపయోగపడే పనులు మాత్రమే చేస్తారని రాష్ట్రం మొత్తానికి అర్ధం అయ్యిందన్నారు. పచ్చటి కోనసీమలో అన్నదమ్ముల్లా కలసి ఉంటున్న కులాల మధ్య చిచ్చుపెట్టిన పాపం వైసీపీ ప్రభుత్వానిదేనన్నారు. గురువారం ఈ మేరకు విడుదల చేసిన ఓ వీడియో సందేశంలో శ్రీమతి అరుణ మాట్లాడుతూ.. “రాష్ట్ర ప్రజలకు కొత్త భాష నేర్పడానికి కొత్తగా విద్యాశాఖ మంత్రిగా ఛార్జ్ తీసుకున్న శ్రీ బొత్స సత్యనారాయణ జిల్లాల పేర్లు మార్చడం నిరంతర ప్రక్రియ అని చెప్పారు. మంత్రి గారి ప్రకటన వెనుక ఉన్న ఉద్దేశాలు రాష్ట్ర ప్రజలందరికీ అర్ధం అయ్యాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గొప్ప నాయకుడు కాబట్టి కడప జిల్లాకు ఆయన పేరు పెట్టామని ఈ ప్రభుత్వంలో ఉన్న వారు చెబుతున్నారు. డాక్టర్ అయిన శ్రీ వైఎస్ఆర్ కి ముఖ్యమంత్రి పీఠం ఎక్కే అవకాశం కల్పించిన రాజ్యాంగాన్ని నిర్మించిన మహనీయులు డాక్టర్ బీఆర్ అంబేద్కర్. ఆయన పేరుని కోనసీమకు పెట్టడం సంతోషం. యావత్ భారతావనికి దిశానిర్ధేశం చేసి, కశ్మీర్ భారత భూభాగంలో ఉండేలా చేసిన బాబాసాహెబ్ పేరును ఒక్క జిల్లాకు పరిమితం చేయడం సరికాదు అన్నది మా ఉద్దేశం. ఆయన పేరుని కోనసీమకు పెడుతున్నారు కదా, పేరులో ఉన్న భీంరావును మరో జిల్లాకు పెట్టి మీకు ఎస్సీల మీద, వారి హక్కుల పోరాటం కోసం కృషి చేసిన మహనీయుల పట్ల మీకున్న చిత్తశుద్దిని నిరూపించుకోవాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. కడప జిల్లానే బీమ్ రావ్ జిల్లాగా మార్చాలని ఎస్సీ సంఘాలు కోరుకుంటున్నాయి. అది వీలుకాకపోతే కనీసం పులివెందుల కేంద్రంగా ఇంకో జిల్లాను ప్రకటించి దాన్ని భీమ్ రావు జిల్లా చేయండి. ప్రకాశం జిల్లా మార్కాపురం కేంద్రంగా ప్రత్యేక జిల్లా కావాలని ఎప్పటి నుంచో ఆ ప్రాంత ప్రజలు పోరాడుతున్నారు. దాన్ని ప్రత్యేక జిల్లాగా ప్రకటించండి. పేర్లు మార్చే ప్రక్రియను నిరంతర ప్రక్రియగా తీసుకున్నట్టే జిల్లాల ఏర్పాటు ప్రక్రియను కూడా నిరంతర ప్రక్రియగా స్వీకరించి రాష్ట్ర ప్రజల పట్ల మీకున్న అభిమానాన్ని చాటుకోండి. వైసీపీ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతను మళ్లించేందుకే వారి ఇళ్ల మీద వారు దాడులు చేయించుకున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని ప్రకాశం జిల్లాకు చెందిన మా పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. అలాంటిది ఈ స్థాయిలో ఉద్యమం జరుగుతున్నప్పుడు పోలీసులు ఎందుకు అలెర్ట్ గా లేరు. ఈ వైఫల్యం ప్రభుత్వానిదే. దాడులకు పురిగొల్పింది, వ్యూహ రచన చేసిందీ వైసీపీ ప్రభుత్వమేనన్న అనుమానం రాష్ట్ర ప్రజలందరికీ ఉంది. సామాజిక మాధ్యమాల్లో బాధ్యుల ఫోటోలు చూసిన తర్వాత అది నిజమేనని తేలిపోయింది. వైసీపీ బండారం బయట పడడంతో దాన్ని జనసేన మీద రుద్దేందుకు మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ప్రెస్ మీట్లు పెట్టి తాడేపల్లి ప్యాలెస్ నుంచి వచ్చిన స్క్రిప్ట్ ని పదే పదే చదివి వినిపిస్తూ ప్రజలకు బోర్ కొట్టిస్తున్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్మే స్థితిలో లేరు” అన్నారు.