పెన్షన్లను తొలగించడం సరికాదు: రాటాల రామయ్య

రాజంపేట: నిరుపేదల పెన్షన్ లను రాష్ట్ర ప్రభుత్వం నిరంకుశంగా తొలగించడం సరికాదని రాజంపేట జనసేన నాయకులు పేర్కొన్నారు. రాజంపేట జనసేన పార్టీ ఇంచార్జ్ మలిశెట్టి వెంకటరమణ ఆదేశాల మేరకు మంగళవారం రాజంపేట పట్టణంలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జనసేన రాష్ట్ర చేనేత వికాస కార్యదర్శి రాటాల రామయ్య మాట్లాడుతూ.. రాష్ట్ర వైసిపి ప్రభుత్వం కుంటి సాకులు చెబుతూ అనేకమంది పెన్షన్లను తొలగిస్తోందన్నారు. వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వృద్ధులకు ఇటువంటి నోటీసులు ఇవ్వకుండానే పెన్షన్ తొలగిస్తున్నారన్నారు. ఓపక్క 250 రూపాయలు పెంచి పెన్షన్ ఇస్తున్నామంటున్న ప్రభుత్వం మరోపక్క వాటిని తొలగించడం ఎంతవరకు సమంజసం అనిఆయన ప్రశ్నించారు. వృద్ధులను, వికలాంగులను ప్రభుత్వం వేధనకు గురి చేస్తుందన్నారు. తొలగించిన పెన్షన్లపై పునః పరిశీలన చేసివారికి అందించాలన్నారు. లేనిపక్షంలో జనసేన పార్టీ ఉద్యమానికి సిద్ధమవుతుందని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, పోలిశెట్టి శ్రీనివాసులు, భాస్కర్ పంతులు, తాళ్లపాక శంకరయ్య, పోలిశెట్టి చెంగల్ రాయుడు, జనసేన వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.