విరించి ఆస్పత్రిపై చర్యలు.. పర్మిషన్ రద్దు చేసిన ఆరోగ్య శాఖ

కొవిడ్ తో బాధపడుతున్న వ్యక్తి మరణాకి కారణమైన విరించి ఆస్పత్రిపై వైద్య ఆరోగ్య శాఖ చర్యలు తీసుకుంది. 9 రోజుల కొవిడ్ చికిత్స కోసం విరించి ఆస్పత్రి రూ. 20 లక్షల బిల్లు వేసిన ఘటన సంచలమైన సంగతి తెలిసిందే. విరించి ఆస్పత్రి ఘటనపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. విరించి ఆస్పత్రి ఘటనపై దర్యాప్తునకు మంత్రి ఆదేశించారు. విచారణ జరపాలని డీహెచ్‌ శ్రీనివాస్‌కు కేటీఆర్‌ ఆదేశించారు. గతంలోనూ విరించి ఆస్పత్రిపై అనేక ఆరోపణలు వచ్చాయని, చర్యలు తీసుకోవాలని ట్విటర్‌లో కేటీఆర్‌ను ఓ యువకుడు కోరాడు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో విరించి ఆస్పత్రిపై తెలంగాణ వైద్యరోగ్యశాఖ చర్యలకు ఉపక్రమించింది. కరోనా ట్రీట్ మెంట్ పర్మిషన్ రద్దు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కొత్తగా కరోనా రోగులను ఆడ్మిట్ చేయించుకోవద్దు స్పష్టం చేసింది. అయితే, విరించిలో ఉన్న రోగులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చికిత్స ఇవ్వాలని ఆరోగ్య శాఖ ఆదేశించింది.

కాగా, శవాలపై కాసులు ఏరుకుంటున్న చందంగా మారింది విరించి హాస్పిటల్ తీరు మారిన సంగతి తెలిసిదే. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండి విరించిలో చేరిన ఓ వ్యక్తి 9 రోజుల ట్రీట్మెంట్ తర్వాత చనిపోయాడని డాక్టర్లు చెప్పారు. అంతేకాదు 9 రోజుల చికిత్స కోసం రూ. 20 లక్షల బిల్లు వేశారు. అయితే, పేషంట్ చెల్లి డాక్టర్ కావడంతో హాస్పిటల్ సిబ్బందితో తీవ్ర వాగ్వాదానికి దిగారు. తన అన్నకి కేవలం జ్వరం వచ్చిందని హాస్పిటల్ లో చేర్పిస్తే వాడికెందుకు ఒక గ్రాము స్టెరాయిడ్స్ ఇచ్చారని ఆమె డాక్టర్లను నిలదీశారు. ఈ క్రమంలో బాధితుడి బంధువులు ఆస్పత్రిలో ఆందోళనకు దిగారు. దీంతో ఆస్పత్రిలో ఉద్రిక్తత నెలకొంది. హాస్పిటల్ పై మృతుడి బంధువుల దాడి చేసి ఫర్నిచర్, అద్దాలు ధ్వంసం చేశారు. వైద్యల నిర్లక్ష్యం కారణంగానే తన అన్న మృతి చెందాడని బాధితురాలు ఆరోపించింది. చివరికి విరించి హాస్పిటల్ సిబ్బంది దిగివచ్చారు. రూపాయి కూడా కట్టకండి. బాడీ తీసుకెళ్లండి అంటూ విరించి హాస్పిటల్ బేరసారాలకి దిగింది.