విభిన్న భావోద్వేగాలు పలికించిన నటులు శ్రీ శరత్ బాబు

ప్రముఖ నటులు శ్రీ శరత్ బాబు గారు తుది శ్వాస విడిచారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో తెలిపారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీ శరత్ బాబు గారు కోలుకుంటారు అనుకున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. శ్రీ శరత్ బాబు గారితో నాకు చెన్నైలో చిత్ర పరిశ్రమ ఉన్న రోజుల నుంచీ పరిచయం ఉంది. నా మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి – ఇక్కడ అబ్బాయి’లో ఆయన ముఖ్య పాత్ర పోషించారు. ‘వకీల్ సాబ్’ చిత్రంలోనూ నటించారు. తెలుగు చిత్రాల్లో ఆయన తనదైన నటనను చూపించారు. కథానాయకుడిగానే కాదు సహాయ పాత్రల్లో, ప్రతినాయక పాత్రల్లో విభిన్న భావోద్వేగాలు పలికించారు. ఆయన మరణంతో చిత్ర సీమకు ఓ మంచి నటుడు దూరమయ్యారు. శ్రీ శరత్ బాబు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.