జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ డిపాజిటర్లకు న్యాయం చేయాలి

*సంస్థ లావాదేవీలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలి రాజకీయ పలుకుబడితోనే బోర్డు తిప్పేశారని సందేహం

కాకినాడకు చెందిన ‘ది జయలక్ష్మి కో ఆపరేటివ్ ఎమ్.ఎ.ఎమ్. సొసైటీలో డిపాజిట్లు చేసి మోసపోయిన వారికి ప్రభుత్వం న్యాయం చేయాలి. 20 వేల మంది డిపాజిటర్ల నుంచి రూ.520 కోట్ల మేర సేకరించిన సంస్థ ఇప్పుడు బోర్డు తిప్పిసిన తీరు అనేక సందేహాలు కలిగిస్తోంది. రాజకీయ పలుకుబడితోనే యాజమాన్యం ఇలాంటి సాహసానికి పాల్పడినట్టు సమాచారం ఉంది. బాధ్యుల పట్ల ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలి. పరారీలో ఉన్న యాజమాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి విచారించాలి. ఈ సంస్థ ఆర్థిక లావాదేవీలపై ఉన్నత స్థాయి విచారణ చేపట్టాలి. వీరి వెనుక ఎవరు ఉన్నా ఉపేక్షించరాదు. జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ వారు అధిక వడ్డీ ఆశ చూపడం వల్లే ప్రజలు ఆకర్షితులయ్యారు. ఈ సంస్థలో ఎక్కువ శాతం విశ్రాంత ఉద్యోగులు తమ పెన్షన్ బెనిఫిట్స్ డిపాజిట్ చేశారు. అలాగే పిల్లల చదువులు, పెళ్లిళ్ల కోసం అక్కరకు వస్తాయని నమ్మిన వారిని ఆ సంస్థ నట్టేట ముంచింది. డిపాజిట్ల రూపంలో సేకరించిన రూ. 500 కోట్లు దారి మళ్లినట్టు తెలుస్తోంది. జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైటీ బాధితులకు న్యాయం జరిగే వరకూ.. జనసేన పార్టీ అండగా ఉంటుంది. వారి పక్షాన పోరాటం చేస్తుంది. అగ్రిగోల్డ్ లాంటి సంస్థల బాధితులు ఇప్పటికీ న్యాయం కోసం ఏళ్ల తరబడి ఎదురు చూస్తూనే ఉన్నారు. జయలక్ష్మి కో ఆపరేటివ్ సొసైట్ బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని జనసేన పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం.