పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను తక్షణమే పరిష్కరించండి

  • అదనపు కమీషనర్ శ్రీనివాసరావుని కోరిన జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి, రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జేఏసీ నాయకులు సోమి శంకరరావు.

గుంటూరు, ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారం కాకుండా అపరిష్కృతంగా ఉన్న ఒప్పంద పారిశుద్ధ్య కార్మికుల సమస్యలను యుద్ధప్రాతిపదికన పరిష్కరించాలని జిల్లా జనసేన పార్టీ అధికార ప్రతినిధి ఆళ్ళ హరి అన్నారు. ఈ మేరకు గురువారం రాష్ట్ర మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సోమి శంకరరావుతో కలసి నగరపాలక సంస్థ అదనపు కమీషనర్ శ్రీనివాసరావుకు వినతిపత్రం అందచేశారు. ఈ సందర్భంగా కార్మికులు ఎదురుకుంటున్న పలు సమస్యలను అదనపు కమీషనర్ శ్రీనివాసరావు దృష్టికి తీసుకువెళ్లారు. ప్రధానంగా ఆరోగ్యభత్యం ఏడు నెలలుగా అందటం లేదని, రాష్ట్రంలో ఎక్కడా ఈ పరిస్థితి లేదని కేవలం ఒక్క గుంటూరు కార్పొరేషన్ లోనే ఈ దుస్థితి నెలకొందని ఆళ్ళ హరి ఆవేదన వ్యక్తం చేశారు. ఇన్ని నెలలుగా జీత భత్యాలు రాకపోతే కార్మికులు తమ కుటుంబాలను ఎలా పోషించుకుంటారని ప్రశ్నించారు. కార్మికులు తాము చేసిన పనికి మాత్రమే ప్రతిఫలం అడుగుతున్నారన్నారు. అధికారులు వెంటనే ఆరోగ్య భత్యాన్ని విడుదల చేసేలా కృషి చేయాలని ఆళ్ళ హరి అధికారులను కోరారు. మున్సిపల్ వర్కర్స్ యూనియన్ నాయకులు సోమి శంకరరావు మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికుల జీవితం అంతా సమస్యల మయంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ఐదు నెలల పాటు విధులు నిర్వర్తించిన కార్మికులకు ఇంతవరకు జీతాలు ఇవ్వలేదు అంటే ఇంతకన్నా ఘోరం ఇంకోటి ఉంటుందా అని ప్రశ్నించారు. చట్టబద్ధంగా కార్మికులకు అందాల్సిన 23 రకాల లబ్ధి ప్రభుత్వ నిర్లక్ష్యంతో అందటం లేదని మండిపడ్డారు. ఇప్పటికైనా కమీషనర్, సంభందిత అధికారులు స్పందించి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రెల్లి యువజన రాష్ట్ర నాయకులు సోమి ఉదయ్, శ్రీను, గణేష్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.