మంత్రి ఈటలపై భూకబ్జా ఆరోపణలు.. విచారణకు సీఎం ఆదేశం

మెదక్ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట శివారులోని భూముల కబ్జా వ్యవహారంపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. తమ భూములు కబ్జాకు గురయ్యాయని కొందరు రైతులు సీఎం కేసీఆర్‌కు ఫిర్యాదు చేశారు. మంత్రి ఈటల రాజేందర్, ఆయన అనుచరులు అక్రమంగా అసైన్డ్ భూములను కబ్జా చేశారని, గ్రామస్థులను బెదిరించాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈటల, ఆయన అనుచరులు సూరి, యంజాల సుధాకర్ రెడ్డి గ్రామస్థులను బెరిరించారని ఫిర్యాదు చేశారు. వారి చెర నుంచి భూములను విడిపించి వాటిపై శాశ్వత హక్కులను కల్పించాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ మేరకు ఫిర్యాదు ప్రతిని మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే మదన్‌రెడ్డి, సీఎస్ సోమేశ్ కుమార్, మెదక్‌ జిల్లా కలెక్టర్ హరీశ్‌లకు కూడా పంపించారు.

రైతుల నుంచి ఫిర్యాదు అందిన నేపథ్యంలో భూముల కబ్జా అంశంపై వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికను జిల్లా కలెక్టర్ ద్వారా తెప్పించి నివేదిక ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్‌ను సీఎం కేసీఆర్ ఆదేశించారు. భూముల విషయంలో వస్తున్న ఆరోపణల్లో నిజానిజాలను నిగ్గుతేల్చాల్సిందిగా విజిలెన్స్ డీజీ పూర్ణచందర్ రావును సీఎం అదేశించారు. సత్వరమే ఇందుకు సంబంధించిన ప్రాథమిక నివేదికను అందించి.. ఆ తర్వాత సమగ్ర దర్యాప్తు జరిపి నివేదికలను అందించాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు.