బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత.. కాన్వాయ్ పై రాళ్లు, కోడిగుడ్లతో దాడి..

ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్, బీజేపీ మధ్య నిన్నటి వరకు మాటల దాడి జరిగితే ఇవాళ ఏకంగా ప్రత్యక్షదాడులకు దిగారు. టీఆర్ఎస్, బీజేపీ అగ్రనేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది.

నల్గొండ జిల్లాలో ఆర్జాలబావి ఐకేపీ కేంద్రాన్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పరిశీలించారు. బండి సంజయ్ పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. నల్ల జెండాలు చూపిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు ఐకేపీ కేంద్రం వద్ద నిరసనకు దిగారు. బండి సంజయ్‌ అక్కడికి రాగానే బీజేపీకి వ్యతిరేకంగా టీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. బండి సంజయ్‌ గోబ్యాక్‌ అని నినాదాలు చేశారు. దీంతో టీఆర్ఎస్-బీజేపీ శ్రేణులకు మధ్య వాగ్వాదం జరిగింది. టీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అక్కడి నుంచి చెదరగొట్టి పరిస్థితి అదుపుచేశారు. ఉద్రిక్తతల మధ్యే బండి సంజయ్ ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

నల్గొండ జిల్లా తిప్పర్తి, కుక్కడంలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం రాశుల వద్దకు వెళ్లి రైతుల సమస్యలు తెలుసుకున్నాను. కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తీసుకొచ్చి రోజుల తరబడి నిరీక్షిస్తున్నామని,.. రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేయకుండా, మద్దతు ధర కల్పించకుండా ఇబ్బంది పెడుతోందంటూ రైతులు ఆవేదన చెందారు.

రాళ్లు, కోడిగుడ్లతో దాడి

సీఎం కేసీఆర్‌ బాధ్యత లేకుండా మాట్లాడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. రాష్ట్రంలో పండించిన ప్రతీ గింజా కొంటానన్న సీఎం.. ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు. సమస్య పరిష్కరించకుండా తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. సీఎం కేసీఆర్‌ గజనీ వేషాలు మానుకోని, వానాకాలంలో పంట మొత్తం కొనాలని డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ కార్యకర్తలు రైతుల్లాగా ఇక్కడికి వచ్చి గొడవకు దిగారని ఆరోంచారు. రైతులపై రాళ్లు, కోడిగుడ్లు వేస్తారా అని బండి సంజయ్ ప్రశ్నించారు. కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బండి సంజయ్‌ విమర్శించారు.

మిర్యాలగూడలోనూ ఉద్రిక్తత

బండి సంజయ్ మిర్యాలగూడ పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. మిర్యాలగూడ శెట్టిపల్లి మండలం వేములపాలెంలో టీఆర్ఎస్ బీజేపీ కార్యకర్తలు పోటాపోటీ నినాదాలు చేసుకున్నారు. బండి సంజయ్‌ పర్యటనను వ్యతిరేకిస్తూ టీఆర్ఎస్ కార్యకర్తలు నిరసన తెలిపారు. పోటీగా బీజేపీ శ్రేణులు కూడా నినాదాలు చేశాయి. పరిస్థితి ఉద్రిక్తంగా మారి ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. బండి సంజయ్‌ గో బ్యాక్ అంటూ టీఆర్ఎస్ శ్రేణులు నినాదాలు చేయగా రహదారిపై బైఠాయించి బీజేపీ కార్యకర్తలు ఆందోళన చేశారు. ఇరువర్గాలపై పోలీసులు లాఠీఛార్జ్‌ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు.