అరాచక పాలన పోవాలి – ప్రజా పాలన రావాలి

  • జనసేన నేత గురాన అయ్యలు

విజయనగరం: రాష్ట్రంలో అరాచక పాలన పోవాలి.. ప్రజా పాలన రావాలని జనసేన నేత గురాన అయ్యలు అన్నారు. పట్టణ పరిధిలో మంగళ వీధిలో ఆదివారం జనసేన శ్రేణులు ప్రజావ్యతిరేక జీవోలను రద్దు చేయాలంటూ జీవో కాపీలను భోగి మంటల్లో వేశారు. ఈ సందర్భంగా గురాన అయ్యలు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి రాష్ట్రంలో విధ్వంసకర పాలనను కొనసాగిస్తూ సైకో ఆనందం పొందుతున్నారని ఆరోపించారు. వైసిపి ప్రభుత్వంలో వనరుల దోపిడీ, బడుగు, బలహీన వర్గాలపై దాడులు పెరిగాయని విమర్శించారు. జగన్‌ రెడ్డి పాలనను ప్రశ్నిస్తే ఎంతటి వారిపైనైనా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం నడవడం లేదని, రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని మండిపడ్డారు. వైసిపి పాలనలో హంగు, ఆర్భాటమే తప్ప ప్రజలకు జరిగిన మేలు ఏమీ లేదని ఎద్దేవా చేశారు. జగన్‌ పాలనలో రాష్ట్రం 20 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయిందన్నారు. రాష్ట్రంలో ఖూనీ చేయబడ్డ ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు టీడీపీ, జనసేన పార్టీ కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలన్నారు. జగన్‌రెడ్డి వైఫల్యాలు, అవినీతి, అరాచక పాలనను ప్రజలకు వివరించాలన్నారు. వచ్చే ఎన్నికల్లో సైకో పాలనకు చరమగీతం పాడి, ప్రజా పాలనను తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు వజ్రపు నవీన్ కుమార్, ఏంటి రాజేష్‌, ఎమ్ .పవన్ కుమా, అడబాల వెంకటేష్‌ నాయుడు, పృథ్వీ భార్గవ్‌, గురజాపు వెంకటేష్‌, కంది సురేష్‌, కర్రోతు అప్పలనాయుడు, హిమంత్, వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.