అందాల రుషికొండ అరణ్య రోదన!

* విశాఖ తీరంలో విధ్వంస కాండ
*ప్రకృతిని నాశనం చేస్తూ పరిహాసం
* సీఆర్ జడ్ నిబంధనలు పట్టించుకోని ప్రభుత్వం
* కోర్టులకు తిరకాసు సమాధానాలు
* ఆరోపణలు లెక్క చేయని సర్కారు

వెన్నెల్లో పాలకంకిలా.. శిశిరంలో తేమ బిందువులా.. కొండల్లో కోయిల పాటలా… ఎండల్లో చినుకు జాడలా.. అందాల విశాఖ నగరం గురించి ఎంత వర్ణించినా ఏదో మిగిలిపోయిందన్న బాధ ఉండిపోతుంది. సముద్ర తీరాన వంపులు తిరుగుతూ నిర్మితమైన ఈ నగరం ఓ అద్భుతాల సంగమం. నిలువెత్తు రాజసానికి నిదర్శనం. ఈ సుందర నగరం గత మూడేళ్లుగా ఎందుకో మూగరోదన అనుభవిస్తోంది. గుండెల్లో తగులుతున్న గాయాలను అదిమిపట్టి ఆక్రోశిస్తోంది. విశాఖ వేదికగా జరుగుతున్న ప్రకృతి విధ్వసం అంతులేని విలాపాన్ని మిగుల్చుతోంది. ప్రకృతి అందాలతో తళుకులీనుతూ.. నిష్కలంకమైన మనుషుల మధ్య తొణికిసలాడుతూ కనిపించే విశాఖ రూపురేఖలు క్రమంగా మారిపోతున్నాయి. రుషికొండ విధ్వంసంతో విశాఖపట్నం నగరానికి ప్రమాద ఘంటికలు బలంగా వినిపిస్తున్నాయి. అందాల వెన్నముద్దలా ఉండే విశాఖ హంగులు జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మెల్లమెల్లగా కరిగిపోతున్నాయి.
రుషికొండ పర్యాటక ప్రాజెక్టు పునరుద్ధరణ పేరుతో ప్రభుత్వం సాగిస్తున్న విధ్వసం వివాదానికి దారి తీస్తోంది. దీనిపై వరుస కోర్టు కేసులు అసలు అక్కడ ఏ జరుగుతుందోనన్న ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ శాఖలను, కోర్టులను మభ్య పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అంత మొండిగా రుషికొండ విషయంలో ఎందుకు ముందుకు వెళ్తోంది అన్నది కూడా అంతుపట్టడం లేదు. కొండను చాలా వరకు చదును చేసి, తీర ప్రాంత క్రమబద్ధీకరణ మండలి (సీఆర్ జడ్) నిబంధనలను ప్రభుత్వమే ఉల్లంఘిస్తోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కొండను ఇష్టానుసారం తవ్వేయడంతో తీర ప్రాంత సహజ వాతావరణం పూర్తిస్థాయిలో దెబ్బతింటోందని పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– రుషికొండ పనులకు సంబంధించి ఏపీ పర్యాటకాభివృద్ధి శాఖ గతంలోనే సీఆర్ జడ్ అనుమతులకు దరఖాస్తు చేసింది. మే 19వ తేదీన కేంద్ర అటవీ పర్యావరణ శాఖ కొన్ని షరతులతో కూడిన అనుమతులు మంజూరు చేసింది. ఈ అనుమతులను చూపి.. క్షేత్రస్థాయిలో వాటికి భిన్నంగా పూర్తిగా విధ్వసం జరుగుతోందన్నది వివాదానికి కారణం. నిబంధనల మేరకు అనుమతులు ఇస్తే… వాటిని కాదని ఇష్టానుసారం తవ్వకాలు జరుపుతున్నారని న్యాయస్థానాల్లో కేసులు దాఖలయ్యాయి. దీంతో పాటు కేంద్ర అటవీశాఖకు సైతం రాష్ట్ర అధికారులు తప్పుడు సమాచారం ఇచ్చి అనుమతులు తెచ్చుకున్నారనే విషయం విస్మయం కలిగిస్తోంది.
– రుషికొండ హిల్ ఏరియా విస్తీర్ణం 61 ఎకరాలు. గతంలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిర్మాణాలు ఉండేవి. పర్యాటకులు ఇక్కడికి వచ్చి ప్రకృతి అందాలను ఆస్వాదించేవారు. రుషికొండ ప్రాంతం విశాఖ నగరానికి పచ్చటి పుట్టుమచ్చ. దీనిలో కేవలం 9.88 ఎకరాల్లో మాత్రమే ప్రాజెక్టును చేపట్టినట్లు ఏపీ పర్యాటక అభివృద్ధి సంస్థ అనుమతులు తెచ్చుకుంది. అయితే దీనికి భిన్నంగా క్షేత్రస్థాయిలో తవ్వకాలు, నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇచ్చిన అనుమతుల కంటే మూడింతలు ఎక్కువ తవ్వకాలు జరిగాయి. కొండ మధ్యలో చిన్న భాగం తప్ప.. మిగిలిన ప్రాంతమంతా తవ్వినట్లుగా శాటిలైట్ చిత్రాల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. సీఆర్ జడ్ అనుమతుల మేరకు మొత్తం కొండపై 139 చెట్లను మాత్రమే తొలగించినట్లుగా చూపి… క్షేత్రస్థాయిలో మాత్రం అడ్డువచ్చిన ప్రతి చెట్టును నరికేశారు.
– సీఆర్ జడ్ అనుమతులు కావాలంటే విశాఖ మహా ప్రాంత అభివృద్ధి సంస్థ నిబంధనలు కచ్చితంగా పాటించాలి. మాస్టర్ ప్లాన్ ప్రకారం నడుచుకోవాల్సి ఉంటుంది. ఇదేమీ పాటించకుండా కేంద్ర అటవీశాఖను తప్పుదోవ పట్టించారు. 2021 మాస్టర్ ప్లాన్ కాకుండా 2041 మాస్టర్ ప్లాన్ ప్రకారం సీఆర్ జడ్-2లో కొండను చూపి అనుమతులు తీసుకున్నారు. నవంబరు నుంచి అమలులోకి రావల్సిన 2041 మాస్టర్ ప్లాన్ ను ముందుగా అనుమతుల కోసం వాడుకోవడం గమనార్హం.
– మరోపక్క రుషికొండలో జరుగుతున్న పనుల్లో తవ్విన ఎర్రమట్టిని సముద్రతీరంలో వేయడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. తిమ్మాపురం నుంచి ఎర్రమట్టి దిబ్బల వరకు ఉన్న 10 కిలోమీటర్ల ప్రాంతంలో ఈ మట్టిని సముద్ర తీరంలోనే పారబోస్తున్నారు. దీంతో సహజ సముద్ర తీరం కాలుష్యకాసారంగా మారుతోంది. మత్స్య సంపదను పాడుచేస్తున్నారు.
*ప్రభుత్వం చెబుతున్న మాట ఇదీ…
– రుషికొండ మీద ఉన్న భవనాలను రీ డెవలప్ చేస్తామని మాత్రమే ప్రభుత్వం అనుమతులు తీసుకుంది. ఉన్న భవనాలను మరింత అందంగా నిర్మిస్తామని మాట ఇచ్చి అనుమతులు తెచ్చుకొని ఇష్టానుసారం తవ్వకాలు చేస్తోంది. రుషికొండపై గతంలో ఉన్న రిసార్టు పాతది కావడంతో దాని స్థానంలో విలాసవంతమైన సౌకర్యాలు కల్పించి, పర్యాటకులకు కొత్త అనుభూతి కలిగించేందుకు పనులు చేపడుతున్నాం. 9.88 ఎకరాల్లో 7 బ్లాకులు కొత్తవి నిర్మిస్తున్నాం. 5.18 ఎకరాల్లో నిర్మాణాలు, మిగిలిన చోట గ్రీన్ బెల్ట్ ఉంటుంది. 5.18 ఎకరాల నిర్మాణాల్లో 2.71 ఎకరాల్లో కాంక్రీటు నిర్మాణాలు రాబోతున్నాయి. ఈ ప్రాజెక్టు నవంబరు కల్లా పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోంది.
– ముందస్తు అనుమతి లేకుండా ఎవరైనా భవన నిర్మాణ పనులు చేపడితే జీవీఎంసీ టౌన్‌ ప్లానింగ్‌ విభాగం అధికారులు పనులను అడ్డుకుంటారు. అప్పటికే జరిగిన నిర్మాణాలను కూల్చివేస్తారు. కానీ రుషికొండలో ఇందుకు విరుద్ధంగా జరుగుతున్నా పట్టించుకోవడం లేదు.
– రుషికొండ వద్ద సీఆర్‌జడ్‌ నిబంధనలను ఉల్లంఘించి విధ్వంసం సృష్టిస్తున్నారని కొంతమంది ఇప్పటికే హైకోర్టులో పిటిషన్‌ వేశారు. దీనిపై విచారణ జరుగుతోంది. అయినప్పటికీ ఏపీటీడీసీ మాత్రం పనులను నిలుపుదల చేయడం లేదు. అంతేకాక కోర్టు నుంచి తమకు వ్యతిరేకంగా నిర్ణయం వస్తుందని గ్రహించిన పర్యాటకాభివృద్ధి సంస్థ అధికారులు.. ముందు జాగ్రత్తగా రుషికొండపై సర్వే నంబర్లు 19/1, 19/2, 19/3, 19/4లో 3 బ్లాక్‌ల నిర్మాణానికి బిల్డింగ్‌ ప్లాన్‌ జారీ చేయాలంటూ ముద్రగడ అరవింద్‌ అనే వ్యక్తి పేరుతో జూలై 13న ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేశారు. దరఖాస్తు ఫీజు కింద రూ.10 వేలు చెల్లించడంతో అతని పేరుతో తాత్కాలిక బీఏ నంబరు జనరేట్‌ అయింది. ఈ దరఖాస్తు జీవీఎంసీ అధికారులకు చేరడంతో దరఖాస్తులో పేర్కొన్న నిర్మాణాలకు సంబంధించిన డాక్యుమెంటులు, సీఆర్‌జడ్‌ ఎన్‌వోసీ, ఇతర పత్రాలను అందజేయాలని, అలాగే ప్లాన్‌ జారీకి డెవలప్ మెంట్‌ ఛార్జీలు, పర్మిషన్‌ ఫీజు, లేబర్‌సెస్‌ వంటివన్నీ కలిపి సుమారు రూ.19 కోట్లు చెల్లించాలని ఆదేశించారు. అప్పటి నుంచి ఎవరూ జీవీఎంసీ అధికారులను సంప్రదించకపోవడంతో దరఖాస్తు పెండింగ్‌లోనే ఉంది. జీవీఎంసీ అధికారులు కోరిన పత్రాలతో పాటు పేర్కొన్న ఫీజు చెల్లిస్తేనే శాశ్వత ప్లాన్‌ ప్రొసీడింగ్స్‌ జారీ అవుతాయి. అంతవరకూ అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. కానీ రుషికొండపై ఇప్పటికే ఒక అంతస్థు నిర్మాణం పూర్తి చేసి, రెండో అంతస్థు నిర్మాణానికి పనులు చురుగ్గా సాగుతున్నాయి.
*ప్రశ్నిస్తే కేసులే…
– రుషికొండపై జరుగుతున్న తవ్వకాలు, పర్యాటక ప్రాజెక్టు పునరుద్ధరణ పనులు ఎవరైనా పరిశీలించేందుకు వెళ్తున్నా వారిపై ఇష్టానుసారం పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. అంతా రహస్య పద్ధతిలో ఓ ప్రైవేటు సంస్థతో పనులు చేయిస్తున్నారు. జూలై 31న రుషికొండపై తవ్వకాల పరిశీలనకు సీనియర్‌ న్యాయవాది కేఎస్‌ మూర్తి, జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తి యాదవ్‌ వెళ్లారు. అయితే ప్రైవేటు స్థలంలోకి అక్రమంగా ప్రవేశించారంటూ అరిలోవ పోలీసులు వారిపై కేసు నమోదు చేశారు. ఇది అక్రమ కేసు అని, దానిని కొట్టివేయాలని కేఎస్ మూర్తి హైకోర్టులో అత్యవసర వ్యాజ్యం దాఖలు చేశారు. దీంతో తరుపరి చర్యలను కోర్టు నిలిపివేసింది. ఇలా ప్రతి ఒక్కరినీ కేసుల పేరుతో భయపెట్టడం ప్రభుత్వానికి అలవాటుగా మారింది.
– రుషికొండను పూర్తిగా చదును చేసి భవన నిర్మాణాలకు ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక శాఖ ప్రతిపాదనలను సిద్ధం చేస్తోందన్నది ఇప్పుడు ప్రధాన ఆరోపణ. రుషికొండపై 5 ఎకరాల విస్తీర్ణంలోనే నిర్మాణాలు చేపడుతున్నామని చెప్పిన ప్రభుత్వం దాదాపు 21 ఎకరాలలో పనులను కొనసాగిస్తోందన్నది న్యాయస్థానాల్లో వినిపిస్తున్న వాదన. మరొకటి ఏమిటంటే ఆంధ్రప్రదేశ్‌ పర్యాటక సంస్థ నిర్మిస్తున్న భవనాలు ఏవీ అద్దెకు ఇచ్చే మాదిరిగా లేవని, అవి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయం, సచివాలయ భవనాల మాదిరిగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *