అంధకారంలో ఆంధ్రప్రదేశ్!

* గ్రామాల్లో 11, పట్టణాల్లో 4 గంటలకు తగ్గకుండా విద్యుత్తు కోతలు
* రాత్రిపూట కోతలతో జనం విలవిల
* పరిశ్రమలపై తీవ్ర ప్రభావం
* ప్రభుత్వాసుపత్రుల్లో పని చేయని జనరేటర్లు
* విద్యుత్ సరఫరాలో ఘోర వైఫల్యం

రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం తలెత్తింది. రాష్ట్ర విభజనకు ముందు పరిస్థితులు మరోసారి గుర్తుకు వస్తున్నాయి. గ్రామాల్లో పగలు రాత్రి తేడా లేకుండా రోజుకు 11 నుంచి 14 గంటల వరకు విద్యుత్ కోత వేస్తున్నారు. ప్రధాన పట్టణాల్లోనూ కనీసం రోజుకు నాలుగు గంటలు విద్యుత్ సరఫరా నిలిపి వేస్తున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగినట్టు కనిపించడం లేదు. విద్యుత్ కోతలు అమలు చేస్తున్నట్టు కూడా ప్రకటించలేదు. లోడ్ రిలీఫ్ సర్దుబాటు పేరుతో ఎడాపెడా కరెంటు కోతలు అమలు చేస్తున్నారు. రాత్రి పూట కరెంటు కోతలతో ఉక్కపోతకు గురై జనం అల్లాడుతున్నారు. మరో వైపు విద్యార్ధులకు పరీక్షలు ఉండటంతో లాంతర్ల కింద చదువుకోవాల్సిన దుస్థితి నెలకొంది. కరెంటు కోతలతో ఫ్యాన్లు పనిచేయక దోమలు విరుచుకు పడుతున్నాయి. చివరకు ప్రభుత్వ ఆసుపత్రులకూ విద్యుత్ కోతలు తప్పడం లేదు. జంగారెడ్డిగూడెం, నర్సీపట్నం ప్రభుత్వ ఆసుపత్రుల్లో జనరేటర్లు పనిచేయకపోవడంతో రోగులు అవస్థలు పడుతున్నారు. జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో కరెంటు లేక మొబైల్ టార్చ్ వెలుతురులో కాన్పులు చేయాల్సిన దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి. ఇక విద్యుత్ కోతలతో పరిశ్రమలు పడకేస్తున్నాయి. లక్షలాది మంది ఉపాధికి కరెంటు కోతలు గండి కొడుతున్నాయి. పాలకుల నిర్లక్ష్యంతో రాష్ట్రంలో చీకట్లు అలుముకున్నాయి.
* విద్యుత్ డిమాండ్ ఎంత? సరఫరా ఎలా ఉంది?
రాష్ట్రంలో అన్ని రంగాలకు కలపి రోజుకు 232 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉండగా 196 మిలియన్ యూనిట్లు మాత్రమే సరఫరా చేయగలుగుతున్నారు. వేసవిలో గరిష్ఠంగా 240 నుంచి 250 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటోంది. పీపీఏల ద్వారా 192 మిలియన్ యూనిట్లు మాత్రమే అందుతోంది. కోతలు లేకుండా విద్యుత్ సరఫరా చేయాలంటే ప్రతి రోజూ మరో 50 మిలియన్ యూనిట్లు కొనుగోలు చేయాల్సి ఉంది. థర్మల్ ద్వారా 110 ఎంయూలు, జల విద్యుత్ 9.5, పవన, సౌర విద్యుత్ 26 ఎంయూలు, కేంద్ర సంస్థల నుంచి మరో 40 ఎంయూలు వచ్చినా 50 మిలియన్ యూనిట్ల లోటు ఏర్పడింది. 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ కొనుగోలు చేయాలంటే రోజుకు కనీసం రూ.75 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంది. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు ఇచ్చే పరిస్థితే లేనప్పుడు ఇక రోజుకు రూ.75 కోట్లు ఖర్చు చేసి ప్రభుత్వం విద్యుత్ కొనుగోలు చేస్తుందని ఆశించలేం. రాష్ట్రంలో ఉత్పత్తి అవుతోన్న 192 మిలియన్ యూనిట్ల విద్యుత్ తో పాటు, జాతీయ గ్రిడ్ నుంచి రోజూ 4 మిలియన్ యూనిట్లు అదనంగా డ్రా చేసినా ఇంకా లోటు ఏర్పడుతోంది. లోటును భర్తీ చేసేందుకు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాలంటే యూనిట్ రూ.15 నుంచి రూ.20 దాకా పడుతోంది. ఏపీ డిస్కంలు దాఖలు చేసిన బిడ్ రేటుకు కరెంటు దొరకడం లేదు. దీంతో రాష్ట్రంలో 25 శాతం లోటు ఏర్పడింది. కరెంటు లోడ్ రిలీఫ్ పేరుతో గ్రామాల్లో అడ్డగోలు కోతలు వేస్తున్నారు. గడచిన పది రోజులుగా గ్రామాల్లో రోజుకు 11 నుంచి 14 గంటల విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. రాత్రి రెండు దఫాలు, పగటి పూట రెండు దఫాలు విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. విద్యుత్ డిమాండ్ రోజు రోజుకు పెరిగిపోవడంతో సరఫరాలో తీవ్ర అంతరాయాలు ఏర్పడుతున్నాయి.
* చెప్పే లోటుకు…. వేసే కోతకు సంబంధం లేదేం?
అధికారులు కేవలం పది శాతం మాత్రమే లోటు ఉందని చెబుతున్నారు. పది శాతమే కరెంటు లోటు ఉంటే 14 గంటలు కోత ఎందుకు వేస్తున్నారనే అనుమానం కలుగుతోంది. అధికారులు లోటు పది శాతం మాత్రమే అంటున్నా వాస్తవంగా ఇది 25 శాతం దాకా ఉండవచ్చని విద్యుత్ రంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. పది శాతం లోటు ఉంటే రోజుకు కేవలం 2 నుంచి 3 గంటలు మాత్రమే కరెంటు కోతలు అమలు చేస్తే సరిపోతుంది. పట్టణాల్లో 4 నుంచి 6 గంటలు, మున్సిపాలిటీల్లో కనీసం 5 నుంచి 8 గంటలు, గ్రామాల్లో 11 నుంచి 14 గంటలపాటు విద్యుత్ కోతలు వేస్తున్నారంటే విద్యుత్ లోటు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. రోజుకు 50 మిలియన్ యూనిట్ల విద్యుత్ లోటు మాత్రమే ఉందని ప్రభుత్వం చెబుతున్న మాటలు పచ్చి అబద్దం అని తేలి పోతోంది. పీక్ అవర్స్ లో లోటు మరీ ఎక్కువగా ఉంటోంది. సాయంత్రం 6 గంటల నుంచి 10 గంటల సమయంలో కోతలు ఎక్కువగా అమలు చేస్తున్నారు. అయితే అధికారులు కానీ, ప్రభుత్వం కానీ విద్యుత్ కోతల సమయాలను నిర్ధిష్టంగా ప్రకటించలేదు. అలా ప్రకటిస్తే విద్యుత్ కోతలు అంగీకరించినట్టు అవుతుంది. అందుకే చెప్పాపెట్టకుండా ఎడాపెడా విద్యుత్ కోతలు వేస్తున్నారు. కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో కూడా తెలియని గందరగోళ పరిస్థితి నెలకొంది.
* ఎందుకు ఇలా జరుగుతోంది?
కృష్ణపట్నంలో 1500 మెగావాట్ల థర్మల్ విద్యుత్ కేంద్రం ఉంది. బొగ్గు కొరత కారణంగా కేవలం అక్కడ 800 మెగావాట్లు మాత్రమే ఉత్పత్తి అవుతోంది. అంటే 700 మెగావాట్ల విద్యుత్ నిలిచిపోయిందని అధికారులే చెబుతున్నారు. ఇది కాకుండా మరో 800 మెగావాట్ల మూడో యూనిట్ విద్యుత్ కేంద్రం సిద్దమైంది. బొగ్గు కొరత కారణంగా ఆ కేంద్రాన్ని ప్రారంభించలేదు. బొగ్గు బకాయిలు రూ.5000 కోట్లు పేరుకు పోవడంతో బొగ్గు సరఫరా తగ్గించారు. దీంతో రాష్ట్రంలో థర్మల్ విద్యుత్ కేంద్రాలు కేవలం 75 శాతం సామర్థ్యంతోనే నడుస్తున్నాయని తెలుస్తోంది. థర్మల్ కేంద్రాలు ప్లాంట్ లోడ్ ఫ్యాక్టర్ కనీసం 90 శాతంపైగా ఉండాలి. కానీ బొగ్గు సరఫరా లేక చాలా థర్మల్ కేంద్రాల్లో కొన్ని యూనిట్లు పనిచేయడంలేదు. దీంతో రాష్ట్రం అంధకారంలోకి జారుకుంది.
* వేసవి అవసరాలు ముందుగా తెలియదా?
వేసవి అవసరాలు అంచనా వేసుకుని విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు ముందే చేసుకోవాలి, లేదా థర్మల్ కేంద్రాలు 90 శాతం సామర్థ్యంతో పనిచేసేలా బొగ్గు నిల్వలు పెంచుకోవాలి. కనీసం 30 రోజులకు సరిపడా థర్మల్ కేంద్రాల్లో బొగ్గు నిల్వ ఉంచుకోవాలి. కానీ రాష్ట్రంలో ఏ థర్మల్ కేంద్రంలోనూ మూడు రోజుల అవసరాలకు మించి బొగ్గు నిల్వలు లేవు. ఇక నిర్మాణం పూర్తైన కృష్ణపట్నంలోని 800 మెగావాట్ల విద్యుత్ కేంద్రం ప్రారంభించి ఉంటే విద్యుత్ కోతలు సగమైనా నివారించగలిగే వారే. వేసవిలో 240 నుంచి 250 మిలియన్ యూనిట్ల విద్యుత్ అవసరం ఉంటుందని అధికారుల వద్ద స్పష్టమైన సమాచారం ఉంది. రాష్ట్రంలో కేవలం 192 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి అవుతుందని తెలుసు. మరి లోటు పూడ్చుకునేందుకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అంటే శూన్యం. ప్రభుత్వ పెద్దల నుంచి ఆదేశాలు రాకుండా అధికారులు మాత్రం ఏం చేస్తారు. ఇప్పటి కిప్పుడు విద్యుత్ కొనుగోలు చేయాలంటే ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది. ఒక్కోసారి ఎంత వెచ్చించడానికి సిద్ధమైనా విద్యుత్ కొనుగోలు చేయాలంటే దొరికే పరిస్థితి ఉండదు. పాలకులకు ప్రధానంగా ఉండాల్సింది ముందుచూపే కదా. తెలంగాణ ప్రభుత్వం ముందు చూపుతో పీపీఏలు చేసుకుంది. నేడు రోజుకు 290 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయగలుగుతోంది. ఆ మాత్రం ముందు చూపు లేకపోతే ఇక ప్రజలకు చీకట్లు గాక ఏం మిగిలుతాయనే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే విద్యుత్ కోతలతో జనం బలికావాల్సి వస్తోందనేది అక్షర సత్యం.
* ఏ జిల్లాలో ఎన్ని గంటల కరెంటు కోతలు….
రాష్ట్రంలో విద్యుత్ కోతలు లేని ప్రాంతమంటూ లేదు. చివరకు సీఎం నివాసం ఉంటున్న తాడేపల్లిలో కూడా విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. ఇక పక్కనే ఉన్న ఎన్టీఆర్ జిల్లా తిరువూరు మండలం మొత్తం మంగళవారం అర్థరాత్రి 5 గంటలు కరెంటు నిలిపివేశారు. మరలా పగలు నాలుగు గంటలు, సాయంత్రం మరో రెండు గంటలు కోత వేశారు. రోజు మొత్తం మీద 11 గంటలు కరెంటు కోతలు అమలు చేశారు. ఇక విజయనగరం జిల్లా రామభద్రాపురంలోనూ ఇదే దుస్థితి నెలకొంది. ప్రకాశం జిల్లా దర్శి మండలంలో మంగళవారం 14 గంటల కోత అమలు చేశారు. ఇలా ప్రతి జిల్లాలో ప్రతి ప్రాంతంలో విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. కార్పొరేషన్లలో రోజుకు 4 గంటలు, మున్సిపాలిటీల్లో రోజుకు 5 నుంచి 8 గంటలు, గ్రామాల్లో 11 నుంచి 14 గంటల విద్యుత్ కోతలు అమలు చేస్తున్నారు. ఒక టైం లేకుండా కోతలు వేయడంతో కుటీర పరిశ్రమలు కుదేలయ్యాయి. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వారు జీవనోపాధి కోల్పోతున్నారు. కరెంటు కోతలతో పంటలకు సకాలంలో నీరు పారించలేక రైతులు కూడా తీవ్ర నష్టాల పాలవుతున్నారు. ఆధునిక కాలంలో విద్యుత్ లేకుండా క్షణం కూడా గడవని పరిస్థితుల్లో గంటల కొద్దీ కోతలు వేయడంతో జనజీవనం అస్తవ్యస్తం అవుతోందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.